LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు సెబీ ఆమోదం - కానీ ఏం ఫాయిదా లేదుగా!
LIC Listing: ఎల్ఐసీ ఐపీవోకు సెబీ అనుమతి ఇచ్చింది. అనుమతైతే వచ్చింది కానీ ఎల్‌ఐసీ లిస్టింగ్ (LIC Listing) మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.
LIC listing: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC India) ఐపీవోకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. మంగళవారం సాయంత్రం ఆమోదం లభించినట్టు రాయిటర్స్ తెలిపింది. అనుమతైతే వచ్చింది కానీ ఎల్‌ఐసీ లిస్టింగ్ (LIC Listing) మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే (Russia - Ukrain War) ఇందుకు కారణం. యుద్ధం వల్ల భారత్ మార్కెట్లు (Indian markets) తీవ్ర ఒడుదొడులకు గురవుతున్నాయి. ఇలాంటప్పుడు ఐపీవోకు రావడం మంచిది కాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. లిస్టింగ్ మరికొన్నాళ్లు వాయిదా పడుతుందని అంటున్నారు. సెబీ (SEBI) అనుమతి ఇచ్చిన 12 నెలల లోపు ఐపీవోకు (LIC IPO) అవకాశం ఉంటుంది.
ఎల్‌ఐసీలో 5 శాతం వాటా అయిన 31.6 కోట్ల షేర్లను ఐపీవో ద్వారా విక్రయించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సెబీ వేగంగా అనుమతి ఇచ్చిన కంపెనీల్లో ఎల్‌ఐసీ ఐపీవో ఒకటి. ఫిబ్రవరి 12నే కంపెనీ సెబీ వద్ద ముసాయిదా (DRHP)ని దాఖలు చేసింది. మార్చి 8 సాయంత్రం ఇందుకు ఆమోదం లభించిందని తెలిసింది. కానీ మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంటు ఉండటంతో ఐపీవో ఆలస్యం అవుతుందని ఇన్వెస్టుమెంటు బ్యాంకర్లు చెబుతున్నారు.
తమ డిస్‌ఇన్వెస్టుమెంటు లక్ష్యమైన రూ.78,000 కోట్లలో రూ.60,000 కోట్లు ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా రాబట్టాలని ప్రభుత్వం అనుకుంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మార్కెట్ ఒడుదొడుకులతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడనుంది. అవసరమైతే తాము ఐపీవో తేదీపై మరోసారి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman) కొన్నిరోజుల ముందే చెప్పడం గమనార్హం.
'పూర్తిగా భారత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మేం ఈ ఐపీవో ప్రణాళికను రూపొందించుకున్నాం. నిజానికి మేం దీని ప్రకారమే ముందుకెళ్లాలి. ఒకవేళ అంతర్జాతీయ పరిస్థితులను మరోసారి సమీక్షించాలని సూచిస్తుంటే మేం అందుకు సిద్ధమే. మాకేమీ ఇబ్బంది లేదు' అని నిర్మలా సీతారామన్ బిజినెస్ లైన్ ఇంటర్వ్యూలో చెప్పారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
ఎల్‌ఐసీ దాదాపుగా 10.4 బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.70వేల కోట్లకు పైగా విలువతో ఐపీవోకు రావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2022, మార్చి 31లోగా ఈ పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడం ద్వారా బడ్జెట్ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల సమీక్షిస్తే ఐపీవో సమయం మారొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఫిబ్రవరి 13న ఎల్‌ఐసీ ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. కంపెనీ విలువను రూ.5.4 లక్షల కోట్లుగా చూపించింది.
ఐపీవో మరికాస్త ఆలస్యమైతే ప్రభుత్వ వార్షిక డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలపై ప్రభావం పడుతుందా అని ప్రశ్నించగా 'ఒక ప్రైవేటు రంగ ప్రమోటర్ తేదీపై నిర్ణయం తీసుకుంటే ఆ కంపెనీ బోర్డుకు చెబితే సరిపోతుంది' అని నిర్మల అన్నారు. 'కానీ నేను మాత్రం మొత్తం ప్రపంచానికి వివరించాల్సి ఉంటుంది' అని ఆమె పేర్కొన్నారు.