Aha Nenu Super Woman: మీ దగ్గర ఐడియా ఉందా? 'సూపర్ విమెన్ ఫండ్' నుంచి పెట్టుబడి పొందొచ్చు!
Aha Nenu Super Woman: ఆహా.. 'నేను సూపర్ విమెన్' తెలుగు లోగిళ్లలో సంచనాలు సృష్టిస్తోంది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ 'సూపర్ విమెన్ ఫండ్'ను ప్రకటించారు.
Aha Nenu Super Woman:
ఆహా.. ఓటీటీలో ప్రసారం అవుతున్న 'నేను సూపర్ విమెన్' తెలుగు లోగిళ్లలో సంచనాలు సృష్టిస్తోంది. మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం కాదని వ్యాపారాలూ చేయగలరని నిరూపిస్తోంది. చక్కని ఐడియాలతో వచ్చే వారికి ఏంజెల్స్ ద్వారా పెట్టుబడులు సమకూరుస్తోంది. తాజాగా తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ షోకు అతిథిగా వచ్చారు. వి హబ్ సీఈవో దీప్తి రావులతో కలిసి 'సూపర్ విమెన్ ఫండ్'ను ప్రకటించారు.శుక్ర, శనివారాల్లో ప్రసారమయ్యే షోల్లో దీని గురించి వివరించనున్నారు.
'ఆహా వారితో కలిసి ఈ షో చేయడం ఎంతో ఆనందగా ఉంది. అందుకే మా వంతు సాయంగా మేము ఈ 'సూపర్ వుమెన్ ఫండ్' ని అందరికి అందుబాటులోకి తేబోతున్నాం. ఎంతో ప్రతిభ ఉండి పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న మహిళా వ్యాపారవేత్తలకు ఈ నిధి ఉపయోగపడుతుంది. ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఇంకా స్కేలబిలిటీ కోసం డబ్బు అవసరమైనా ఈ ఫండ్ ద్వారా సాయపడతాం. ఈ నిధులను ఎక్కడ, ఎలా ఉపయోగించాలో వి హబ్ శిక్షణ ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వమూ మహిళా వ్యాపారవేత్తలకు నిరంతరం తోడుగా నిలుస్తుంది' అని జయేశ్ రంజన్ అన్నారు.
ఆహా నేను సూపర్ విమెన్ - ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. ఈ షోలో భాగంగా వేదిక మీదకు మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా) నచ్చిన వ్యాపార ఆలోచనల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
నేను సూపర్ విమెన్ షో నాలుగో వారానికి చేరింది. ఇప్పటి వరకు ఏంజెల్స్ రూ.4.75 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. మూడో వారం లారిక్ ఫౌండర్ లావణ్య సూన్కారి, సెకండ్ ఇన్నింగ్స్ స్థాపకురాలు మాధురి ఆకెళ్ళ, గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్ ఫౌండర్ ప్రత్యూషకు ఏంజెల్స్ డబ్బు సాయం చేశారు.