Repo Rate: EMIల భారం నుంచి ఊరట లభిస్తుందా? మీ డబ్బుపై ప్రభావం చూపే రోజు ఇది
Repo Rate: 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న ఐదో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఇది.
RBI MPC Meeting: మన దేశంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, ప్రతి ఒక్కరి డబ్బు, పెట్టుబడులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే నిర్ణయాలు ఈ రోజు వెలువడనున్నాయి. బ్యాంక్ వడ్డీ రేట్లు (Bank interest rates), EMIల భారం పెరుగుతాయా, లేక యథాతథంగా కొనసాగుతాయా అన్నది ఇవాళ తేలిపోతుంది.
ఈ రోజు (శుక్రవారం, 08 డిసెంబర్ 2023), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం (RBI MPC Meet, December 2023) ఫలితాలు వెలువడతాయి. గత బుధవారం నాడు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ప్రారంభమైంది, ఈ రోజు ముగుస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న ఐదో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఇది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ఉదయం 10 గంటలకు ప్రకటిస్తారు.
రెపో రేటు మారుతుందా?
వరుసగా ఐదోసారి కూడా పాలసీ రేట్లలో ఆర్‌బీఐ (RBI Repo Rate) ఎటువంటి మార్పు చేయదని మార్కెట్ గట్టిగా నమ్ముతోంది. దీనివల్ల బ్యాంక్ రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, EMIల భారం పెరగకపోవచ్చు లేదా అతి స్వల్పంగా మారవచ్చు. అయితే, ఈసారి వడ్డీ రేట్ల తగ్గుతాయని భావిస్తున్న వాళ్లకు ఆశాభంగం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2023 ఫిబ్రవరి నుంచి రెపో రేట్‌లో RBI ఎలాంటి మార్పు లేదు. ఈ కీలక రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. వచ్చే ఏడాది జూన్ లోపు ఇందులో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తలు తమ నివేదికలో తెలిపారు. దీనిని బట్టి, 2024-25 రెండో త్రైమాసికం తర్వాతే ఆర్‌బీఐ పాలసీ రేట్లలో మార్పును ఆశించవచ్చు.
తగ్గిన ముడి చమురు ధర
ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు 5 నెలల కనిష్ట స్థాయి, $75 కంటే దిగువకు పడిపోవడం RBI గవర్నర్‌కు అతి పెద్ద ఉపశమనం. ముడిచమురు ధరలు ఈ స్థాయిలోనే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే నిర్ణయం తీసుకోవచ్చు. దేశంలో ఆహార పదార్థాల ధరలు మండిపోతున్నాయి. ఇంధనం చౌకగా మారితే సరుకు రవాణా ఛార్జీలు, దాంతోపాటే ధరలు దిగి వస్తాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation In October 2023) 4.87%కు తగ్గింది. సెప్టెంబర్‌లో ఇది 5.02%, ఆగస్టులో 6.83%గా ఉంది. అంతకముందు జులైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి చేరుకుంది.
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4 శాతానికి చేరుకున్న తర్వాత, పాలసీ రేట్లను తగ్గించాలని ఆర్‌బీఐపై ఒత్తిడి పెరగవచ్చు. 2024 మార్చిలో, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ప్రభావం ఆర్‌బీఐపైనా పడుతుంది.
మరో ఆసక్తికర కథనం: Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' IDFC Bk, Zomato, IIFL Sec, Olectra