Reliance Retail and Jio: మనీ మార్కెట్ నుంచి రూ.8,500 కోట్లు తెచ్చిన రిలయన్స్- కొత్తగా ఏం ప్లాన్ వేసిందో?
లోన్ల మీద 5.99% వడ్డీ చెల్లించే హామీతో రిలయన్స్ రిటైల్; 5.92% వడ్డీ చెల్లించే హామీతో రిలయన్స్ జియో కమర్షియల్ పేపర్లను (CPs) విక్రయించాయి.
Reliance Retail and Jio: మన దేశంలో రిటైల్, టెలికాం సెక్టార్లలో లీడింగ్ పొజిషన్లలో ఉన్న రిలయన్స్ గ్రూప్ (Reliance Group) కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (Reliance Retail Ventures), రిలయన్స్ జియో (Reliance Jio), తమ స్థానాన్ని మరింత పరిష్టం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.8,500 కోట్లను సమీకరించాయని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా ఈ మొత్తాన్ని కూడగట్టాయన్నది సమాచారం.
లోన్ల మీద 5.99% వడ్డీ చెల్లించే హామీతో రిలయన్స్ రిటైల్; 5.92% వడ్డీ చెల్లించే హామీతో రిలయన్స్ జియో కమర్షియల్ పేపర్లను (CPs) విక్రయించాయి. ఇవి 90 రోజుల వరకు మెచ్యూరిటీలతో ఉన్నాయి.
షార్ట్ టర్మ్ డెట్ మార్కెట్‌లో నడుస్తున్న రేటుకు అనుగుణంగా ఈ వడ్డీ రేట్లు ఉన్నాయి. అంటే, చేస్తున్న అప్పు మీద ఎక్కువ వడ్డీని ఈ రెండు కంపెనీలు చెల్లించబోవడం లేదు.
ఎవరి నుంచి అప్పు?
రిలయన్స్, మార్కెట్‌లో పాతుకుపోయిన సంస్థ కాబట్టి ఇన్వెస్టర్లకు సాధారణంగానే దీని మీద నమ్మకం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫండ్ మేనేజర్లు లేదా ఇతర ఫైనాన్సింగ్ కంపెనీలు కమర్షియల్ పేపర్లను కొంటాయి. మూడు నెలల క్రితం కూడా జియో ఈ విధమైన ఫండ్ రైజింగ్‌కు వెళ్లింది. అప్పుడు కూడా ఇదే విధమైన మెచ్యూరిటీ ఉన్న CPలను 5.60-5.70% వడ్డీకి సబ్‌స్క్రైబ్ చేసినట్లు ఒక ఫండ్ మేనేజర్ చెప్పారు. ఆయన ఈసారి కూడా సబ్‌స్క్రైబ్ చేశారు.
కమర్షియల్ పేపర్ అంటే?
సాధారణంగా 12 నెలల వరకు మెచ్యూరిటీతో, కంపెనీలు విక్రయించే షార్ట్ డ్యూరేషన్ (తక్కువ రుణ వ్యవధి) డెట్ సెక్యూరిటీలే ఈ కమర్షియల్ పేపర్లు. అప్పుగా తీసుకోనున్న రూ.8,500 కోట్లలో... రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రూ.5,500 కోట్లకు CPలను విక్రయించగా, జియో రూ.3,000 కోట్లకు CPలను జారీ చేసింది.
రిటైల్ వెంచర్ జారీ చేసిన CPల్లో పావువంతు భాగం మూడు నెలల్లో మెచ్యూర్ అవుతుంది. మిగిలిన వాటికి రెండు నెలల్లోపు విముక్తి కలిగించాల్సి ఉంటుంది.
A1+ రేటింగ్
ఈ రెండు కంపెనీలకు ట్రిపుల్-A రేటింగ్ ఉంది, వాటి CPలకు A1+ రేటింగ్ ఉంది. దీనర్థం CP మార్కెట్‌లో ఇవి టాప్ గ్రేడ్. ఇలా బెస్ట్ రేటింగ్ ఉన్న సెక్యూరిటీలను మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొంటుంటాయి. అయితే, టాప్ రేటెడ్ సెక్యూరీటలకు ఎప్పుడూ తక్కువ వడ్డీ రేటునే ఇస్తాయి. లో రేటెడ్ సెక్యూరిటీలు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేసినా, వాటిలో రిస్క్ ఎక్కువ.
రిలయన్స్ రిటైల్, జియోల CPలకు టాప్ రేటింగ్ ఉంది కాబట్టి, ఇవి ఇస్తున్న వడ్డీ రేటును తక్కువగానే చూడాలి. అంటే, తక్కువ వడ్డీకే ఈ రెండు కంపెనీలు లోన్లు తెచ్చుకున్నాయి. ఓవరాల్‌గా చూస్తే, ఇది రిలయన్స్ ఇండస్ట్రీకి లాభం.
ఇవాళ మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) షేరు ధర దాదాపు ఫ్లాట్‌గా రూ.2,582 దగ్గర కదులుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ కేవలం అర శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 15 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 7 శాతం పైగా లాభపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.