NSE Co-location Scam: ఎన్‌ఎస్‌ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు
ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ కుంభకోణం (NSE co-location scam) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేర్వేరు నగరాల్లోని పది ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ కుంభకోణం (NSE co-location scam) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేర్వేరు నగరాల్లోని పది ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబయి, గాంధీనగర్, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కోల్‌కతా తదితర నగరాల్లోని బ్రోకర్లు, ట్రేడర్ల కార్యాలయాల్లో ఆదివారం సోదాలు చేపట్టారు. ఈ కేసులో ఇంతకు ముందే ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ, సీవోఓ ఆనంద్ సుబ్రహ్మణ్యంపై ఛార్జిషీటు దాఖలైన సంగతి తెలిసిందే.
కేసు పూర్వాపరాలు ఇవీ!
ఈ కేసులో చిత్రా రామకృష్ణపై చాలా రోజుల నుంచి విచారణ కొనసాగుతోంది. అనేక అవకతవకలకు సంబంధించి సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ ఫెసిలిటీకి అక్రమంగా యాక్సెస్ ఇచ్చిన కేసులో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా చిత్రతో పాటు మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్ సుబ్రహ్మణ్యం దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
Also Read: NSE చిత్ర వెనుక యోగి 'ఆనందుడే' - ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో లింకు
Also Watch: NSE ChitraRamaKrishna Arrest: కో లొకేషన్ కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
లుక్ ఔట్ నోటీసులు
దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్, యజమాని సంజయ్ గుప్తా, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. స్టాక్ మార్కెట్‌ను అందరికన్నా ముందుగా యాక్సెస్ చేసి లాభాలు గడించేలా ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ ఫెసిలిటీలో అవినీతికి పాల్పడిన కేసులో అభియోగం మోపింది. అంతేకాకుండా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, ఎన్‌ఎస్‌ఈలో గుర్తించని, తెలియని వ్యక్తులపైనా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిపింది.
దిల్లీలోని మరో బ్రోకర్‌పై కేసు
'పైన పేర్కొన్న ప్రైవేటు కంపెనీ యజమాని, ప్రమోటర్ ఎన్‌ఎస్‌ఈలోని అజ్ఞాత అధికారులను ఉపయోగించుకొని ఎన్‌ఎస్‌ఈ సర్వర్ అర్కిటెక్చర్‌ను వాడుకున్నారు. అంతేకాకుండా కో లొకేషన్ ఫెసిలిటీని అందరికన్నా ముందుగానే యాక్సెస్ చేసేలా ముంబయిలోని ఎన్‌ఎస్‌ఈ అధికారులు కొందరు 2010-2012లో వారికి సహకరించారు. దీనివల్ల ఎక్స్‌ఛేంజీ సర్వర్‌లో మొదటే లాగిన్ అయి మిగతా బ్రోకర్లందరి కన్నా ముందుగానే సమాచారం తీసుకున్నారు' అని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
చిత్రా రామకృష్టతో పాటు కొంతమంది అధికారులపై పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అయితే చిత్ర రామకృష్ణ.. ఎన్‌ఎస్‌ఈ ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, డివిడెండ్లకు సంబంధించిన విషయాలతో పాటు అంతర్గత సమాచారాన్ని ఓ యోగితో పంచుకున్నట్లు తేలింది.
ఆయన డైరెక్షన్‌లోనే
ఎన్‌ఎస్‌ఈకి సీఈవోగా ఉన్న సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో ఏ పని చేయాలన్నా హిమాలయాల్లో ఉంటున్న ఓ యోగి ఆమోద ముద్ర పడితే కానీ చిత్రా ముందడుగు వేయలేదు.
ఎన్‌ఎస్‌ఈలో ఎవరిని నియమించాలి? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి? వంటి విషయాలతో పాటు ఎన్‌ఎస్‌ఈ డివిడెంట్, ఆర్థిక ఫలితాల వివరాలు, బోర్డ్ మీటింగ్ ఎజెండా ఫైనాన్షియల్ డేటా మొత్తం ఆ గుర్తు తెలియని యోగి డైరెక్షన్‌లోనే జరిగాయి. అయితే ఈ యోగి ఆనందేనని తర్వాత బయట పడింది.
కలవకుండానే
ఆ యోగిని చిత్రా ఎప్పుడు కలవలేదు. మెయిల్ రూపంలోనే వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. చిత్రా ప్రశ్నలు అడగడం దానికి యోగి సమాధానాలు చెప్పడం.. ఇలా అన్నీ ఆ యోగి డైరెక్షన్‌లోనే సాగాయి. చిత్రా రామకృష్ణ ఎన్‌ఎస్‌ఈకి 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.
- Reporter - Suraj Ojha