(Source: ECI/ABP News/ABP Majha)
Tim Cook: కుంభస్థలం కొట్టిన కుక్, రెండు రోజుల్లో రూ.345 కోట్ల సంపాదన
యాపిల్ చీఫ్ దగ్గర ఇంకా 3.3 మిలియన్ షేర్లు ఉన్నాయి.
Apple CEO Tim Cook: ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ జెయింట్ ఆపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇటీవల, కేవలం రెండు రోజుల్లో ఏకంగా రూ. 345 కోట్లు (దాదాపు 41.5 మిలియన్ డాలర్లు) సంపాదించారు. టిమ్ కుక్, గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో షేర్లను విక్రయించి ఈ డబ్బు ఆర్జించారు. పన్ను చెల్లింపులు పోగా టిమ్ కుక్‌కు మిగిలిన మొత్తం ఇది.
స్టాక్ మార్కెట్‌కు ఆపిల్ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం... టిమ్ కుక్, తన దగ్గరున్న ఆపిల్ షేర్ల నుంచి 5,11,000 షేర్లను విక్రయించారు. వీటిలో... శుక్రవారం 2,70,000 షేర్లను విక్రయించగా, సోమవారం మరో 2,41,000 షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. ఈ రెండు లావాదేవీల ద్వారా అతనికి 87.8 మిలియన్ డాలర్లు (పన్ను చెల్లింపులకు ముందు) వచ్చాయి. 2021 ఆగస్టులో 750 మిలియన్ డాలర్ల విలువైన ఆపిల్ షేర్లను టిమ్ కుక్ సేల్ చేశారు. ఆ తర్వాత అతను చేసిన పెద్ద స్థాయి ట్రాన్‌జాక్షన్ ఇదే.
కంపెనీలో టిమ్ కుక్ వాటా మారలేదు
కుక్, తన యాపిల్ షేర్లను విక్రయించినప్పటికీ, యాన్యువల్ కాంపెన్షేషన్ ప్లాన్ కింద కంపెనీ నుంచి అదే సంఖ్యలో షేర్లను అందుకున్నారు. కాబట్టి, కంపెనీలో అతని మొత్తం వాటా మారలేదు. 5.11 లక్షల షేర్లను విక్రయించిన తర్వాత కూడా యాపిల్ చీఫ్ దగ్గర ఇంకా 3.3 మిలియన్ షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ షేర్ మార్కెట్ రేటు ప్రకారం, ఈ మొత్తం షేర్ల విలువ 565 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.
ఈ ఏడాది జులైలో, ఆపిల్ కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 198.23 డాలర్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత కంపెనీ సేల్స్ పడిపోవడంతో 13 శాతం వరకు క్షీణించాయి. టిమ్ కుక్, 2023 సంవత్సరానికి తాను తీసుకునే జీతభత్యాల్లో 40 శాతం భారీ కోత విధించుకున్నారు. ఆ సమయంలోనే షేర్లను విక్రయించాలని కూడా నిర్ణయించుకున్నారు. టిమ్ కుక్ జీతం (Tim Cook salary) ఇప్పుడు 49 మిలియన్ డాలర్లు. గతేడాదితో పోలిస్తే, టిమ్ కుక్‌కు ఈ ఏడాది వచ్చే స్టాక్ అవార్డులు 50 శాతం నుంచి 75 శాతానికి పెరిగాయి.
టిమ్ కుక్ ఆస్తుల విలువ
టిమ్ కుక్ ప్రస్తుత నికర విలువ (Tim Cook networth) దాదాపు 2 బిలియన్ డాలర్లు. 2023 సంవత్సరానికి తన జీతభత్యాల్లో 40 శాతం కోత విధించుకున్న టిమ్ కుక్, 2022 సంవత్సరంలో 99.4 మిలియన్ డాలర్లను (రూ. 815 కోట్లు) అందుకున్నారు, ఇందులో 3 మిలియన్ డాలర్ల జీతం కూడా ఉంది. ఇది కాకుండా, 83 మిలియన్ల స్టాక్ అవార్డ్, బోనస్ కూడా తీసుకున్నారు. ఇది, 2021లో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ. 2021లో, టిమ్ కుక్ 98.7 మిలియన్ డాలర్లు డ్రా చేశారు.
యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ డీర్ ఓబ్రెయిన్, కేథరీన్ ఆడమ్స్ వంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా తమ షేర్లను విక్రయించారు. వాళ్లిద్దరూ కలిసి 11.3 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మారు.
ఆపిల్ కంపెనీ 2.7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీగా కొనసాగుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు దీని మార్కెట్ క్యాప్ 628 బిలియన్ డాలర్లు పెరిగింది. అయితే, ఈ ఏడాది జులైలోని కంపెనీ ఆల్ టైమ్ గరిష్ట విలువ 3.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 376 బిలియన్లు తగ్గింది.
మరో ఆసక్తికర కథనం: డబ్బు సంపాదించే షార్ట్‌కట్స్ చెప్పిన యాక్సిస్ సెక్యూరిటీస్, ఈ లెక్క నిజమైతే ధనవర్షమే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial