Share Market Opening Today: 300 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, 21,600 దిగువన నిఫ్టీ, రాకెట్లలా మారిన అదానీ స్టాక్స్
మంగళవారం, అమెరికన్ నాస్‌డాక్ పతనమైంది, ఆ బలహీనత ఈ రోజు ఇండియన్ IT స్టాక్స్‌ను కలవరపెట్టింది.
Stock Market News Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా బలహీనతను చాటుకుంది. ఎరుపు రంగులో ప్రారంభమైన మార్కెట్, నిమిషాల్లోనే మరింత కిందకు జారింది. తొలి 30 నిమిషాలు గడిచేసరికి సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా తగ్గి 21,600 స్థాయిని కోల్పోయింది. నిన్న చైనా డేటా రిలీజ్ తర్వాత ఇండియన్ మెటల్ స్టాక్స్ మీద ప్రతికూల ప్రభావం పడింది, చాలా మెటల్ షేర్లు క్షీణించాయి. మంగళవారం, అమెరికన్ నాస్‌డాక్ పతనమైంది, ఆ బలహీనత ఈ రోజు ఇండియన్ IT స్టాక్స్‌ను కలవరపెట్టింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (సోమవారం, 01 జనవరి 2024) 71,892 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 59.86 పాయింట్లు పతనమై 71,832 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. శుక్రవారం 21,666 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 4.70 పాయింట్ల స్వల్ప నష్టంతో 21,661 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
బ్రాడర్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పడిపోయింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉంది.
మార్కెట్ ప్రారంభ నిమిషంలోనే సెన్సెక్స్ 237 పాయింట్ల పతనంతో ట్రేడ్ అయింది. ఆ సమయానికి, దలాల్ స్ట్రీట్‌లో 1500 షేర్లు పెరుగుదలతో, 600 షేర్లు పతనంలో కనిపించాయి.
ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 12 స్టాక్స్ లాభాల్లో ఉండగా, 18 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, HCL టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్ అత్యధిక నష్టాలను చవిచూశాయి.
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 16 స్టాక్స్ లాభపడగా, 34 స్టాక్స్ క్షీణించాయి. వీటిలో, హీరో మోటోకార్ప్ ఎక్కువ నష్టంలో ఉంది. మరోవైపు, సన్ ఫార్మా, నెస్లే, M&M టాప్ గెయినర్స్ లిస్ట్‌లో చేరాయి.
సెక్టార్లలో... నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్స్ 1 శాతం చొప్పున పతనమయ్యాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో (Adani Group-Hindeburg Research case) సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. అదానీ గ్రూప్‌నకు అనుకులంగా తీర్పు వస్తుందన్న అంచనాలతో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 3-10 శాతం పెరిగాయి.
ప్రి-ఓపెనింగ్ సెషన్
ప్రి-ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 58.30 పాయింట్లు పడిపోయి 71,834 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 1.50 పాయింట్ల నామమాత్రపు క్షీణతతో 21,664 వద్ద ఉంది.
ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 315.65 పాయింట్లు లేదా 0.44% తగ్గి 71,576.83 దగ్గర; NSE నిఫ్టీ 78.95 పాయింట్లు లేదా 0.36% తగ్గి 21,586.85 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. కోస్పీ 2 శాతం పతనమైంది. హాంగ్ సెంగ్, ASX 200 1 శాతం వరకు పడిపోయాయి. భూకంపం ప్రభావంతో జపాన్ మార్కెట్లు గురువారం వరకు పని చేయవు. మంగళవారం, కొత్త సంవత్సరంలో మొదటి ట్రేడింగ్ సెషన్‌ను US స్టాక్స్ నష్టాలతో ముగించాయి. S&P 500 0.57 శాతం, నాస్‌డాక్ 1.63 శాతం పడిపోయాయి, డౌ జోన్ ఫ్లాట్‌గా క్లోజ్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి