(Source: ECI/ABP News/ABP Majha)
Railway Coach Restaurant: కాచీగూడలో రైల్వే కోచ్ రెస్టారెంట్! ప్రయాణికుల 'ఆహా' రేంజులో విందు!
Railway Coach Restaurant: ప్రస్తుతం థీమ్ బేస్ రెస్టారెంట్లు ట్రెండ్‌గా మారాయి! దాంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచీగూడ రైల్వే స్టేషన్లో రైల్వే కోచ్ రెస్టారెంటును ఏర్పాటు చేశారు.
Railway Coach Resturant:
ప్రస్తుతం థీమ్ బేస్ రెస్టారెంట్లు ట్రెండ్‌గా మారాయి! కస్టమర్లు తమ ఇష్టాలకు తగ్గట్టుగా ఇందులోకి వెళ్లి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఉదాహరణకు ట్రైన్ రెస్టారెంట్లు పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. రోబో రెస్టారెంట్లలో రోబోలే వడ్డిస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో! దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచీగూడ రైల్వే స్టేషన్లో రైల్వే కోచ్ రెస్టారెంటును ఏర్పాటు చేశారు. దీని పేరు పరివార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్! అంటే రెస్టారెంట్ ఆన్ వీల్స్ అన్నమాట!!
నార్త్ ఇండియన్, సౌతిండియన్, మొఘలాయి, చైనీస్ వంటి రుచికరమైన ఆహార పదార్థాలను పరివార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో అందిస్తున్నారు. కాచీగూడ రైల్వేస్టేషన్ నిత్యం ప్రయాణికులతో అలరారుతుంది. ఎంతో మంది రైలు దిగగానే తినడానికి ప్రయత్నిస్తారు. దాంతో సర్క్యూలేటింగ్ ఏరియాలో హైదరాబాద్ డివిజన్లో మొదటి రెస్టారెంట్ ఆన్ వీల్స్‌ను అధికారులు ఆరంభించారు. రెండు పాత హెరిటేజ్ కోచులను ఇందుకు ఉపయోగించుకున్నారు. వాటిని పునరుద్ధరించి, నగిషీలు అద్ది అత్యంత రాజసంగా మార్చేశారు. ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలూ ఇక్కడ ఫుడ్‌ను ఆస్వాదించొచ్చు.
రైలు పట్టాలపై అమర్చిన కోచుల్లో డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్లకు ప్రత్యేక డైనింగ్ అనుభూతి వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన ఆహార క్షేత్రంగా ఉంటుందని సూచిస్తున్నారు. త్వరలోనే మరిన్ని సౌకర్యాలు నెలకొల్పుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ అన్నారు. మంచి ఐడియాతో రెస్టారెంటును నిర్మించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. 24 గంటలు ప్రయాణికులు, కస్టమర్లకు నాణ్యతతో కూడిన ఆహారం, పానీయాలను అందిస్తున్నామని వెల్లడించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial