TATA Wants Haldirams: హల్దీరమ్స్‌లో వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తున్న టాటా గ్రూప్ ?
TATA Wants Haldirams: హల్దీరమ్స్ లో వాటా కొనుగోలు చేసేందుకు దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ స్నాక్స్ మేకర్ సంస్థ హల్దీరమ్స్ లో వాటా కొనుగోలు చేసేందుకు దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో హల్దీరమ్స్‌కు మంచి పేరున్న సంగతి తెలిసిందే. దేశీయ స్నాక్స్ అంటే మొదట గుర్తొచ్చేది ఇవే. ఎన్నో రకాల పదార్థాలతో మంచి బిజినెస్ చేస్తోంది. అయితే హల్దీరమ్స్‌లో మెజార్టీ వాటాను టాటా కొనుగోలు చేయాలని టాటా సంస్థ భావిస్తుండగా హల్దీరమ్స్ ఎక్కువ వాల్యుయేషన్ చెప్తున్నట్లు సమాచారం. హల్దీరమ్స్ 51 శాతం వాటాకు ఆ కంపెనీ 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ చెప్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అది చాలా ఎక్కువ అని టాటా కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ వాస్తవమైతే, విజయవంతంగా డీల్ జరిగితే పెప్సీ కంపెనీ, ముకేశ్ అంబానీ రిలయన్స్ రిటైల్‌కు గట్టి పోటీ కానుంది. హల్దీరమ్స్ 10 శాతం వాటా విక్రయానికి బైన్ క్యాపిటల్ సహా మరికొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.
యూకేలో టీ కంపెనీ టెట్లీ, భారత్‌లో స్టార్‌బక్స్‌లో వాటా కలిగిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ హల్దీరమ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు రాయిటర్స్ అనే వార్తాసంస్థ వెల్లడించింది. టాటా కంపెనీ హల్దీరమ్స్‌లో 51శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయాలనుకుంటుంది, కానీ హల్దీరమ్స్ చాలా ఎక్కువ వాల్యుయేషన్ చెప్తోందని చర్చల గురించి అవగాహన ఉన్న ఓ వ్యక్తి వెల్లడించినట్లు తెలిపింది. టాటా (కన్స్యూమర్) కంపెనీని టీ కంపెనీగా పరిగణిస్తున్నారని, హల్దీరమ్స్‌తో కలిస్తే మార్కెట్ పెంచుకోవడానికి చాలా బాగుటుందని, టాటాకు ఇది మంచి అవకాశమని, మార్కెట్ షేర్ కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించినట్లు పేర్కొంది.
అయితే ఈ వార్తలపై హల్దీరమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిషన్ కుమార్‌ను దీనిపై ప్రశ్నించగా ఆయన స్పందించడానికి నిరాకరించారు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. అవి మార్కెట్ ఊహాగానాలని, వాటిపై స్పందించనని కొట్టిపడేశారు.
హల్దీరమ్స్ కంపెనీని 1937లో స్థాపించారు. మొదట ఒక చిన్న షాప్‌గా ఇది ప్రారభమైంది. కరకరలాడే భుజియా స్నాక్‌కు ఇది ఫేమస్‌గా ఉండేది. రూ.10కి దానిని విక్రయించేవారు. నెమ్మది నెమ్మదిగా హల్దీరమ్స్ ఎదుగుతూ వచ్చింది. ఎన్నో రకాల స్నాక్స్‌తో భారత మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు భారత్ 6.2 బిలియన్ డాలర్ స్నాక్ మార్కెట్‌లో దాదాపు 13 శాతం వాటా సంపాదించుకుంది. లేస్ చిప్స్‌కు ఫేమస్ అయిన పెప్సీ కంపెనీ కూడా దాదాపు 13శాతం వాటా కలిగి ఉంది. విదేశాలలో కూడా హల్దీరమ్స్‌కు మంచి పేరుంది. అక్కడ కూడా అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్, అమెరికాలో హల్దీరమ్స్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీకి దాదాపు 150 రెస్టారెంట్స్ ఉన్నాయి. వీటిలో స్థానిక వంటకాలు, స్వీట్స్, విదేశీ వంటకాలను కూడా విక్రయిస్తారు.