Gautam Adani: ఆసియాలో అత్యంత సంపన్నుడు అదానీ - ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరుగుతాయ్
Adani Group Market Cap: గత కొన్నాళ్లుగా అదానీ గ్రూప్ స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం, అదానీ గ్రూప్‌లోని కంపెనీల 10 లిస్టెడ్ మార్కెట్ విలువ రూ. 17.94 లక్షల కోట్లకు చేరుకుంది.
![Gautam Adani: ఆసియాలో అత్యంత సంపన్నుడు అదానీ - ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరుగుతాయ్ richest in india gautam adani beats mukesh ambani to become asia richest man said bloomberg billionaires index Gautam Adani: ఆసియాలో అత్యంత సంపన్నుడు అదానీ - ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరుగుతాయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/03/e278da9afaec5159fa43e9a95b7c99b91717387273266545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Richest Person In Asia: ఆసియాలో అత్యంత ధనవంతుడి హోదాను అనుభవిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేష్ అంబానీ (Mukesh Ambani), ఆ కిరీటాన్ని తన సమీప ప్రత్యర్థికి కోల్పోయారు. వ్యాపార విస్తరణలో, ఆస్తిపాస్తుల్లో ముకేష్ అంబానీకి గట్టి పోటీ ఇస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అంబానీని మరోమారు వెనక్కి నెట్టారు. భారత్‌లోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడి పేరును మళ్లీ సంపాదించుకున్నారు.
గత కొన్నాళ్లుగా అదానీ గ్రూప్ స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం, అదానీ గ్రూప్‌లోని కంపెనీల 10 లిస్టెడ్ మార్కెట్ విలువ (Adani Group Market Cap) రూ. 17.94 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో, ప్రస్తుతం గౌతమ్ అదానీ నికర విలువ (Gautam Adani Net Worth) 111 బిలియన్ డాలర్లుగా మారింది. అదే సమయంలో, ముకేష్ అంబానీ నికర విలువ ప్రస్తుతం (Mukesh Ambani Net Worth) 109 బిలియన్ డాలర్లుగా ఉంది.
కోల్పోయిన హోదా 16 నెలల తర్వాత కైవసం
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ సంపద 5.45 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 45,000 కోట్లు) పెరిగింది, 111 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా, ఆసియాలోనే అత్యంత ధనవంతుడి గౌరవాన్ని 16 నెలల తర్వాత తిరిగి సంపాదించుకున్నారు. ఈ విజయం కోసం అదానీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో సంక్షోభాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక బయటకు వచ్చాక గౌతమ్ అదానీతో పాటు అదానీ గ్రూప్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాయి. అయితే... క్లీన్ చిట్ పొందిన తర్వాతి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద కూడా వేగంగా పెరిగింది. ఫలితంగా, బిలియనీర్ల జాబితాలో మార్పులు వచ్చాయి.
ఈ ఏడాదిలో 12.7 బిలియన్ డాలర్ల సంపాదన
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యారు. ఈ జాబితాలో ముకేష్ అంబానీ ప్రస్తుతం 12వ స్థానానికి పడిపోయారు. దీంతోపాటు, 2024లో అత్యధిక సంపద ఆర్జించిన వ్యక్తుల జాబితాలోనూ అదానీ చోటు సంపాదించారు. ఈ ఏడాది జనవరి 01 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 12.7 బిలియన్ డాలర్లను అదానీ సంపాదించారు.
సరిగ్గా పదేళ్ల క్రితం, 2014లో, గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 5 బిలియన్ డాలర్లు. ఈ పది సంవత్సరాల్లో (మోదీ ప్రభుత్వ హయాంలో) అదానీ సంపదన అనేక రెట్లు పెరిగింది, 111 బిలియన్ డాలర్లకు చేరింది. దాదాపు ఏడాదిన్నర క్రితం, 2022 సెప్టెంబర్‌లో అదానీ పీక్ స్టేజ్‌కు చేరారు. ఆ సమయంలో, కొంతకాలం పాటు ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
అమెరికా బ్రోకరేజీ సంస్థ జెఫ్‌రీస్, అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్లకు బూస్ట్ ఇచ్చింది. అదానీ కంపెనీలపై బుల్లిష్‌గా ఉన్నట్లు చెబుతూ పాజిటివ్ రేటింగ్ ఇచ్చింది. దీంతో, శుక్రవారం (31 మే 2024) ట్రేడింగ్ సెషన్‌లో అదానీ కంపెనీల షేర్లు దాదాపు 14 శాతం దూసుకెళ్లాయి, అదనంగా రూ. 84,064 కోట్ల సంపదను యాడ్ చేశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)