Shree Cement Q2 Result: పెరిగిన వ్యయాల బరువుకు సిరి తగ్గిన శ్రీ సిమెంట్
ఇంధనంగా ఉపయోగించే బొగ్గు & పెట్ కోక్ అధిక ధరల్లో పెరుగుదల కారణంగా లాభదాయకత తీవ్రంగా దెబ్బతింది.
Shree Cement Q2 Result: FY23 రెండో త్రైమాసికంలో (Q2FY23 లేదా సెప్టెంబర్ త్రైమాసికం) శ్రీ సిమెంట్ లిమిటెడ్ సిరి గణనీయంగా తగ్గింది. ఆదాయంలో వృద్ధిని చూపినప్పటికీ, ఇంధన & విద్యుత్ వ్యయాలు పెరగడం వల్ల లాభం భారీగా పడిపోయింది.
రాజస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సిమెంట్ మేజర్ స్వతంత్ర (స్టాండలోన్) ఆదాయం రూ.3,781 కోట్లకు చేరింది. గత సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో (YoY) నమోదైన రూ. 3,206 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన (QoQ లేదా మునుపటి త్రైమాసికంతో పోలిస్తే), గత త్రైమాసికంలో నమోదైన రూ.4,203 కోట్లతో పోలిస్తే ఆదాయం 10 శాతం తగ్గింది.
దెబ్బతిన్న లాభం
గత సంవత్సరంతో పోలిస్తే, సమీక్ష కాల త్రైమాసికంలో కంపెనీ తన వాల్యూమ్‌లను పెంచుకోగలిగింది. దీంతోపాటు, మెరుగైన రియలైజేషన్స్ కూడా YoYలో ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయి. అయితే, ఇంధనంగా ఉపయోగించే బొగ్గు & పెట్ కోక్ అధిక ధరల్లో పెరుగుదల కారణంగా లాభదాయకత తీవ్రంగా దెబ్బతింది.
రెండో త్రైమాసికంలో రూ.189 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని ఈ కంపెనీ నివేదించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.578 కోట్ల లాభంతో పోలిస్తే ప్రస్తుత లాభం 67 శాతం క్షీణించింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన కూడా లాభం 40 శాతం తగ్గింది. గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఈ కంపెనీ రూ.316 కోట్లను ఆర్జించింది.
అంతకుముందు త్రైమాసికంలో గ్లోబల్ క్రూడ్ & బొగ్గు ధరల పెరుగుదల పూర్తి ప్రభావం ప్రస్తుత త్రైమాసికంలో కనిపించింది. YoY ప్రాతిపదికన, పవర్ & ఇంధన వ్యయం 1,285 bps పెరిగి 32.5 శాతానికి చేరింది. అయితే, QoQ ప్రాతిపదికన 187 bps తగ్గింది. రెండో త్రైమాసికంలో, మొత్తం ఆదాయంలో ముడి పదార్థాల వ్యయాల వాటా 83 bps పెరిగి 7.6 శాతానికి చేరుకుంది. QoQలో చూసినా 35 bps పెరిగింది.
మార్జిన్ల మీద ప్రభావం
వ్యయాల పెరుగుదల కారణంగా, ఈ త్రైమాసికంలో నిర్వహణ & నికర మార్జిన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 33 శాతంగా నమోదైన ఆపరేటింగ్ మార్జిన్ ఇప్పుడు ఏకంగా 1500 బేసిస్ పాయింట్లు (bps) తగ్గి, 18 శాతానికి దిగి వచ్చింది. సీక్వెన్షియల్‌గా 100 bps క్షీణత ఉంది.
అదేవిధంగా, నికర మార్జిన్ గత సంవత్సరం సెప్టెంబర్ ముగింపు త్రైమాసికంలోని 18 శాతంతో పోలిస్తే 1300 bps నుంచి ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. గత త్రైమాసికంతో పోలిస్తే, 300 bps తగ్గింది.
ఉద్యోగుల మీద వ్యయాలను మాత్రం శ్రీ సిమెంట్ నియంత్రించగలిగింది. ఇది YoYలో 77 bps తగ్గింది. కానీ, సీక్వెన్షియల్ ప్రాతిపదికన 37 bps పెరిగింది.
షేరు ధర
శుక్రవారం, శ్రీ సిమెంట్ షేరు ధర 0.31 శాతం లేదా రూ.64.35 పెరిగి రూ.21,140 వద్ద సెటిలైంది. ఈ స్టాక్ ధర గత నెల రోజుల్లో దాదాపు 12 శాతం, గత ఆరు నెలల కాలంలో 17 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 22 శాతం పైగా క్షీణించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.