Motilal Oswal Stock Picks 2023: కొత్త ఏడాది కోసం 14 స్టాక్స్, ప్రముఖ బ్రోకరేజ్ ఎంపిక చేసిన టాప్ పిక్స్ ఇవి
2022లో ఇప్పటి వరకు 72% ర్యాలీని చూసిన PSU బ్యాంక్స్, స్పష్టమైన విజేతలుగా సగర్వంగా నిలబడ్డాయి.
Motilal Oswal Stock Picks 2023: 2023లో తమ టాప్ పిక్స్‌గా కొన్ని స్టాక్స్‌ను స్వదేశీ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ప్రకటించింది. ఏయే అంశాల ప్రాతిపదికన వాటిని ఎంచుకున్నామో వివరిస్తూ, ఒక నివేదిక విడుదల చేసింది.
మోతీలాల్ ఓస్వాల్ నివేదిక సారాంశం:
2022లో అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, కరెన్సీల స్వింగ్, భౌగోళిక రాజకీయాల అనిశ్చితులు, విదేశీ మదుపర్ల (FII) అమ్మకాల దాడి వంటి అనేక ప్రపంచ స్థాయి తుపాన్లను ఎదుర్కొన్న భారతదేశ ఈక్విటీ మార్కెట్లు, ఈ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లను మించి రాణించాయి. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి దొరికిన బలమైన మద్దతుతో, ప్రపంచ పటంలో ప్రకాశవంతమైన ప్రదేశంలో భారత్ నిలబడింది.
రోలర్ కోస్టర్ రైడ్ మధ్య గ్లోబల్ ఇండెక్స్‌ల 10% నుంచి 20% వరకు పతనమైనా... నిఫ్టీ ఇండెక్స్ 2022లో 7% (డిసెంబర్ 12 నాటికి) లాభపడింది. నిజానికి ఇది నవంబర్‌లో 18,888 తాజా జీవిత గరిష్ఠ స్థాయిని ఇది తాకింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా బలాన్ని చూపింది, ఇప్పటి వరకు 7% రాబడి సృష్టించింది. అయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 11% పతనంతో నష్టాన్ని ఎదుర్కొంది.
2022లో ఇప్పటి వరకు 72% ర్యాలీని చూసిన PSU బ్యాంక్స్, స్పష్టమైన విజేతలుగా సగర్వంగా నిలబడ్డాయి.
FY20-22 కాలంలో కార్పొరేట్ ఆదాయాలు బలంగా 24% CAGR వద్ద వృద్ధి చెందాయి. GDP & PMI వంటి ఆర్థిక సూచికలు కూడా మహమ్మారి తర్వాత కోలుకున్నాయి, వేగాన్ని కొనసాగిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా 15% పైగా, దశాబ్దాల గరిష్ఠ స్థాయిలో, పెరుగుతూ వస్తున్న క్రెడిట్ గ్రోత్ అప్-సైకిల్‌లో భారత ఆర్థిక వృద్ధి బలం ప్రతిబింబిస్తోంది. దీనికి అదనంగా, చైనా+1 & యూరోప్+1 వ్యూహాల కారణంగా పెరుగుతున్న ఔట్-సోర్సింగ్ పరిధి, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు కలిసి... GDPలో ప్రస్తుతం 15%గా ఉన్న ఉత్పాదక సహకారాన్ని మరింత పెంచుతాయని అంచనా.
మరోవైపు, ఇప్పటివరకు ఆందోళనకరంగా ఉన్న ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్టానికి, 5.88%కి (నవంబర్ 22) పడిపోయింది. RBI టాలరెన్స్ బ్యాండ్ 2-6% రేంజ్‌లోకి దిగి వచ్చింది.
కాపెక్స్ మీద భారత ప్రభుత్వ దృష్టి, వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ, ప్రైవేట్ పెట్టుబడుల్లోనూ వృద్ధి, పెరిగిన వినియోగ సామర్థ్యం నేపథ్యంలో... నిఫ్టీ ఆదాయాలు FY22-24 కాలంలో 17% CAGR వద్ద పటిష్టంగా పెరుగుతాయని భావిస్తున్నారు.
ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఆశలు లేని ఎడారిలా మారిన నేపథ్యంలో... విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశం ఒక ఒయాసిస్‌లా కనిపిస్తోంది. ఇప్పుడు FIIలు నికర కొనుగోలుదారులుగా మారారు. దేశీయ ప్రవాహాలు కూడా బలంగానే ఉన్నాయి. నిఫ్టీ ఇప్పుడు 1-ఇయర్ ఫార్వర్డ్ P/E 20x వద్ద ట్రేడవుతోంది, ఇది న్యాయబద్ధమైన విలువలా కనిపిస్తోంది.
2023లో మోతీలాల్ ఓస్వాల్ టాప్ పిక్స్:
CY23లో రెండు థీమ్‌లు ప్రముఖంగా ప్లే అవుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఆశిస్తోంది. అవి... క్రెడిట్ గ్రోత్ & క్యాపెక్స్. తద్వారా... BFSI, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్, హౌసింగ్, డిఫెన్స్, రైల్వేస్ వంటి రంగాల మీద ఇన్వెస్టర్లు దృష్టి పెట్టవచ్చని సూచించింది.
వ్యక్తిగత స్టాక్స్ రూపంలో బ్రోకరేజ్ సిఫార్స్ చేసిన 14 స్క్రిప్స్... ఇన్ఫోసిస్, SBI, ITC, L&T, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, PI ఇండస్ట్రీస్, మాక్రోటెక్ డెవలపర్స్, ఇండియన్ హోటల్స్, భారత్ ఫోర్జ్, వెస్ట్ లైఫ్.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.