Union Budget 2025: నిర్మలమ్మ నోట 'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' - మహాకవి గురజాడ కవిత వెనుక కథ ఇదే!
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ గేయం 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..' ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. దాని వెనుక కథ ఓసారి చూస్తే..

Nirmala Sitharaman Gurajada Quote In Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఎనిమిదోసారి పార్లమెంటులో బడ్జెట్‌ను (Union Budget 2025) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని మహాకవి గురజాడ సూక్తితో ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..' అంటూ తన ప్రసంగంలోని తొలి వాక్యాల్లో ప్రస్తావించారు. ఇది ఆసక్తికరంగా మారింది. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యం కలిగిన కార్మికులతో పూర్తి ఉపాధిని సాధించడం, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యాన్ని 70 శాతానికి పెంచడం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను ఎత్తిచూపేలా విత్త మంత్రి ప్రసంగం సాగింది.
కవిత వెనుక కథ
కాగా, మహాకవి గురజాడ అప్పారావు 'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అంటూ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తన కోసం పరితపించారు. ఈ గేయం ప్రజల్లో దేశభక్తిని ప్రభోదించడమే కాకుండా దేశాభివృద్ధికై ప్రజలను కార్యోన్ముఖులను చేసింది. అంతేకాకుండా స్వదేశీ వాదనను బలపరిచారు. ఆయన కలం నుంచి జాలువారిన అనేక రచనలు దేశభక్తిని పెంపొందించేలా.. సాంఘిక దురాచారాలను రూపుమాపేలా, యువతకు ప్రేరణ ఇచ్చేలా ఉంటాయి. తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేక స్థానం. ప్రజలందరికీ అర్థమయ్యే జీవ భాషలో ఆయన రచలను ఎందరికో ఆదర్శం.
అసలెవరీ గురజాడ అప్పారావు..
గురజాడ వెంకట అప్పారావు 1862, సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా రాయవరంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో రెవెన్యూ సూపర్వైజర్‌గా పని చేశారు. తండ్రి మరణం తర్వాత ఎం.ఆర్.కళాశాల ప్రధానోపాధ్యాయుడు సి.చంద్రశేఖర్ శాస్త్రి సహాయంతో చదువు కొనసాగించారు. 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, ఉన్నత విద్యను అభ్యసించి చివరకు ఎం.ఆర్.ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. విజయనగరం సంస్థానంలో శాసనసభ పరిశోధకుడిగా, మహారాజా కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1911లో మద్రాస్ విశ్వ విద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యుడయ్యారు. 1913లోపదవీ విరమణ చేశారు.
సాహిత్య సేవలో..
బాల్య వివాహం, వరకట్న వ్యవస్థ వంటి సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు గురజాడ తన సాహిత్యంతో కీలక పాత్ర పోషించారు. తెలుగు సాహిత్యానికే మూలస్తంభంగా నిలిచిన 'కన్యాశుల్కం' (1892) నాటకం ఆయన కలం నుంచి జాలువారిన ఆణిముత్యమే. నాటకంలోని సంభాషణలు, ముఖ్యంగా గిరీశం పాత్ర నేటికీ జనాధరణ పొందాయి. అప్పారావు రచనలు తరచుగా స్త్రీల పోరాటాలను ప్రస్తావిస్తూ, సామాజిక నిబంధనలను సవాలు చేస్తూ ఆధునిక తెలుగు నాటకానికి మార్గదర్శకుడిగా నిలిచాయి. ఆయన సంఘ సంస్కరణ కోసం బలమైన న్యాయవాది, ఆంధ్ర సాహిత్య పరిషత్ వంటి కార్యక్రమాల ద్వారా మాట్లాడే మాండలికాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు.
'ముత్యాల సరాలు' ద్వారా కొత్త సాహిత్య ధోరణిని గురజాడ ప్రవేశపెట్టారు. ఆయన రచనలు ప్రాంతీయ భాషల్లో విద్య ప్రాముఖ్యతను తెలియజేయడం సహా.. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడాన్ని విమర్శించాయి. ఆయన రచనల్లో మహిళా విద్య, సాధికారతను బలంగా వినిపించారు. 1915 నవంబర్ 30న గురజాడ కన్నుమూశారు. కవిశేఖర, అభ్యుదయ కవితా పితామహుడు బిరుదులతో సత్కరించబడిన గురుజాడ అప్పారావు వారసత్వం భారతీయ సాహిత్యం, సామాజిక ఆలోచనల్లో పరివర్తన చెందిన వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేస్తూ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.






















