RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం! ఈ రంగానికి ప్రయారిటీ పెంచుతోంది!
RBI: సౌర విద్యుత్ ఫలకాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) భావిస్తోంది. రుణాల మంజూరీలో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించనుంది.
RBI:
సౌర విద్యుత్ ఫలకాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) భావిస్తోంది. రుణాల మంజూరీలో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించనుంది. ఇప్పటికే చర్చలు విజయవంతం అయ్యాయని తెలిసింది. రాబోయే రెండు మూడు నెలల్లో రిజర్వు బ్యాంకు తుది నిర్ణయం తీసుకుంటుందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది.
'కంపెనీలు, బ్యాంకులు, రిజర్వు బ్యాంకు సహా స్టేక్ హోల్డర్ల మధ్య సమావేశాలు జరిగాయి. అందరూ రెండు సూచనలను అంగీకరించారు. బ్యాంకులు సౌర ఫలకాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు అంగీకరించాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (PLI)లో మార్పులు చేసేందుకు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంది' అని ఒక అధికారి మీడియాకు తెలిపారు.
రెండు నెలలుగా బ్యాంకులు, ఆర్థిక, పునరుత్పాదక మంత్రిత్వ శాఖల అధికారులు చాలాసార్లు చర్చలు జరిపారు. సౌర ఫలకాల తయారీదారుల ఆర్థిక, రుణ ఇబ్బందుల గురించి మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం బ్యాంకులు సూచనలు పంపించాయి. అయితే ఆర్థిక సమస్యల గురించే కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌లో భాగంగా దక్షిణాసియా దేశాల నుంచి సుంకాలేమీ లేకుండా దిగుమతులు చేసుకోవడంపై సోలార్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానిక తయారీదారులకు నష్టం జరుగుతోందని అంటున్నాయి. కాగా అంచనా వేసినట్టు ఎగుమతులేమీ తగ్గలేదని గతంలో ఇవే సంఘాలు తెలిపాయి.
'మేం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. చైనా తయారీదారులు ఇతర దేశాలకు వెళ్లి ఎగుమతులు చేయడం వల్లే మాకు మేలు జరుగుతోంది' అని సోలార్ అసోసియేషన్లు పేర్కొన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌లో భాగంగా ఉన్న దేశాల నుంచి సౌర దిగుమతులు 48 శాతం పెరిగాయని తెలిపాయి. కాగా 2023 ప్రథమార్ధంలో చైనా నుంచి సోలార్ మాడ్యూల్ దిగుమతులు 80 శాతం మేర తగ్గాయని ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్ వెల్లడించింది. వీటి విలువ 2 బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొంది.
'స్థానికంగా సౌర విద్యుత్ పరికరాలు, సౌర ఫలకాల తయారీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం దిగుమతులపై సుంకాలు విధించింది. దాంతో భారత సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం బాగా పెరిగింది' అని ఎంబర్ తెలిపింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.