Ola Electric Case: రూ.20 కోట్లు ఎగ్గొట్టిన ఓలా ఎలక్ట్రిక్! - స్కూటర్ల కంపెనీ రియాక్షన్ ఇదే
Rosmerta Digital Services: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తయారీ కంపెనీ రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్, దాదాపు 20 కోట్ల చెల్లింపులకు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదు చేసింది.

Ola Electric Accused In Payment Default Case: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ లిమిటెడ్ మెడకు రూ.20 కోట్ల ఎగవేత కేసు చుట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ లిమిటెడ్ తమకు దాదాపు రూ. 18-20 కోట్ల చెల్లింపు చేయకుండా ఎగ్గొట్టిందని హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తయారీదారు & వాహన రిజిస్ట్రేషన్ ఏజెన్సీ అయిన 'రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్' (Rosmerta Digital Services Ltd) ఆరోపించింది. ఓలా ఎలక్ట్రిక్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
బకాయిల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిందని ఆరోపిస్తూ, రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ బెంగళూరులోని NCLTలో ఓలా ఎలక్ట్రిక్‌పై పిటిషన్ దాఖలు చేసిందని ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. దీనితో పాటు, దివాలా నియమావళి (Bankruptcy Code)లోని సెక్షన్ 9 కింద కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (corporate insolvency resolution process) ప్రారంభించమని ఆ పిటిషన్‌లో రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ అభ్యర్థించినట్లు కూడా వెల్లడించింది.
రోస్మెర్టా వాదనలను తోసిపుచ్చిన ఓలా
రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ వాదనలను ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఖండించింది. రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ కంపెనీ చెబుతోంది. ఈ ఆరోపణ ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్ పోర్టల్ వాహన్ (VAHAN)లో తమ స్కూటర్ల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, వాహన అమ్మకాలపై అది ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని ప్రకటించింది.
దీనికి ముందు, 19 ఫిబ్రవరి 2025న, తన వాహనాల రిజిస్ట్రేషన్ ఏజెన్సీలతో ఒప్పందాలపై మళ్లీ చర్చలు జరుపుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది.
మంత్రిత్వ శాఖ సమాచారం - కంపెనీ సమాచారంలో వ్యత్యాసాలు
కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways) వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం, 2025 ఫిబ్రవరిలో ఓలా 8,647 స్కూటర్లను విక్రయించింది. అయితే, అదే కాలంలో 25,000 పైగా వాహనాలు అమ్ముడయ్యాయని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఫిబ్రవరిలో వాస్తవ అమ్మకాలు - కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాల మధ్య ఎటువంటి తేడా లేదని ఓలా ఎలక్ట్రిక్ వర్గాలు గతంలో తెలిపాయి. మార్చి 13 నాటికి, ఓలా ఎలక్ట్రిక్ 5,208 స్కూటర్లను విక్రయించింది. కంపెనీ లాభనష్టాలను ప్రభావితం చేసే ఎబిటా (EBITDA)ని సానుకూలంగా ఉంచడానికి, ఓలా ప్రతి నెలా 50,000 స్కూటర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఓలా ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఇప్పటికే 'సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' (Central Consumer Protection Authority - CCPA) దర్యాప్తు ఎదుర్కొంటోంది. కంపెనీపై & కంపెనీ ఉత్పత్తులపై దాఖలైన 10,000కు పైగా వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన అదనపు సమాచారం సమర్పించాలని ఓలా ఎలక్ట్రిక్‌ను 'సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' ఆదేశించింది. ఈ సమయంలో రోజ్మెర్టా డిజిటల్ సర్వీసెస్ ఫిర్యాదు రూపంలో ఓలా ఎలక్ట్రిక్ నెత్తిన మరో పిడుగు పడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

