Pradhan Mantri Awas Yojana: మీరు సొంతిల్లు కట్టుకోవడానికి సర్కారు వారి డబ్బు - ఇలా దరఖాస్తు చేసుకోవాలి
PM Awas Yojana: తాత్కాలిక గృహాల్లో నివసించే ప్రజలు పక్కా ఇళ్లు కట్టుకుని, భద్రత పెంచుకోవడానికి పీఎంఏవై పథకం సాయపడుతుంది. భూమి ఉన్న వాళ్లు ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా ఈ పథకం ఆర్థిక సాయం చేస్తుంది.
Pradhan Mantri Awas Yojana Telugu News: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారతదేశ ప్రధాన మంత్రి అయ్యారు. కొత్త మంత్రివర్గం మొదటి సమావేశం జూన్ 10న జరిగింది. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి... "ప్రధాన మంత్రి ఆవాస్ యోజన" కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించడం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లేదా పీఎం ఆవాస్ యోజనను (PMAY) 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మన దేశంలో... పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఒక ఇంటిని నిర్మించడం ఈ పథకం లక్ష్యం. PMAY కింద, గత 10 సంవత్సరాలలో అర్హులైన పేద కుటుంబాలకు 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సర్కారు సాయం చేసింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన అర్హతన్నీ ఉండి, సొంత ఇల్లు లేని వ్యక్తులు PMAY కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, సర్కారు వారి సాయం అందుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు ప్రధాన్ మంత్రి యోజన పథకం అర్హతలు, ప్రయోజనాల గురించి కాస్త వివరంగా & తప్పనిసరిగా తెలుసుకోవాలి. PMAYలో రెండు రకాలు ఉన్నాయి.
1. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)
2. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పట్టణ (PMAY-U).
ఇల్లు లేని పేదలు, తాత్కాలిక గృహాల్లో (పూరి గుడిసెలు, రేకుల షెడ్లు వంటివి), అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలు తమకంటూ సొంతంగా, పక్కా (కాంక్రీట్) ఇంటిని నిర్మించుకునేందుకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సాయం చేస్తుంది. అలాగే, సొంతంగా నివాస స్థలం ఉన్న వాళ్లు కొత్తగా ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తుంది.
PMAY కింద.. గృహ రుణాలపై రాయితీలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దరఖాస్తుదారుకు అందే సబ్సిడీ మొత్తం ఇంటి పరిమాణం, ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఈ పథకం కింద బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తాయి. PMAY పథకం కింద గృహ రుణాలను తిరిగి చెల్లించే వ్యవధి గరిష్టంగా 20 సంవత్సరాలు.
అర్హతలు
దరఖాస్తు చేసుకునే వ్యక్తికి అంతకుముందే పక్కా ఇల్లు/ఇళ్లు కలిగి ఉండకూడదన్నది PMAY స్కీమ్‌కి ప్రాథమిక అర్హత.
దరఖాస్తుదారు వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి.
కుటుంబంలో ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
రూ. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అందుబాటులో ఉంది.
వార్షిక ఆదాయాన్ని బట్టి కూడా పథకం వర్తింపు మారుతుంది.
అవసరమైన పత్రాలు
వ్యక్తిగత గుర్తింపు కార్డు
చిరునామా రుజువు
ఆదాయ రుజువు
ఆస్తి పత్రాలు
ఎలా దరఖాస్తు చేయాలి?
PM ఆవాస్ యోజన కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కోసం...
-- PMAY అధికారిక వెబ్‌సైట్ https://pmaymis.gov.in/ లోకి వెళ్లాలి.
హోమ్‌పేజీలో, PM ఆవాస్ యోజనపై క్లిక్ చేయండి
మీకు సంబంధించిన వివరాలను అక్కడ నింపి రిజిస్టర్ చేసుకోండి
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
అన్ని వివరాలను ఒకసారి సరిచూసుకుని సమర్పించండి
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీరు సమీపంలోని సాధారణ సేవ కేంద్రాన్ని (CSC) సందర్శించవచ్చు. మీకు సమీపంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళితే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి.
మరో ఆసక్తికర కథనం: రైలు ప్రమాదం జరిగితే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - ఆ డబ్బు ఎలా తీసుకోవాలి?