SBI Chocolate Scheme: లోన్ కట్టకపోతే స్టేట్ బ్యాంక్ చాక్లెట్ ఇస్తుంది, ఆల్రెడీ కొందరికి పంపింది కూడా!
బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రిటైల్ రుణాలు విపరీతంగా పెరిగాయి.
SBI Chocolate Scheme: బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వాళ్లలో కొందరు సకాలంలో తిరిగి చెల్లించరు. పరిస్థితులు బాగాలేక ఈఎంఐలు కట్టలేని వాళ్లు కొందరు, కావాలని ఎగ్గొట్టే వాళ్లు మరికొందరు. ఈ తరహా వ్యక్తుల నుంచి వసూళ్లు చేపట్టడం బ్యాంకులకు బ్రహ్మ విద్య లాంటిది. డిఫాల్టర్ల నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి బ్యాంకులు నిరంతరం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి.
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా, రుణాల రికవరీ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని (SBI Special scheme to recover EMIs) తీసుకొచ్చింది. నెలవారీ చెల్లింపులను (EMIs) సకాలంలో కట్టలేకపోతున్న, ఎగ్గొడుతున్న వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఆ స్కీమ్‌ను డిజైన్ చేసింది.
డిఫాల్టర్లకు చాక్లెట్లు అందుతాయి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన కొత్త పథకం వినూత్నంగా ఉంది. బారోవర్/రుణగ్రహీత సకాలంలో చెల్లింపులు చేయడం లేదని బ్యాంకు భావిస్తే, అతని ఇంటికి చాక్లెట్లను (SBI Chocolate Scheme) పంపుతుంది. EMI చెల్లించకుండా, బ్యాంక్ రిమైండర్ కాల్స్‌కు కూడా స్పందించని కస్టమర్లను ఈ స్కీమ్ టార్గెట్ చేస్తుంది. నిర్దిష్ట చెల్లింపులు చేయకూడదని ప్లాన్ చేస్తున్నారని అనుమానం ఉన్న కస్టమర్లను కూడా టార్గెటెడ్ పర్సన్స్ లిస్ట్‌లోకి చేర్చింది. అలాంటి వాళ్ల ఇంటి వద్దకు నేరుగా వెళ్లి చాక్లెట్ ఇవ్వడం ద్వారా, బ్యాంక్ లోన్ తిరిగి చెల్లించమని బ్యాంకు వారికి గుర్తు చేస్తుంది.
పెరిగిన డిఫాల్ట్ కేసులు
బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రిటైల్ రుణాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ రావడం విశేషం. రిటైల్ రుణాల పెరుగుదలతో, నెలవారీ EMI డిఫాల్ట్ కేసులు కూడా పెరిగాయి. లోన్ అమౌంట్ వసూళ్ల కోసం దేశంలోని అన్ని బ్యాంకులు చాలా పథకాలు, ప్రచారాలను నడుపుతున్నాయి. SBI చాక్లెట్ స్కీమ్ కూడా మెరుగైన రికవరీ కోసం స్టార్ట్ అయింది.
పెరిగిన బ్యాంక్ రిటైల్ రుణాలు
SBI విషయానికి వస్తే... 2023 జూన్ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ కాలం) రిటైల్ రుణాలు రూ.12,04,279 కోట్లకు పెరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం, 2022 జూన్ త్రైమాసికంలో ఇవి రూ.10,34,111 కోట్లుగా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఒక్క ఏడాదిలో బ్యాంకు రిటైల్ రుణాలు 16.46 శాతం పెరిగాయి. 2023 జూన్ నెలలో SBI మొత్తం రుణం రూ. 33,03,731 కోట్లు. ఇప్పుడు, బ్యాంక్ లోన్ బుక్‌లో రిటైల్ రుణాలది అత్యధిక వాటాగా మారింది.
ప్రయోగాత్మకంగా చేపట్టిన బ్యాంక్
చాక్లెట్ స్కీమ్ ప్రచారం ఇంకా పైలట్ దశలోనే ఉందని SBI మేనేజింగ్ డైరెక్టర్ & రిస్క్, కంప్లైయన్స్, స్ట్రెస్‌డ్ అసెట్స్ ఇన్‌ఛార్జ్ అశ్విని కుమార్ తివారీ చెప్పారు. SBI దీనిని 10-15 రోజుల క్రితమే ప్రారంభించింది, ప్రారంభ స్పందన చాలా బాగుందని తెలుస్తోంది. చాక్లెట్ ఇచ్చి లోన్ వసూలు చేసే వినూత్న ప్రచారం కారణంగా రికవరీ మెరుగుపడుతోంది. ప్రయోగాత్మక దశలో మంచి ఫలితాలు వస్తే దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయవచ్చని అశ్విని కుమార్ వెల్లడించారు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial