TCS: టీసీఎస్ సీఈవో రాజీనామా, కొత్త బాస్ పేరును వెంటనే ప్రకటించిన కంపెనీ
రాజేష్ గోపీనాథన్ వారసుడిగా కె.కృతివాసన్‌ను తదుపరి సీఈవోగా తక్షణం నియమించింది.
TCS MD & CEO Rajesh Gopinathan Resigns: దేశంలోనే అతి పెద్ద IT కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో అత్యున్నత స్థాయి నాయకత్వ మార్పు జరిగింది. టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్, తన రాజీనామా చేశారు. కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రాజేష్ గోపీనాథన్ వారసుడిగా కె.కృతివాసన్‌ను తదుపరి సీఈవోగా తక్షణం నియమించింది.
"2023 మార్చి 16 నుంచి అమల్లోకి వచ్చేలా కె.కృతివాసన్ తదుపరి CEOగా డైరెక్టర్ల బోర్డు నామినేట్ చేసింది. సంస్థలో 1989 నుంచి వివిధ హోదాల్లో ఉన్న వాసన్, 2023-24లో MD & CEOగా బాధ్యతలు స్వీకరిస్తారు" అని అధికారిక ప్రకటనలో TCS పేర్కొంది.
సెప్టెంబరు 15 వరకు అదే హోదా
రాజేష్ గోపీనాథన్ రాజీనామనా చేసినా, ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు అదే హోదాలో కొనసాగుతారు. CEO పీఠంపై కృతివాసన్ నిలదొక్కుకునేలా సూచనలు చేస్తారు. నాయకత్వ మార్పు సాఫీగా జరిగేలా చూస్తారు.
కె.కృతివాసన్ (K Krithivasan) ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్‌నకు గ్లోబల్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత 34 సంవత్సరాలుగా TCSతో అనుబంధం కలిగి ఉన్నారు.
రాజేష్ గోపీనాథన్ TCSలో 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. గత ఆరేళ్లుగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టీసీఎస్ సీఈవో ఛైర్ నుంచి టాటా సన్స్ ఛైర్మన్‌గా 2017 ఫిబ్రవరిలో ఎన్.చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే, చంద్రశేఖరన్ వారసుడిగా గోపీనాథన్ వచ్చారు. అప్పటి నుంచి టీసీఎస్‌ను ముందుండి నడిపిస్తున్నారు.
కొత్త జీవితం కోసం రాజీనామా
టీసీఎస్‌తో 22 ఏళ్ల ప్రయాణం చాలా ఉత్తేజకరమైనదని, రాజీనామా ప్రకటన తర్వాత రాజేష్ గోపీనాథన్ వెల్లడించారు. తన జీవితంలోని తదుపరి దశలో ఏం చేయాలన్నదానిపై తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి 2023 సరైన సమయమని, అందుకే టీసీఎస్ నుంచి బయటకు వెళుతున్నట్లు తెలిపారు. ఎన్.చంద్రశేఖరన్‌తో కలిసి పనిచేసిన అనుభవం చాలా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. కె.కృతివాసన్‌తో కలిసి పనిచేసిన అనుభవాలపైనా మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా క్రితితో కలిసి పనిచేశానని, టీసీఎస్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లగల సమర్థుడని తాను నమ్ముతున్నానని, కృతి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తానని గోపీనాథన్ చెప్పారు.
రాజేష్ గోపీనాథన్ హయాంలో టీసీఎస్ బిజినెస్ 10 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని, మార్కెట్ విలువ కూడా 70 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు
ఐటీ రంగంలో, కేవలం వారం రోజుల వ్యవధిలోనే దలాల్ స్ట్రీట్ చూసిన రెండో అతి పెద్ద నాయకత్వ మార్పు ఇది. ఇన్ఫోసిస్ (Infosys) ప్రెసిడెంట్ పదవికి గత వారం రాజీనామా చేసిన మోహిత్ జోషి, టెక్ మహీంద్రలో (Tech Mahindra) చేరారు. డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్న సీపీ గుర్నానీ స్థానంలో ఆ కంపెనీ MD & CEO గా జోషి విధులు నిర్వహిస్తారు.