SBI Bonds: రూ.10,000 కోట్లు సమీకరించిన ఎస్బీఐ - షేర్ల మూమెంటమ్ ఎలా ఉందంటే?
SBI Bonds: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించింది. 7.49శాతం కూపన్ రేటుతో నాలుగో దఫా మౌలిక సదుపాయాల బాండ్లను విడుదల చేసింది.
SBI Bonds:
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించింది. 7.49శాతం కూపన్ రేటుతో నాలుగో దఫా మౌలిక సదుపాయాల బాండ్లను విడుదల చేసింది. ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ పండ్లు, కార్పొరేట్లు ఈ ఇష్యూకు పెట్టుబడిదారులుగా ఉన్నారు. తక్కువ ధర ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకు సుదీర్ఘ కాలం ఈ నిధులను ఉపయోగిస్తామని ఎస్బీఐ తెలిపింది.
ఎస్బీఐ రూ.10,000 కోట్లు సమీకరిస్తున్న విషయం తెలిసినప్పటికీ కంపెనీ షేర్లు సోమవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. నేటి ఉదయం రూ.601 మొదలైన షేర్లు ఇంట్రాడేలో రూ.590 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. రూ.601 వద్ద గరిష్ఠాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నాలుగు రూపాయల నష్టంతో రూ.594 వద్ద ట్రేడవుతున్నాయి.
భారతీయ స్టేట్ బ్యాంకు బాండ్ల జారీకి పెట్టుబడిదారుల నుంచి చక్కని స్పందన లభించింది. రూ.21,045 కోట్ల విలువైన బిడ్లు దాఖలు చేశారు. కనీస ఇష్యూ పరిమాణమైన రూ.4000 కోట్ల కన్నా ఐదు రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
'మొత్తం 134 బిడ్లు రావడాన్ని బట్టి ఎక్కువ మంది పోటీపడ్డారని తెలుస్తోంది. ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు, కార్పొరేట్ కంపెనీలు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఈ నిధులను సుదీర్ఘ కాలంలో మౌలిక సదుపాయాలు, అందుబాటు ధర గృహాల రంగంలో వినియోగిస్తాం' అని ఎస్బీఐ చెప్పింది. కాగా కంపెనీ ఆగస్టు ఒకటిన రూ.10,000 కోట్లు, జనవరి 19న రూ.9,718 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం విడుదల చేసిన బాండ్లకు స్థానిక రేటింగ్ ఏజెన్సీలు AAA రేటింగ్‌ను ఇవ్వడం గమనార్హం. ఇప్పటి ఇష్యూతో మొత్తంగా ఎస్బీఐ విడుదల చేసిన సుదీర్ఘ కాలపు బాండ్ల విలువ రూ.39,718 కోట్లకు చేరుకుంది. బ్యాంకు ఎప్పుడు బాండ్లను విడుదల చేస్తున్నా ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుండటం గమనార్హం.
'సుదీర్ఘ కాలం బాండ్ కర్వ్‌ను అభివృద్ధి చేయడం, ఇతర బ్యాంకులు సుదీర్ఘ కాలపు బాండ్లు జారీ చేసేలా ప్రోత్సహించేందుకు మా ఇష్యూ సాయపడుతుందని విశ్వసిస్తున్నాం' అని ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో వివిధ రుణ సాధనాల ద్వారా రూ.50,000 కోట్లను సమీకరిస్తామని జూన్ నెలలో స్టేట్ బ్యాంకు తెలిపింది. కాగా ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో కంపెనీ ఒక త్రైమాసికంలో అత్యధిక నికర లాభం రూ.16,884 కోట్లు నమోదు చేయడం గమనార్హం. బ్రోకరేజీ కంపెనీ ఎల్‌కేపీ సెక్యూరిటీస్ ఎస్బీఐ టార్గెట్‌ను రూ.743కు సవరించిన సంగతి తెలిసిందే.
Stock Market Opening 25 September 2023:
భారత స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. బెంచ్‌మార్క్ సూచీలు సోమవారమూ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియాలో మెజారిటీ సూచీలన్నీ నష్టపోవడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. పైగా అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు తోడయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 56 పాయింట్లు తగ్గి 19,618 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 179 పాయింట్లు తగ్గి 65,829 వద్ద కొనసాగుతున్నాయి. వినియోగ వస్తువులు మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.