Oyo Hotels IPO: జొమాటో బాటలో ఓయో! ఐపీఓకు రానున్న హోటల్ అగ్రిగేటర్ కంపెనీ
ఓయో హోటల్స్ ఐపీఓకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని తెలిసింది. రూ.8000 వేల కోట్లు సమీకరించేందుకు వచ్చేవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద దరఖాస్తు చేసుకోనుందని సమాచారం.
అంకురాలుగా మొదలై అభివృద్ధి చెందిన కంపెనీలు వరుసగా ఐపీఓ బాట పడుతున్నాయి. మొన్నీ మధ్యే జొమాటో స్టాక్ మార్కెట్లో ప్రవేశించింది. తాజాగా ఆతిథ్య రంగానికి చెందిన ఓయో హోటల్స్ ఐపీఓకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని తెలిసింది. రూ.8000 వేల కోట్లు సమీకరించేందుకు వచ్చేవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద దరఖాస్తు చేసుకోనుందని సమాచారం.
భారత్‌లో సూపర్ హిట్టైన ఓయోలో సాఫ్ట్‌బ్యాంక్ భారీగా పెట్టుబడులు పెట్టింది. కరోనా మహమ్మారి తర్వాత ఇన్నాళ్లకు ఆతిథ్య రంగం పుంజుకోవడంతో కనీసం ఒకటి నుంచి 1.2 బిలియన్ డాలర్లు సమీకరించాలని ఓయో నిర్ణయించుకుంది. ఐపీఓకు రావడంతో పాటు ఇప్పటికే వాటదారుల నుంచి ఆఫర్ ఫర్ సేల్ నిర్వహించాలని భావిస్తోందట. దీనిపై ఓయోను సంప్రదించగా ఇంకా స్పందించలేదు.
దేశంలో ప్రస్తుతం ఐపీఓల సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. జులైలో ఐపీఓకు వచ్చిన జొమాటో సూపర్ హిట్టైంది. బెర్కషైర్ హాత్‌వే పెట్టుబడులు పెట్టిన పేటీఎం, టీపీజీ పెట్టుబడులు పెట్టిన నైకా, సాఫ్ట్‌బ్యాంక్ మద్దతిచ్చిన ఓలా సైతం పబ్లిష్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
ఓయోలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 46శాతం వాటా ఉంది. కాగా కరోనా మహమ్మారి మొదలవ్వడంతో హోటల్ రంగం పూర్తిగా పడకేసిన సంగతి తెలిసిందే. దాంతో ఉద్యోగులకు సంస్థ లేఆఫ్‌లు ప్రకటించింది. ఖర్చులు తగ్గించుకోవడం మొదలు పెట్టింది. రెండో వేవ్ ముగిశాక ఆతిథ్య రంగం మెల్లగా కోలుకొంది. తమ వ్యాపారం నిలకడగా కొవిడ్ ముందునాటి పరిస్థితికి చేరుకుంటుందని ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ జులైలో పేర్కొన్నారు.
గత నెల్లో ఓయోలో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ 5 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. కాగా ఈ ఐపీఓ కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్, సిటీ బ్యాంకులను అడ్వైజర్లుగా ఓయో నియమించుకోవడం గమనార్హం.