YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
Andhra Pradesh | తన ప్రశ్నలతో సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు వైఎస్ షర్మిల. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదానే శరణ్యమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila About Super Six scheme | " ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ అనే మాటల్ని తలపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీరు అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు (Super Six Scheme) అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు.. వాటిని అమలు చేయాలనేసరికి రాష్ట్ర ఆదాయం పెరిగితేనే అంటూ సాకులు చెబుతున్నారని విమర్శించారు. అప్పులు దొరకవని, తలసరి ఆదాయం పెరగాలని, ఆదాయం పెంచుకోవాలని, మనుషులు మన ఆస్తి అంటూ చంద్రబాబు వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లు ఆయన వ్యవహారం ఉందంటూ ఏపీ సీఎంపై షర్మిల మండిపడ్డారు.
హామీలు ఇచ్చే సమయంలో తెలియదా బాబు?
చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో సూపర్ సిక్స్ (Super Six) హామీలు ఇచ్చే ముందు తెలియదా ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.10 లక్షల కోట్లు ఉందని..? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా.? ఏపీ బడ్జెట్ (AP Budget 2025) మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని చంద్రబాబుకు తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసి కూడా మద్దతు ఎందుకు ఇచ్చారు ?
మోదీతో చెట్టాపట్టాలు అవసరమా బాబు?
రాష్ట్ర అభివృద్ధికి సహాయ పడనప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో చెట్టాపట్టాలు అవసరమా ? ఇదంతా ఎందుకు చేస్తున్నారు. ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుని ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, మీ విజన్ల పేరుతో కాలయాపన తప్పా.. చంద్రబాబు పనితనం శూన్యం అని షర్మిల ఘాటు వ్యాఖ్య చేశారు. ఎప్పటికైనా ఏపీకి సంజీవని అంటే ప్రత్యేక హోదానే. హోదాతోనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. నిధులు రావాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా, పరిశ్రమలు స్థాపన జరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యం అని షర్మిల ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

