SKS Power: అటు అంబానీ, ఇటు అదానీ - పట్టు వదలని 'పవర్'ఫుల్ ఛాలెంజ్ ఇది
'పవర్'ఫుల్ గేమ్‌లో భాగంగా, ఆ కంపెనీ కోసం ఇప్పటికే బిడ్స్ కూడా వేశాయి.
SKS Power: భారతదేశ పారిశ్రామికవేత్తలు, ప్రపంచ స్థాయి కుబేరులు అయిన ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ 'ఫేస్ టు ఫేస్' ఫైట్‌కు దిగారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), అదానీ గ్రూప్ (Adani Group) ఇప్పుడు ఒక కంపెనీని చేజిక్కించుకోవడం కోసం పోటీ పడుతున్నాయి. 'పవర్'ఫుల్ గేమ్‌లో భాగంగా, ఆ కంపెనీ కోసం ఇప్పటికే బిడ్స్ కూడా వేశాయి.
ఈ రెండు పెద్ద కంపెనీలు కాక, మరో 5 కంపెనీలు కూడా అక్విజిషన్ (Aquisition) రేసులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగానికి చెందిన ఒక సంస్థ కూడా ఉంది. పోటీ పడుతున్న కంపెనీల పేర్లు.. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌టీపీసీ (NTPC), టోరెంట్ పవర్ (Torrent Power), జిందాల్ పవర్ (Jindal Power), సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ (Sarda Energy & Minerals), సింగపూర్‌కు చెందిన వాంటేజ్ పాయింట్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (Vantage Point Asset Management Company). ఇవన్నీ తుది బిడ్స్ సమర్పించాయి.
అటు అంబానీ, ఇటు అదానీ
ఇవన్నీ పోటీ పడుతోంది SKS పవర్ జెనరేషన్ (SKS Power Generation) కొనుగోలు కోసం. ఇది, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థ. బ్యాంక్ ఆఫ్ బరోడాకి (BoB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి (SBI) కలిపి రూ. 1,890 కోట్లు బకాయి ఉంది. అప్పులు తిరిగి చెల్లించలేక దివాలా తీసింది. దివాలా ప్రక్రియలో భాగంగా, కంపెనీ రుణదాత కంపెనీలు బిడ్లను ఆహ్వానించాయి. రిపోర్ట్ ప్రకారం, SKS పవర్ జెనరేషన్ కంపెనీని కొనడానికి ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్, అటు అదానీ గ్రూప్ భారీ మొత్తానికి ఆఫర్ చేయవచ్చు.
600 మెగావాట్ల (MW) బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ కోసం 23 సంస్థలు ఆసక్తి చూపాయి. వీటిలో కొన్ని కంపెనీలు బిడ్స్ దాఖలు కోసం మరింత సమయం కోరడంతో, రుణదాతలు తుది బిడ్‌ల సమర్పణ కోసం గడువును నాలుగుసార్లు పొడిగించారు. డిసెంబర్ 30, 2022తో అన్ని గడువులు ముగిశాయి. రేసులో 7 సంస్థలు మిగిలాయి.
స్వీకరించిన బిడ్స్‌ను మూల్యాంకనం చేస్తున్నట్లు సమాచారం. బిడ్స్ కోసం ఆర్థిక నిబంధనల (financial parameters) మీద ఇప్పుడు చర్చిస్తారు. రుణదాతలు (BoB, SBI) ఒక బిడ్డర్‌ను ఎంచుకోవడానికి ముందు, అందరు బిడ్డర్స్ నుంచి మరిన్ని వివరాలను కూడా కోరే అవకాశం ఉంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా, 2022 ప్రారంభంలో SKS పవర్ జెనరేషన్ ఫ్లాంటులో ఉత్పత్తిని నిలిపేశారు. ఈ ఫ్లాంట్‌కు బొగ్గు సరఫరా కోసం నేరుగా ఒక రైల్ రోడ్ మార్గం ఉంది. ఇంధన సరఫరా కోసం, కోల్ ఇండియాకు (Coal India) చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌తో (South Eastern Coalfields) 25 సంవత్సరాల ఒప్పందం కూడా ఉంది. ఈ కంపెనీకి రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (power purchase agreements) ఉన్నాయి.