Interest Rates: EMI భారం నుంచి ఉపశమనం, వడ్డీ రేట్లు తగ్గొచ్చు - హింట్ ఇచ్చిన ఆర్థిక మంత్రి
RBI Repo Rate: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుత మీటింగ్‌లో రెపో రేట్ తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 2025 సమావేశంలోనూ మరో విడత కోత ఉండవచ్చు.

RBI MPC Meeting February 2025: దేశంలో గరిష్ట స్థాయిలో ఉన్న వడ్డీ రేట్ల కారణంగా EMIలు కూడా గరిష్ట స్థాయిలో ఉన్నాయి, సామాన్య జనం మోయలేని బరువుగా మారాయి. వచ్చే నెల నుంచి ఈ భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరు ఫ్లోటింగ్ రేట్‌తో బ్యాంక్ నుంచి లోన్ (గృహ రుణం లాంటివి) తీసుకుంటే, వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగాయి. 07 ఫిబ్రవరి 2025 శుక్రవారం నాడు, ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటిస్తుంది. ఇప్పుడు, RBI తన పాలసీ రేటును (రెపో రేటు) 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించే అవకాశం ఉంది.
హింట్ ఇచ్చిన నిర్మలమ్మ
వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్ల తగ్గింపును కోరుకుంటోంది. కాబట్టి, రెపో రేట్ (RBI Repo Rate)ను తగ్గించే అవకాశం పెరిగింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆర్‌బీఐకి ఉందని, తాను వారికి ఏమీ చెప్పలేనని అన్నారు. కానీ, వ్యవస్థలోకి మరింత నగదు సరఫరా అవసరమని చెప్పారు. కేంద్ర బ్యాంక్ కూడా కొంతకాలం నుంచి ఇదే పనిలో ఉంది, బ్యాంకుల్లోకి వేల కోట్ల రూపాయలను పంప్ చేయడం ద్వారా మార్కెట్‌లోకి డబ్బు పంపుతోంది. ఈ క్రమంలో, రెపో రేట్‌ను తగ్గించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
6.50 శాతం నుంచి 6.25 శాతానికి రెపో రేట్!
ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI New Governor Sanjay Malhotra) అధ్యక్షతన, ఫిబ్రవరి 05 నుంచి మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కొత్త గవర్నర్ ఫిబ్రవరి 07 శుక్రవారం నాడు ప్రకటిస్తారు. ఈ సమావేశంలో రెపో రేటును నాలుగో వంతు (0.25%) తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే, రెపో రేటును ప్రస్తుత స్థాయి 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌ల్లో వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి.
సంజయ్ మల్హోత్రా కంటే ముందు గవర్నర్‌గా ఉన్న శక్తికాంత దాస్ (Shaktikanta Das), అధిక ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపుతూ రెపో రేటును తగ్గించలేదు. సంజయ్ మల్హోత్రా హయాంలో జరిగే మొదటి పాలసీ ప్రకటనలోనే రెపో రేటులో కోతను ప్రకటించవచ్చని నమ్ముతున్నారు. దీనికి ముందు, 2020 మే నెలలో RBI రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు కట్ చేసి 4 శాతానికి తగ్గించింది. కానీ రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత, ద్రవ్యోల్బణం రేటు 7.80 శాతానికి పెరిగింది, ఆ తర్వాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, RBI 2022 మే - 2023 ఫిబ్రవరి మధ్యకాలంలో రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే స్థాయి కొనసాగింది.
ఫిబ్రవరి 01, 2025న బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి కొత్త ఆదాయ పన్ను విధానంలో మార్పులను ప్రకటించారు. రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల, పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది నుంచి రూ.50 వేల వరకు డబ్బు మిగులుతుంది. ఓవరాల్‌గా చూస్తే ఇది రూ.లక్షల కోట్లు అవుతుంది. దీనివల్ల వినియోగం & డిమాండ్ రెండూ పెరిగి ఆర్థిక వ్యవస్థలో వేగం పెరుగుతుంది.
ఆర్థిక మంత్రి తర్వాత, ఇప్పుడు, బూస్టర్ డోస్ ఇవ్వడం ఆర్‌బీఐ వంతు. ఖరీదైన EMIల నుంచి ఉపశమనం కల్పించడం ద్వారా & మార్కెట్లో నగదు లభ్యతను పెంచడం ద్వారా RBI ఈ పని పూర్తి చేస్తుందని భావిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: పట్ట పగ్గాల్లేకుండా పెరుగుతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

