Reliance Salon Business: రిలయన్స్ హెయిర్ కటింగ్ షాపులు - త్వరలో మీ ఏరియాలోనూ కనిపించొచ్చు
'నేచురల్ సలోన్ & స్పా'లో (Naturals Salon & Spa) దాదాపు సగం వాటాను ముఖేష్ అంబానీ కొనబోతున్నారు. 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ టీమ్ చర్చలు జరుపుతోంది.
Reliance Salon Business: రిలయన్స్ వాళ్లు (Reliance Industries) ఆ బిజినెస్ చేస్తున్నారు, ఈ బిజినెస్ చేస్తున్నారని వార్తలు విన్నప్పుడు.. ముఖేష్ అంబానీ దేన్నీ వదలి పెట్టరా అని మీకు ఒక్కసారైనా అనిపించి ఉంటుంది కదూ. ఆయన అడుగు పెట్టబోతున్న లిస్ట్‌లోకి హెయిర్ కటింగ్ షాపు కూడా చేరింది. మరికొన్ని రోజుల్లో రిలయన్స్ వాళ్లు జనానికి క్షవరం చేస్తారన్న మాట.
రిలయన్స్ గ్రూప్‌లో ఉన్న రిలయన్స్ రిటైల్ (Reliance Retail) విభాగం దేశంలోనే అతి పెద్ద కిరాణా దుకాణాల సముదాయం. రిటైల్ సెగ్మెంట్‌లో రిలయన్స్ రిటైల్‌ది లీడింగ్ రోల్. రిలయన్స్ రిటైల్ ద్వారా 'నేచురల్ సలోన్ & స్పా'లో (Naturals Salon & Spa) దాదాపు సగం వాటాను ముఖేష్ అంబానీ కొనబోతున్నారు. 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ టీమ్ చర్చలు జరుపుతోంది.
చెన్నై ప్రధాన కేంద్రంగా సౌందర్య సంరక్షణ వ్యాపారం చేస్తోంది నేచురల్ సలోన్ & స్పా. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనికి భారతదేశం అంతటా 650కి పైగా సెలూన్‌లు ఉన్నాయి. 2025 నాటికి 3,000 సెలూన్‌లకు విస్తరించాలన్నది నేచురల్ సలోన్ & స్పా ప్లాన్. దీని వ్యాపారం మూడు కటింగ్‌లు, ఆరు ఫేషియల్స్‌గా సాగుతోంది. 49 శాతం వాటా తమకు అమ్మమంటూ, నేచురల్ సలోన్ & స్పా ప్రమోటర్లను అంబానీ అడుగుతున్నారు.
లాక్మేతో పోటీ
లాక్మే బ్రాండ్‌తో సెలూన్ వ్యాపారం చేస్తున్న HUL పోటీ పడేందుకే రిలయన్స్ ఈ స్టెప్ తీసుకుంది.
నేచురల్ సలోన్ & స్పాలో 49 శాతం వాటా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత చెల్లిస్తారన్నది మాత్రం ఇంకా తేలలేదు. నేచురల్ సలోన్ విలువను ఇప్పటికే రిలయన్స్ అంచనా వేసింది. దానికి తగ్గట్లుగా 49 వాటా విలువ ఎంతవుతుందో కూడా లెక్కగట్టింది. ఈ విలువపై ఇరువర్గాలు అంగీకారానికి వచ్చే అంశం మీదే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
నేచురల్స్ సలోన్ & స్పా CEO &కో ఫౌండర్ CK కుమారవేల్ ఈ డీల్ మీద స్పందించారు. "ఒక బహుళ జాతి సంస్థ సెలూన్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది, ఇది అతి పెద్ద మలుపు" అంటూ లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. రిలయన్స్‌తో ఒప్పందం గురించి హింట్ ఇచ్చారు. నేచురల్ సలోన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా 49 శాతం వాటాను ఇంకా కొనుగోలు చేయలేదని కూడా కామెంట్ పోస్ట్ చేశారు.
"ఇప్పుడున్న మొత్తం 700 సెలూన్‌ల నుంచి భవిష్యత్తులో భారీ వృద్ధి ఉండబోతోంది. ఈ నంబర్‌లో 4 -5 రెట్లు పెరుగుదల ఉంటుంది" అని కుమారవేల్ పేర్కొన్నారు. "రాబోయే కాలంలో నేచురల్స్ సలోన్ & స్పాలో అనూహ్య మార్పులను మనం చూస్తాము" అని వెల్లడించారు.
కరోనా మహమ్మారి సమయంలో బ్యూటీ & సెలూన్ ఇండస్ట్రీ మూలన పడింది. బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ సెలూన్లు నెలల తరబడి తెరుచుకోలేదు. ఇప్పుడు మళ్లీ కొవిడ్ పూర్వ స్థాయికి చేరింది. సెలూన్లలో గతంలోని రష్ కనిపిస్తోంది. వ్యాపారం కళకళలాడుతోంది.
షేరు ధర
స్టాక్ మార్కెట్‌లో, శుక్రవారం 1.43 శాతం లేదా రూ. 36.50 పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర, రూ. 2,592.45 వద్ద ముగిసింది. గత ఆరు నెలల కాలంలో ఒక్కో షేరు ధర రూ. 48.30 లేదా 1.83 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూస్తే.. ఒక్కో షేరు విలువ రూ. 188.10 లేదా 7.82 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.