Self-Made Entrepreneurs: అంబానీ, అదానీ కాదు.. మన దేశంలో సిసలైన సంపన్నులు వీళ్లే
IDFC ఫస్ట్ బ్యాంక్ & హురున్ ఇండియా లిస్ట్‌లోని టాప్ 10 కంపెనీల్లో 8 స్టార్టప్‌లే ఉండడం విశేషం.
Top 10 Self-Made Entrepreneurs in India: మన దేశంలో అందరికంటే ధనవంతులు ఎవరంటే చాలా మంది ముకేష్ అంబానీ పేరు చెబుతారు. మరికొందరు గౌతమ్ అదానీ పేరు కూడా చెప్పొచ్చు, ఆయన ప్రస్తుతం నం.2 కోటీశ్వరుడి పొజిషన్‌లో ఉన్నారు. టాటాలు, బిర్లాల పేర్లు కూడా మనకు వినిపిస్తాయి. కానీ.. వాళ్లంతా తాతలు, తండ్రులు, గాడ్‌ఫాదర్ల అండదండలతో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు.
ఎవరిపై ఆధారపడకుండా, స్వీయ సామర్థ్యం, స్వయంకృషితో వ్యాపారాలను స్పీడ్ ట్రాక్‌పై పెట్టిన వ్యక్తులు కూడా ఇండియాలో ఉన్నారు. అంబానీ, అదానీల్లా లక్షల కోట్ల రూపాయల సంపద లేకున్నా.. సొంతంగా ఎదిగినవాళ్లే అసలైన వ్యవస్థాపకులు & సిసలైన సంపన్నులు.
మన దేశంలో, స్వయంకృషితో ఎదిగిన వ్యాపారవేత్తలు (self-made richest entrepreneurs in India), వాళ్ల వ్యాపారాల గురించి IDFC ఫస్ట్ బ్యాంక్ & హురున్ ఇండియా కలిసి ఒక రీసెర్చ్ చేశాయి. వాటి రీసెర్చ్ తర్వాత, కంపెనీల పేర్లతో ఒక లిస్ట్ తయారు చేశాయి. టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఆంట్రపెన్యూర్స్ జాబితాలో 400 మంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. ఈ 200 కంపెనీల మొత్తం విలువ ₹30 లక్షల కోట్లకు పైగా ఉంటుంది, ఇది డెన్మార్క్ GDPకి సమానం.
IDFC ఫస్ట్ బ్యాంక్ & హురున్ ఇండియా లిస్ట్‌లోని టాప్ 10 కంపెనీల్లో 8 స్టార్టప్‌లే ఉండడం విశేషం.
స్వయంకృషితో ఎదిగిన టాప్ 10 వ్యాపారవేత్తలు (top 10 self-made entrepreneurs in India):
1. రాధాకిష్ణన్ దమానీ: సూపర్ మార్కెట్ చైన్ డీమార్ట్ ఓనర్ రాధాకిషన్ దమానీ, ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. 2000లో డీమార్ట్‌ను స్థాపించారు. ప్రస్తుతం డీమార్ట్ మార్కెట్ విలువ (market capitalization) ₹2 లక్షల కోట్లకు పైగా ఉంటుంది.
2. బిన్నీ బన్సల్ & సచిన్ బన్సల్: ₹1.2 లక్షల కోట్ల ఈక్విటీ విలువతో ఉన్న ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు వీళ్లు. సచిన్ బన్సల్ 2018లోనే వాటాను వాల్‌మార్ట్‌కు అమ్మేయగా, బిన్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు.
3. దీపిందర్ గోయల్: జొమాటో ఫౌండర్ & సీఈవో దీపిందర్ గోయల్. 2021 జులైలో జొమాటో పబ్లిక్ లిమిటెడ్‌గా మారింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ ₹86,000 కోట్లకు పైమాటే.
4. హర్ష్ జైన్ & భవిత్ షేత్: డ్రీమ్11 వ్యవస్థాపకులు వీళ్లు. కంపెనీ ఈక్విటీ విలువ ₹66,000 కోట్లు దాటుతుంది. 2019 ఏప్రిల్‌లో డ్రీమ్11 యునికార్న్‌గా మారింది, అలా ఎదిగిన మొదటి ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్ కంపెనీగా అవతరించింది.
5. శ్రీహర్ష మేజేటి & నందన్ రెడ్డి: 2013లో రాహుల్ జైమినితో కలిసి స్విగ్గీని స్థాపించారు. డ్రీమ్11 ఫౌండర్లతో కలిసి ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. స్విగ్గీ ఈక్విటీ వాల్యూ ₹66,000 కోట్లకు పైగా ఉంటుంది.
6. హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్: ఆరో ర్యాంక్‌లో ఉన్న రేజర్‌పే వ్యవస్థాపకులు వీళ్లు. రేజర్‌పే విలువ ₹62,000 కోట్ల కంటే ఎక్కువే.
7. అభయ్ సోయి: ₹55,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న మాక్స్ హెల్త్‌కేర్ CMD అభయ్ సోయి. రేడియంట్ లైఫ్‌కేర్‌ను విజయవంతంగా విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
8. విజయ్ శేఖర్ శర్మ: 2010లో వన్97 కమ్యూనికేషన్స్‌ను (పేటీఎం) స్థాపించిన విజయ్ శేఖర్ శర్మ 8వ ర్యాక్‌లో ఉన్నారు. ఈ ఫిన్‌టెక్ కంపెనీని 2021 నవంబర్‌లో పబ్లిక్‌లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం పేటీఎం మార్కెట్ క్యాప్ దాదాపు ₹54,000 కోట్లు.
9. కుణాల్ షా: 'క్రెడ్'ను స్థాపించిన వ్యక్తి కుణాల్ షా. 2018లో బెంగళూరులో క్రెడ్ ప్రారంభమైంది. ఈ కంపెనీ ఈక్విటీ విలువ ₹53,000 కోట్లకు పైగా ఉంటుంది.
10. నితిన్ కామత్ & నిఖిల్ కామత్: బ్రోకింగ్ కంపెనీ 'జీరోధ'ను 2010లో స్థాపించారు. ప్రస్తుతం జీరోధ ఈక్విటీ విలువ ₹50,000 కోట్లు దాటుతుంది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ పెరిగిన పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి