Tax On Equity: షేర్ల లావాదేవీలపై పన్నుల్లో రూపాయి కూడా తగ్గించరట, కేంద్రం చెప్పింది
పన్ను తగ్గించే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని ప్రభుత్వం వెల్లడించింది.
Tax On Equity Transactions: షేర్ల కొనుగోలు & విక్రయాలపై విధించే పన్నును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో, ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది.
షేర్ల కొనుగోలు & అమ్మకాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నును తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని రాజ్యసభ ఎంపీ రాజమణి పటేల్ ఆర్థిక శాఖను ప్రశ్నించారు. షేర్ల కొనుగోలు, అమ్మకాలపై పన్ను తగ్గించే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధ్రి, లిఖిత పూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.
షేర్ల కొనుగోలు & విక్రయాలపై ఎన్ని రకాల పన్నులో..?
ఆదాయ పన్ను (Income Tax), జీఎస్టీ (GST), స్టాంప్ డ్యూటీ (Stamp Duty), సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (Securities Transaction Tax - STT) సహా షేర్ల కొనుగోలు & అమ్మకాలపై ప్రభుత్వం ఏయే రకాల పన్నులు విధిస్తోంది అని రాజమణి పటేల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. ఆదాయపు పన్ను చట్టం- 1961 ప్రకారం, వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధించిన విధంగానే షేర్ల వ్యాపారం చేయడం ద్వారా వచ్చే ఆదాయం మీద కూడా కూడా పన్నును విధిస్తున్నాం. అంతే కాకుండా, లాభాల్లో ఉన్న షేర్లను విక్రయించడం ద్వారా వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్‌గా పరిగణిస్తామని, ఆ లాభం మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (Capital Gains Tax) విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు, షేర్ల కొనుగోలు & అమ్మకం లావాదేవీలపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా విధించే నిబంధన ఉందని పంకజ్ చౌధ్రి వెల్లడించారు.
షేర్ల లావాదేవీలకు GST వర్తించదు
చట్ట ప్రకారం, వ్యాపార ఆదాయం లేదా మూలధన లాభంపై ఆదాయపు పన్ను విధించడం జరుగుతుందని పంకజ్ చౌధ్రి చెప్పారు. సెక్యూరిటీ లావాదేవీ పన్ను (సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్) అనేది ఆదాయ చట్ట ప్రకారం విధించే పన్ను కాదు, ఇది మరొక ప్రొవిజన్ ప్రకారం వసూలు చేసే ఒక రకమైన లావాదేవీ పన్నుగా వెల్లడించారు. షేర్ల కొనుగోలు, అమ్మకాలపై GST వర్తించదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. GST చట్టం ప్రకారం వస్తువులు & సేవల పరిధి నుంచి షేర్లను మినహాయించారని, వస్తువులు & సేవల సరఫరాపై మాత్రమే GST విధిస్తారని తన లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు.
ఒకవేళ మీరు ఒక స్టాక్ కొని, ఒక సంవత్సరం తర్వాత లాభానికి ఆ షేర్లను విక్రయించినట్లయితే, మీకు వచ్చే లాభంపై 10% మూలధన లాభం పన్ను (Capital Gains Tax) విధించే నిబంధన చట్టంలో ఉంది. షేర్లను కొనుగోలు చేసిన ఒక సంవత్సరం లోపు లాభానికి విక్రయిస్తే, ఆ లాభం మీద 15% స్వల్పకాలిక మూలధన లాభం పన్ను (Short-term Capital Gains Tax) విధిస్తారు.
2018లో, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈక్విటీపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ని ప్రవేశపెట్టింది.