Fed Policy Announcement: మార్కెట్ డైరెక్షన్‌ను డిసైడ్ చేసే ఫెడ్ ప్రకటన ఈ రోజే, పావెల్ కామెంటరీ ఎలా ఉండొచ్చు?
GDP, పేరోల్స్‌లో వేగం పెరిగినప్పటికీ వడ్డీ రేట్లను ఫెడ్ స్థిరంగా ఉంచుతుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ఊహిస్తున్నారు.
Stock Market News In Telugu: భారత్ సహా ప్రపంచ ఈక్విటీ, డెట్, కమొడిటీ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈ రోజు (బుధవారం, 01 నవంబర్ 2023) ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు అర్థరాత్రి ఫెడ్ ఔట్‌కమ్ వస్తుంది. ఆ నిర్ణయాలు రేపు మన మార్కెట్ల మీద ప్రభావం చూపుతాయి.
ప్రస్తుతం, అమెరికాలో ద్రవ్యోల్బణం క్షీణిస్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లు కూడా గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ముందుకు వెళ్తోంది. రీసెంట్‌గా రిలీజైన ఆర్థిక డేటా, నెక్ట్స్ స్టెప్ వేయడానికి సమయం తీసుకునేలా ఫెడ్ అధికారులను ప్రేరేపిస్తోంది. కాబట్టి, యూఎస్ పాలసీ మేకర్లు వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం వాస్తవంగా కనిపించడం లేదు, గత వడ్డీ రేట్లనే యథాతథంగా కొనసాగించవచ్చు.
ఫెడ్ రేట్లు మారకపోవచ్చని మార్కెట్ ముందు నుంచి అంచనా వేస్తున్నా... ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్, మిగిలిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) నుంచి ఎలాంటి కామెంటరీ వస్తుందని ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఆ కామెంటరీని బట్టే పెట్టుబడిదార్ల నిర్ణయాలు ఉంటాయి కాబట్టి, పావెల్ ఇచ్చే ఫ్యూచర్ సిగ్నల్స్ కీలకంగా మారతాయి.
యూఎస్ మార్కెట్లు ఈ వారం బలంగా కనిపిస్తున్నప్పటికీ, గత రెండు నెలలుగా తిరోగమనంలో ఉన్నాయి. అక్కడి బెంచ్‌మార్క్ గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ 16 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక సంక్షోభం ప్రారంభమైన రోజుల్లో ఈ స్థాయిలో ఉన్నాయి.
అమెరికాలో అధిక వడ్డీ రేట్లు 'ఎంత ఎక్కువ కాలం కొనసాగవచ్చన్న' విషయం పైనే ప్రపంచ పెట్టుబడిదార్ల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఫెడ్ కూడా దీనిపై ఏదోకటి చెబుతుంది.
ఒకటి కాదు, రెండు విషయాలు కీలకం
నిజానికి, ఈ రోజు సాయంత్రం ఓపెన్ అయ్యే యూఎస్ మార్కెట్లు రెండు విషయాలపై ఫోకస్ పెడతాయి. ట్రెజరీ డిపార్ట్‌మెంట్, సమీప భవిష్యత్‌లో తన నిధుల అవసరాలపై మరింత సమాచారాన్ని అందజేస్తుంది. ప్రభుత్వం $33.7 ట్రిలియన్ల రుణాన్ని ఎలా నిర్వహిస్తుందనే అంశానికి ఇది కీలకమైన క్షణం. సెప్టెంబర్ జాబ్ ఓపెనింగ్స్ గురించి లేబర్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు కూడా మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి. అక్టోబర్ నెలకు సంబంధించి లేబర్ డిపార్ట్‌మెంట్ తన నాన్‌ఫార్మ్ పేరోల్స్ రిపోర్ట్‌ను విడుదల చేయడానికి రెండు రోజుల ముందు ఇదంతా జరుగుతోంది. మూడో త్రైమాసికంలో ఊహించిన దాని కంటే మెరుగైన ఆర్థిక వృద్ధిని అది చూపించవచ్చు.
GDP, పేరోల్స్‌లో వేగం పెరిగినప్పటికీ వడ్డీ రేట్లను ఫెడ్ స్థిరంగా ఉంచుతుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ఊహిస్తున్నారు. మీడియా సమావేశంలో, చైర్ పావెల్ ఫెడ్ 'జాగ్రత్తపూరిత వైఖరి' గురించి మళ్లీ మాట్లాడే అవకాశం ఉంది. అక్టోబర్‌లో, న్యూయార్క్‌లో జరిగిన మీటింగ్‌లో 'జాగ్రత్తపూరిత వైఖరి' గురించి పావెల్ చెప్పారు.
ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం అప్‌డేట్ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. మిశ్రమంగా వస్తున్న కార్పొరేట్ ఎర్నింగ్స్‌ను కూడా అక్కడి మార్కెట్ జీర్ణించుకుంటోంది.
ఫెడ్ ఔట్‌కమ్ నేపథ్యంలో మన మార్కెట్లలో ఈ రోజు పెద్దగా మూమెంట్ లేదు. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి BSE సెన్సెక్స్ 107 పాయింట్ల లాస్‌లో 63,767 వద్ద ఉండగా, NSE నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 19,046 వద్ద ట్రేడ్ అవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఏయే పనుల కోసం GPF అడ్వాన్స్ తీసుకోవచ్చు, విత్‌డ్రా రూల్స్ ఏం చెబుతున్నాయి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial