Share Market Opening Today: 200 పాయింట్లు పడ్డ సెన్సెక్స్ - టాప్ గేర్‌లో ఆటో షేర్లు, రివర్స్ గేర్‌లో ఐటీ షేర్లు
BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉండగా, BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఎటూ మొగ్గలేదు.
Stock Market News Today in Telugu: గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాల ప్రభావం ఈ రోజు (మంగళవారం, 05 మార్చి 2024) భారతీయ స్టాక్ మార్కెట్లపై కనిపించింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ దిగువకు జారిపోయాయి. ఆటో రంగం ముందుకు దూసుకెళ్తుంటే, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (సోమవారం) 73,872 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 104.87 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 73,767.42 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 22,405 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 34.35 పాయింట్లు లేదా 0.15 శాతం తగ్గి 22,371.25 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉండగా, BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఎటూ మొగ్గలేదు.
మార్కెట్ ప్రారంభ సమయంలో, బ్యాంక్ నిఫ్టీ 158 పాయింట్ల పతనంతో 47,297 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ ఐటీ అత్యధికంగా దాదాపు 1 శాతం క్షీణించింది. రంగాల వారీగా ట్రేడ్‌ను పరిశీలిస్తే.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.5 శాతం లాభపడింది. రియాల్టీ, PSU బ్యాంక్, మెటల్, రియాల్టీ, హెల్త్‌కేర్ కూడా పచ్చగా ఉన్నాయి. ఇవి మినహా మిగిలిన అన్ని సూచీలు జారుడుబల్లపై ఉన్నాయి.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. 13 షేర్లు లాభపడగా, 17 షేర్లు తిరోగమనంలో ఉన్నాయి. టాటా మోటార్స్ ఈ రోజు అత్యధికంగా 4.73 పెరిగి సెన్సెక్స్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది. M&M 1.28 శాతం లాభపడగా, SBI, NTPC 0.89 శాతం వరకు పెరిగాయి. భారతి ఎయిర్‌టెల్ 0.52 శాతం, టైటన్ 0.37 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు.. పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టి, సన్ ఫార్మా నష్టాల్లో ఉన్నాయి.
వాణిజ్య వాహనా విభాగం, ప్రయాణీకుల వాహనాల విభాగం వ్యాపారాలను విడివిడిగా లిస్ట్ చేసేందుకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించడంతో, టాటా మోటార్స్ స్టాక్ దాదాపు 5 శాతం జంప్ చేసింది, రూ. 1000 మార్క్ దాటింది.
రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల ఫలితంగా IIFL ఫైనాన్స్ షేర్లు 20 శాతం పతనమై లోయర్ సర్క్యూట్‌లో ఆగాయి.
ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 199.78 పాయింట్లు లేదా 0.27% తగ్గి 73,672.51 దగ్గర; NSE నిఫ్టీ 53.65 పాయింట్లు లేదా 0.24% తగ్గి 22,351.95 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
2024 సంవత్సరానికి దాదాపు 5 శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని చైనా నిర్దేశించుకుంది. ఇది అంచనాలకు తగ్గట్లుగానే ఉండడం, ఆశ్చర్యకరమైన నిర్ణయాలు లేకపోవడంతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు లోయర్ సైడ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేలా డ్రాగన్ గవర్నమెంట్ నుంచి మరిన్ని పాలసీ నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఆసియా మార్కెట్లలో.. నికాయ్, హ్యాంగ్ సెంగ్ వరుసగా 0.9 శాతం వరకు పడిపోయాయి. కోస్పి 0.17 శాతం పతనమైంది. USలో, నిన్న, S&P 500 0.12 శాతం తగ్గింది, నాస్‌డాక్ 0.41 శాతం క్షీణించింది. డౌ జోన్స్ 0.25 శాతం నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి