LIC Shares: ఆల్ టైమ్ కనిష్టానికి అతి దగ్గరలో ఎల్‌ఐసీ, అదానీ విధ్వంసంలో విలవిల
అదానీ తుపాను మొదలైన నాటి నుంచి, గత నెల రోజుల్లో, LIC షేర్ ధర దాదాపు 15% తగ్గింది.
LIC Shares: శుక్రవారం (25 ఫిబ్రవరి 2023) ట్రేడింగ్‌లో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) షేర్లు 1% పైగా పడిపోయాయి, రూ. 585 వద్ద ముగిశాయి. ఈ స్టాక్, తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 582 కంటే ఒక్క అంగుళం పైన మాత్రమే ప్రస్తుతం ఉంది. అదానీ గ్రూప్ షేర్లలో పతనం కారణంగా, ఆ గ్రూప్ షేర్లలో ఎల్‌ఐసీ లాభాలు అత్యంత భారీ స్థాయిలో ఆవిరవడం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. అదానీ తుపాను మొదలైన నాటి నుంచి, గత నెల రోజుల్లో, LIC షేర్ ధర దాదాపు 15% తగ్గింది.
BSE సమాచారం ప్రకారం... అదానీ గ్రూప్‌లోని అదానీ పోర్ట్స్ & సెజ్‌లో LIC అతి పెద్ద పెట్టుబడి ఉంది, ఆ కంపెనీలో 9.1% వాటాను కలిగి ఉంది. ఇతర ఆరు అదానీ గ్రూప్ కంపెనీల్లో 1.25% నుంచి 6.5% మధ్య వాటాలు ఉన్నాయి.
శుక్రవారం సెషన్‌లో, అదానీ గ్రూప్‌లోని 10 కౌంటర్లలో ఏడు నష్టాల్లో ముగిశాయి. ఈ ఏడు కౌంటర్లలో, నాలుగు స్టాక్స్ - అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ మరియు అదానీ పవర్ - వాటి 5% లోయర్ సర్క్యూట్‌లోకి పడిపోయాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 5% నష్టంతో ముగిసింది. అదానీ విల్మార్ 3.3% దిగువన ముగియ, NDTV 4.1% క్షీణించింది.
మిగిలిన స్టాక్స్‌లో... అంబుజా సిమెంట్స్ 2.4% లాభంతో ముగియగా, అదానీ పోర్ట్స్ & సెజ్ 1.2% పెరిగింది. ACC ఎటువంటి మార్పు లేకుండా డే క్లోజ్ చేసింది.
గవర్నమెంట్ లెక్క ప్రకారం రూ. 20,000 కోట్లు ఆవిరి
2023 జనవరి 27న, మార్కెట్ ముగిసే సమయానికి ఎల్‌ఐసీలో అదానీ పోర్ట్‌ఫోలియో మార్కెట్ విలువ రూ. 56,142 కోట్లుగా ఉంది. ఫిబ్రవరి ప్రారంభంలో, పార్లమెంటు ప్రశ్నకు సమాధానంగా, అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ. 30,127 కోట్లుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. అంటే, అదానీ షేర్లలో కేవలం కొన్ని రోజుల్లోనే రూ. 20,000 కోట్లను ఎల్‌ఐసీ కోల్పోయింది.
కథ ఇంకా ముగియలేదు. ఫిబ్రవరి ప్రారంభంలో అదానీ షేర్లలో ఎల్‌ఐసీ వాటాల విలువ రూ. 30,127 కోట్లు. అదానీ షేర్లు నిరంతరం పడుతూనే ఉన్నాయి కాబట్టి, ఈ విలువ మరింత పతనమై, నష్టం ఇంకా భారీగా పెరిగే ఉంటుంది.
ఈ ఏడాది జనవరిలో స్టాక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు ఎల్‌ఐసీ కొంత లాభాలను బుక్ చేసిందని అదానీ గ్రూప్ ఇన్‌సైడర్లు చెబుతున్నా, ఈ ఇన్సూరెన్స్ మేజర్ మాత్రం నోరు విప్పడం లేదు. అదానీ షేర్లలో తన లాభ-నష్ట స్థితి గురించి ప్రకటన చేయడం లేదు.
నెల రోజుల్లో రూ.12 లక్షల కోట్లు నష్టం
అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసం, స్టాక్ ధరల తారుమారు, కార్పొరేట్ దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సరిగ్గా నెల రోజుల క్రితం (2023 జనవరి 24న) ఒక నివేదికను ప్రచురించినప్పటి నుంచి, అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ధరలు దక్షిణం దిశగా (కిందకు) పయనించాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 లిస్టెడ్ స్టాక్స్‌లో రక్తస్రావం ఇంకా ఆగలేదు.
శుక్రవారం 5% లోయర్ సర్క్యూట్ ముగింపు తర్వాత, ఈ నెల రోజుల్లో అదానీ టోటల్ గ్యాస్ దాదాపు 81% విలువను కోల్పోయింది. ఏప్రిల్ 2022లో నమోదైన 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి పతనాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ స్టాక్ 84% తగ్గింది. మరో రెండు స్టాక్‌లు కూడా '85% డౌన్ సైడ్' మార్కుకు చేరువలో ఉన్నాయి. అవి అదానీ గ్రీన్ ఎనర్జీ గత నెల రోజుల్లో దాదాపు 75% నష్టపోయింది, అదానీ ట్రాన్స్‌మిషన్ 74% తగ్గింది.
ఈ నెల రోజుల్లో అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్లు లేదా దాదాపు $146 బిలియన్లను తుడిచిపెట్టుకు పోయింది. జనవరి 24న ఉన్న రూ. 19.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పోలిస్తే, శుక్రవారం మార్కెట్ ముగింపు నాటికి రూ. 7.2 లక్షల కోట్లకు గ్రూప్ మార్కెట్ విలువ తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.