Share Market Today: మళ్లీ చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు - రూ.470 లక్షల కోట్లు దాటిన సంపద
Share Market Closing Today: బీఎస్‌ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్ విలువ గత సెషన్‌లో రూ.468.71 లక్షల కోట్ల వద్ద ముగిసి రికార్డు సృష్టిస్తే, ఈ రోజు రూ.470.49 లక్షల కోట్ల వద్ద ముగిసి పాత రికార్డ్ బద్ధలైంది.
Stock Market Closing On 16 September 2024: భారత స్టాక్ మార్కెట్లో, ప్రైమరీ & సెకండరీ మార్కెట్లకు ఈ రోజు (సోమవారం, 16 సెప్టెంబర్ 2024) చాలా కీలకంగా మారింది. ప్రైమరీ మార్కెట్‌లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO బంపర్ లిస్టింగ్ జరిగింది. సెకండరీ మార్కెట్‌లో, BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ రెండూ సరికొత్త ఎత్తులకు చేరాయి, చారిత్రక గరిష్టాలను తాకాయి. నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి.
ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 97.84 పాయింట్లు లేదా 0.12% పెరిగి 82,988.78 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 27.25 పాయింట్లు లేదా 0.11% పెరిగి 25,383.75 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
పెరిగిన & పడిపోయిన షేర్లు
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 15 స్టాక్స్ లాభాలతో ముగియగా, 15 నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 25 స్టాక్స్ ప్రాఫిట్స్ తీసుకుంటే, 25 లాస్‌లను తలకెత్తుకున్నాయి. లాభపడిన షేర్లలో... ఎన్‌టీపీసీ 2.44 శాతం, ఎల్ అండ్ టీ 1.35 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.97 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.94 శాతం, నెస్లే 0.72 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.66 శాతం చొప్పున పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ 3.36 శాతం, హెచ్‌యుఎల్ 2.30 శాతం నష్టపోయాయి.
సెక్టార్ల వారీగా..
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్, మీడియా, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలపై ఇన్వెస్టర్లలో అసంతృప్తి & అమ్మకాలు కనిపించాయి.
ఈ రోజు ట్రేడ్‌లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మరోసారి విపరీతమైన ర్యాలీ నమోదు చేశాయి. నేటి ట్రేడింగ్‌లో కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైని (Nifty mid-cap index at all time high) తాకింది.
రికార్డు స్థాయిలో మార్కెట్ క్యాప్
భారత స్టాక్ మార్కెట్‌లో మంచి కొనుగోళ్ల కారణంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ గత సెషన్‌లో రికార్డ్ స్థాయిలో రూ. 468.71 లక్షల కోట్ల వద్ద ముగిస్తే, ఆ రికార్డు ఒక్కరోజులోనే బద్ధలైంది. పెట్టుబడిదార్ల సంపద ఈ రోజు సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుని, రూ.470.49 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అంటే, ఈ రోజు సెషన్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.1.78 లక్షల కోట్ల జంప్ నమోదైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే జైలు శిక్ష! ఈ అప్‌డేట్ గురించి తెలుసుకోండి