Share Market Opening Today: 22k శిఖరం దగ్గర ఎదురుగాలులు - జారిపోయిన నిఫ్టీ, అదే రూట్‌లో సెన్సెక్స్
నిఫ్టీ 22,000 మార్క్ పైన ఓపెన్ అయినా, నిమిషాల వ్యవధిలోనే ఆ స్థాయి కోల్పోయింది.
Stock Market News Today in Telugu: బుధవారం రెండో సెషన్ నుంచి హఠాత్తుగా పడిపోయిన ఇండియన్ స్టాక్ మార్కెట్లు, ఆ బలహీనతను ఈ రోజు (గురువారం, 22 ఫిబ్రవరి 2024) ఓపెనింగ్ సెషన్‌లోనూ కంటిన్యూ చేశాయి. గ్లోబల్‌గా వీస్తున్న సానుకూల పవనాల మధ్య స్వల్ప లాభాలతో సానుకూలంగా ప్రారంభమైన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు, ఆ వెంటనే జారిపోవడం ప్రారంభించాయి. నిఫ్టీ 22,000 మార్క్ పైన ఓపెన్ అయినా, నిమిషాల వ్యవధిలోనే ఆ స్థాయి కోల్పోయింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (బుధవారం) 72,623 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 54.41 పాయింట్ల స్వల్ప లాభంతో 72,677.51 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 22,055 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 26.50 పాయింట్ల పెరుగుదలతో 22,081.55 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం చొప్పున తగ్గాయి.
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, బీఎస్‌ఈలో 2,994 షేర్లు ట్రేడ్ అవుతుండగా.. వాటిలో 1,557 షేర్లు పెరిగో ధోరణిలో, 1,300 షేర్లు తగ్గే ధోరణిలో కనిపించాయి. 87 షేర్లు ఎటూ మొగ్గలేదు. 117 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 59 షేర్లు లోయర్ సర్క్యూట్‌లోకి పడిపోయాయి.
సెన్సెక్స్‌లో.. ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
ఎన్‌ఎస్‌ఈలో 2,143 షేర్లు ట్రేడ్ అవుతుండగా.. వాటిలో 944 షేర్లు ముందంజలో ఉన్నాయి, 1,109 మడిమ తిప్పాయి. 90 షేర్లలో ఎలాంటి స్పందన లేదు. ఎగువ సర్క్యూట్‌లో 41 షేర్లు, దిగువ సర్క్యూట్‌లో 35 షేర్లు బిగుసుకుపోయాయి.
నిఫ్టీలో.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్‌టెక్, ఐషర్ టాప్ గెయినర్స్ లిస్ట్‌లో ఉన్నాయి. బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
సెక్టార్ల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ, ఆటో మాత్రమే పచ్చరంగులో పలకరించాయి. మిగిలినన్నీ ఎరుపు రంగు పులుముకున్నాయి.
ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 21.51 పాయింట్లు లేదా 0.030% పెరిగి 72,644.60 దగ్గర; NSE నిఫ్టీ 4.25 పాయింట్లు లేదా 0.019% పెరిగి 22,059.30 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్ నికాయ్ 1.5 శాతం పెరిగింది, రికార్డు స్థాయికి చేరింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.47 శాతం, ఆస్ట్రేలియా ASX200 0.02 శాతం, హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ 0.25 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 0.44 శాతం లాభపడ్డాయి.
ఫెడరల్ రిజర్వ్ జనవరి సమావేశం మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. వడ్డీ రేట్లను తగ్గించడానికి యూఎస్ ఫెడ్ తొందరపడడం లేదని అవి సూచిస్తున్నాయి. నిన్న వాల్ స్ట్రీట్‌లో చక్కటి సానుకూల సెషన్ నడిచింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, S&P500 తలో 0.13 శాతం పెరిగాయి. టెక్-హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.32 శాతం నష్టపోయింది.
US 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ దాదాపు 4.3 శాతం స్థాయిలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $83 దగ్గర తిరుగుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.