Sridhar Vembu: రూ.28 వేల కోట్ల ఆస్తి, రూ.9 వేల కోట్ల కంపెనీ - ఇప్పటికీ సైకిల్‌పైనే ప్రయాణం
Sridhar Vembu Lifestyle: సూటు, బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకుంటున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అంతేకాదు, రాకపోకల కోసం సైకిల్‌ను ఉపయోగిస్తున్నారు.
Sridhar Vembu Lifestyle Of Zoho Corporation: కోటి రూపాయల ఆస్తి సంపాదించగానే కొంతమందికి కొమ్ములు మొలుస్తాయి. ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడి మూలాలు మర్చిపోతారు. తన కంటే తోపు ఇంకెవరూ లేరన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ.. భారతీయ వ్యాపార ప్రపంచంలో శ్రీధర్ వెంబు చాలా ప్రత్యేకం. విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంతోనూ ప్రసిద్ధి చెందారు.
శ్రీధర్ వెంబు, తన ఆధ్వర్యంలోని జోహో కార్పొరేషన్‌ను (Zoho Corporation) 9,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మార్చారు. అంతేకాదు, ఆయన నికర ఆస్తిపాస్తుల విలువ (Sridhar Vembu Net Worth) 28,000 కోట్ల రూపాయలని అంచనా. ఫోర్బ్స్ (Forbes) డేటా ప్రకారం, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు ప్రతిగా పద్మశ్రీ పురస్కారం వరించింది. రూ.9 వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీకి & రూ.28 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్నప్పటికీ శ్రీధర్ వెంబు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
జోహో కార్పొరేషన్‌కు వేల కోట్ల రూపాయల లాభం
జోహో కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) శ్రీధర్ వెంబు పని చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో, జోహో కార్పొరేషన్ ప్రస్తుతం 2,800 కోట్ల రూపాయల లాభాల సంస్థగా అవతరించింది. ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటిగా (One of the largest software companies in the world) గుర్తింపు పొందింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. సూటు, బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకుంటున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అంతేకాదు, రాకపోకల కోసం సైకిల్‌ను ఉపయోగిస్తున్నారు.
కొత్త వాహనం ఫొటోలు వైరల్
ఇటీవల, శ్రీధర్ వెంబు ఒక కొత్త వాహనం కొన్నారు. ఆ వాహనం ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తే అవి తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి లక్షల్లో లైక్స్ వచ్చాయి. జోహో కార్పొరేషన్ CEO ఉపయోగిస్తున్న కొత్త వాహనం... ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. శ్రీధర్ వెంబు వద్ద టాటా నెక్సాన్ EV కూడా ఉంది.
శ్రీధర్ వెంబు తమిళనాడులోని తంజావూరులో జన్మించారు. ఐఐటీ జేఈఈ పరీక్షలో 27వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్‌లో, ఆపై ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదివారు. ఆ తర్వాత, 1994లో క్వాల్కమ్‌తో (Qualcomm) కలిసి పని చేశారు. కానీ, ఒక స్టార్టప్‌ను ప్రారంభించాలన్నది ఆతని కోరిక. దీంతో, మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటికి, అతని సోదరుడు చెన్నైలో అడ్వెంట్‌నెట్ (AdventNet) అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నారు. 1998 సంవత్సరం నాటికి ఆ కంపెనీ బాగా పని చేయడం ప్రారంభించింది.
2001 ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంట్‌నెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. తమకు అమ్మేయమంటూ ఇతర సంస్థలు మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ కంపెనీని అమ్మలేదు. ఈ సమయంలోనే, జోహో డొమైన్ నేమ్‌ను శ్రీధర్ వెంబు కొనుగోలు చేశారు. 2009లో, జోహో కార్పొరేషన్‌లో అడ్వెంట్‌నెట్‌ను విలీనం చేశారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2021 నవంబర్ నాటికి జోహో కార్పొరేషన్ ఆదాయం 1 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరింది. అందరూ నష్టపోయిన కొవిడ్-19 సమయంలో ఈ కంపెనీ భారీ ప్రయోజనాలు పొందింది, లాభం రూ. 1,918 కోట్లకు చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి, శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది.
మరో ఆసక్తికర కథనం: అంతా తూచ్, ఊహించి రాశారు, ఆ వార్త అబద్ధం - క్లారిటీ ఇచ్చిన పేటీఎం