Share Market Closing Today: లాభాల్లో ముగిసిన స్పెషల్ సెషన్ - సత్తా చాటిన డిఫెన్స్ స్టాక్స్
Stock Market Closing Bell: అన్ని సెక్టార్లు గ్రీన్ జోన్‌లోనే కదిలాయి. ముఖ్యంగా, డిఫెన్స్ స్టాక్స్‌లో గుర్తుండిపోయే ట్రేడ్ జరిగింది. వీటిలో చాలా వరకు ఈ రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market Closing Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (శనివారం, 18 మే 2024) నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఆశావహంగా సాగింది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో, ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. అన్ని సెక్టార్లు గ్రీన్ జోన్‌లోనే కదిలాయి. ముఖ్యంగా, డిఫెన్స్ స్టాక్స్‌లో గుర్తుండిపోయే ట్రేడ్ జరిగింది. వీటిలో చాలా వరకు ఈ రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.
ఈ రోజు ట్రేడింగ్ ఇలా జరిగింది...
అత్యవసర పరిస్థితుల సన్నద్ధత కోసం నిర్వహించిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైంది, రెండు ప్రధాన సూచీలు సెషన్ మొత్తం పచ్చరంగుతోనే ట్రేడ్ చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, BSE సెన్సెక్స్ 88.91 పాయింట్ల (0.12 శాతం) లాభంతో 74,005.94 పాయింట్ల వద్ద ఆగింది. సెన్సెక్స్ ఈ రోజు 74 వేల మార్కును దాటింది. ఈ రోజు ట్రేడింగ్‌లో మార్కెట్ గరిష్ఠ స్థాయి 74,162.76 పాయింట్లు కాగా, కనిష్ట స్థాయి 73,920.63 పాయింట్లుగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే, కేవలం 242 పాయింట్ల పరిధిలోనే సెన్సెక్స్ 30 ఇండెక్స్ కదిలింది.
ప్రత్యేక ట్రేడింగ్‌లో నిఫ్టీ50 సూచీ కూడా సానుకూలంగా కదిలింది, చివరకు 36 పాయింట్ల లాభంతో 22,502 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ట్రేడింగ్ సమయంలో గరిష్టంగా 22,506 పాయింట్లను, కనిష్టంగా 22,345.65 పాయింట్లను తాకింది. నిఫ్టీ50 కూడా పరిమిత పరిధిలోనే (160 పాయింట్లు) కదిలినట్లు ఇది చూపిస్తుంది.
బలం ప్రదర్శించిన రక్షణ రంగ షేర్లు
రక్షణ రంగ షేర్ల విషయంలో ఈ స్పెషల్ ట్రేడింగ్ చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది. ఈ ట్రేడింగ్‌లో రక్షణ రంగానికి చెందిన చాలా స్టాక్స్ 5 శాతం లాభపడ్డాయి, అప్పర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి. నేటి ప్రత్యేక సెషన్‌లో ట్రేడింగ్ కోసం అన్ని సెక్యూరిటీలపై 5 శాతం అప్పర్/ లోయర్ సర్క్యూట్ పరిమితిని విధించారు.
నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, జైడస్ లైఫ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి.
రెండు సెషన్లలో స్పెషల్ ట్రేడింగ్
సాధారణంగా, దేశీయ స్టాక్ మార్కెట్లు శని, ఆదివారాలు పని చేయవు. అయితే ఈసారి ట్రేడింగ్ శనివారం కూడా జరిగింది. ఈ ఏడాదిలో శనివారం నాడు మార్కెట్‌ను ప్రారంభించడం ఇది మూడోసారి. ఈ రోజు బిజినెస్ డిజాస్టర్ రికవరీ సైట్ (DR Site) ద్వారా జరిగింది. మొదటి సెషన్ 9.15 గంటల నుంచి 10.00 గంటల వరకు సాగితే.. రెండో సెషన్‌కు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిసింది.
స్టాక్ మార్కెట్లపై సైబర్ దాడులు జరిగినప్పుడు లేదా ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు ట్రేడర్లు & ఇన్వెస్టర్లకు అవాంతరాలు లేని కార్యకలాపాలు అందించేందుకు DR సైట్‌కు రూపకల్పన చేశారు. ఈ సైట్ వల్ల స్టాక్ మార్కెట్ డేటాకు రక్షణ లభిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: భయంకరంగా పెరిగిన పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి