e-RUPI : ఇండియా ఎలక్ట్రానిక్ "రూపీ" వచ్చేస్తోంది.. ఇది బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీనా.. ఇవిగో వివరాలు
ఈ-రూపీని సోమవారం లాంఛ్ చేయనున్న ప్రధాని మోడీ, నగదు రహిత లావాదేవీల నిర్వహణలో సరికొత్త పద్దతిగా మారే అవకాశం..!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి చర్చ జరుగుతోంది. బిట్ కాయిన్ల గురించి తరచూ వార్తలు వస్తూంటాయి. ప్రభుత్వానికి క్రిప్టో కరెన్సీని ఆమోదించడమో.. లేకపోతే.. కొత్తగా ఏమైనా సొంత క్రిప్టో కరెన్సీని తీసుకు వచ్చే ఆలోచనలు ఉన్నాయా.. అని తరచూ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. దీనికి సమాధానంగా ప్రభుత్వం ఈ - రూపీని ప్రవేశ పెడుతోంది. ఫోన్‌పే, గూగుల్ పే, డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డులు... ఇలాంటివేమీ అక్కర్లేకుండానే నగదు రహిత చెల్లింపుల కోసం "ఈ-రూపీ"ని కేంద్రం డిజైన్ చేసింది. మరింత తేలికగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లుగా పీఎంఓ ప్రకటించింది.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా "ఈ-రూపీ"ని ప్రవేశ పెట్టనుంది. ఇది ఎలా పని చేస్తుందో కూడా వివరించారు. "ఈ-రూపీ" చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ- రూపీ పద్దతి అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే... దీన్ని అమలు చేయడం అంత సులువు కాదు. ఎంతో అవగాహన ఉండాలి. అందుకే కేంద్రం ముందస్తుగా కొంత మందికే దీన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఈ - రూపీ ద్వారా నగదు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రైవేటు రంగ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం విషయంలో e-RUPI పద్దతిని ఉపయోగించుకోవచ్చని కేంద్రం సూచించింది.
ఈ-రూపీ పథకం ఆగస్టు 2 నుంచి అంటే సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త విధానాన్ని ప్రారంభించనున్నారు. తొలి దశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌కి క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ప్రధానమంత్రి మోదీ సోమవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. ఇది క్రిప్టో కరెన్సీ అని భావించే ప్రమాదం ఉంది. కానీ అసలు క్రిప్టో కరెన్సీకి ఈ డిజిటల్ ఈ - రూపీకి అసలు సంబంధం ఉండదు. ఇది కేవలం నగదు రహిత లావాదేవీలు.. అదీ కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా నిర్వహించుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. మొత్తం వివరాలను ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.