Jio Financial: కీలక సూచీలకు గుడ్‌బై, శుక్రవారం నుంచి ఈ కంపెనీ షేర్లు కనిపించవు!
ఈ షేర్లు గత రెండు సెషన్లలో లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేయలేదు.
Jio Financial Service Share Price: ఒక తంతు ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరు పడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) స్టాక్, అన్ని S&P BSE ఇండెక్స్‌లకు బైబై చెప్పే టైమ్ వచ్చింది. ఇండెక్స్‌ల్లో భాగంగా ట్రేడ్ కావడం ఈ షేర్లకు గురువారమే (31 ఆగస్టు 2023) ఆఖరు రోజు.
శుక్రవారం (01 సెప్టెంబర్ 2023) మార్కెట్ ప్రారంభానికి ముందే అన్ని S&P BSE సూచీల నుంచి ఈ స్టాక్‌ను తొలగిస్తామని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది.
ఈ షేర్లు గత రెండు సెషన్లలో లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేయలేదు. దీంతో, స్టాక్ మార్కెట్ రూల్స్ ప్రకారం కీ ఇండెక్స్‌ల నుంచి తొలగిస్తున్నారు. దీంతో, శుక్రవారం నుంచి ఈ షేర్లు కీలక ఇండెక్స్‌ల్లో కనిపించవు. అయితే, మామూలుగానే ట్రేడింగ్ జరుగుతుంది.
పాసివ్ ఫండ్స్ కోసం కీలక ఇండెక్స్‌ల్లో చోటు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు లిస్ట్ అయిన తర్వాత పాసివ్ ఫండ్స్ కారణంగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. వరుస సెషన్లలో లోయర్ సర్క్యూట్ కొట్టాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లైన నిఫ్టీ50, సెన్సెక్స్ నుంచి స్టాక్ ఎక్సేంజీలు JFSL తీసివేయడానికి ముందే తమ పోర్ట్‌ఫోలియోలను పాసివ్ ఫండ్స్ సర్దుబాటు చేసుకోవాలి కాబట్టి, ఆ షేర్లను వదిలించుకోవడానికి చూశాయి. ఆ అమ్మకాల ఫలితమే వరుస లోయర్ సర్క్యూట్లు. ఇప్పుడు ఆ అస్థిరత తగ్గింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) నుంచి డీమెర్జర్ తర్వాత పాసివ్ ఫండ్స్ కూడా 1:1 రేషియోలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లను అందుకున్నాయి. JFSL అనేది బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల్లో భాగం కాదు కాబట్టి, ఆయా షేర్లను ట్రేడ్ చేయడానికి
కొత్త ఇండెక్స్ మెథడాలజీ ప్రకారం పాసివ్ ఫండ్స్‌కు అవకాశం కల్పించారు. ఇందుకోసం, JFSL షేర్లను తాత్కాలికంగా కీలక సూచీలకు యాడ్ చేశారు.
JFSL షేర్లను తాత్కాలికంగా సూచీలకు కలపడం వల్ల, డీమెర్జర్ తర్వాత రిలయన్స్ షేర్లలో కనిపించే అస్థిరత కూడా చల్లబడింది.
జులై 20న స్పెషల్ ప్రి-ఓపెన్ సెషన్
జులై 20వ తేదీన, RILలో ఒక స్పెషల్ ప్రి-ఓపెన్ సెషన్‌ను నిర్వహించారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన స్పెషల్ సెషన్‌లో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 273 వద్ద స్థిరపడింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 261.85 వద్ద క్లోజ్ అయింది. అదే సెషన్‌లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ NSEలో రూ. 2580 వద్ద ఆగింది. BSEలో ఒక్కో షేరు రూ. 2589 వద్ద స్థిరపడింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లను ఆగస్టు 21న అధికారికంగా లిస్ట్ చేసే వరకు, రూ. 261.85 వద్దే స్థిరంగా ఇండెక్స్‌లో భాగంగా కొనసాగింది.
ఈ రోజు ఉదయం సెషన్‌లో 5% అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయిన Jio ఫైనాన్షియల్ షేర్లు, ఆ తర్వాత సర్క్యూట్ స్థాయి నుంచి బయటికి వచ్చాయి, NSEలో దాదాపు 1% లాభంతో రూ. 233.50 వద్ద ముగిశాయి. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 0.5% నష్టంతో రూ.2,407 వద్ద ముగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఎఫ్‌డీ మీద 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్న 5 బ్యాంక్‌లు, ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial