By: ABP Desam | Updated at : 08 Feb 2023 11:15 AM (IST)
Edited By: Arunmali
రెపో రేటును 0.25 శాతం పెంచిన ఆర్‌బీఐ
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) మరోమారు వడ్డీ రేట్లను పెంచింది. దేశం యావత్తు ముందు నుంచి ఊహించనట్లుగానే, రెపో రెటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో, మొత్తం రెపో రేటు 6.50 శాతానికి (RBI Repo Rate) చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఇదే చివరి పెంపు.
తాజా పెంపుతో కలిపి, రెపో రేటును ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 225 బేసిస్ పాయింట్ల మేర రిజర్వ్ బ్యాంక్ పెంచింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కఠినంగా మారిన ఆర్థిక మారిన పరిస్థితుల నేపథ్యంలో, 2022 మే నెల నుంచి రెపో రేటు పెంపును ఆర్‌బీఐ ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లెండింగ్ రేట్లను ఆర్‌బీఐ పెంచడం ఇది వరుసగా ఆరోసారి.
సోమవారం (06 ఫిబ్రవరి 2023) ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee - MPC) సమావేశంలో కాసేపటి క్రితం (08 ఫిబ్రవరి 2023న) ముగిసింది. ఆ సమావేశంలో తీసుకున్న వివిధ నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై అంచనాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikant Das) ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాల్లో అతి కీలకం రెపో రేటు. దీనిని 0.25 శాతం ( 25 బేసిస్ పాయింట్లు) పెంచేందుకు నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు.
రెపో రేటు అంటే?
దేశంలోని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే రుణం మీద విధించే వడ్డీ రేటు. రెపో రేటు పెరిగితే, ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాల మీద వడ్డీ భారం పెరుగుతుంది. ఆ భారాన్ని ప్రజలకు మీదకు నెట్టేస్తాయి బ్యాంకులు. ప్రజలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచడం ద్వారా, రెపో రేటు భారాన్ని బ్యాంకులు తగ్గించుకుంటాయి. ఫైనల్‌గా, రెపో రేటు పెరిగితే, బ్యాంకులు ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. వడ్డీ రేట్ల పెంపును బ్యాంకులు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
MPC నిర్ణయం ప్రకారం రెపో రేటును 0.25 శాతం పెంచినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ పెంపు తర్వాత, దేశంలో రెపో రేటు గతంలోని 6.25 శాతం నుంచి ఇప్పుడు 6.50 శాతానికి పెరిగింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు 0.25 శాతం రెపో రేటు పెంపునకు అనుగుణంగా ఓటు వేశారు.
కఠిన వైఖరి కొనసాగుతుందన్న సంకేతాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అయినా ప్రపంచ స్థూల పరిస్థితులు అనేక సవాళ్లను మన ముందుకు తీసుకొచ్చాయని చెప్పారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అంటే, స్నేహపూర్వక విధానం కొనసాగించడం కుదరదని, ఆర్‌బీఐ కఠిన వైఖరి కొనసాగుతుందని పరోక్షంగా సంకేతం ఇచ్చారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిని (GDP) 7 శాతంగా అంచనా వేసినట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చిల్లర ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండవచ్చని; 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 5.3 శాతంగా ఉండొచ్చని వెల్లడించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉందని, దీనినిఆర్‌బీఐ నిశితంగా గమనిస్తోందని గవర్నర్ చెప్పారు.
ఇవాళ ముగిసిన ఎంపీసీ సమావేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రకటన తర్వాత జరిగిన మొదటి ద్రవ్య విధాన సమీక్ష ఇది. 31 మార్చి 2023న ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ నిర్వహించే చివరి MPC సమావేశం కూడా ఇదే.
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!
WhatsApp Banking: IPPB సేవల్లో మరింత సౌలభ్యం, ఇకపై వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్
PPF: పీపీఎఫ్ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?
OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్!
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు