Anant Ambani Expensive Home: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా కొన్న అంబానీ, దాని విలువెంతో తెలుసా?
Mukesh Ambani Buys Dubai Costliest Home: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం దుబాయ్ లో అత్యంత ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలు హాట్ టాపిక్ అవుతోంది.
Anant Ambani Buys Dubai Costliest Home: ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ అత్యంత ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు. దీని విలువ 80 మిలియన్ డాలర్లు ఉంటుందని అంటున్నారు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం దుబాయ్ లో ఈ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బీచ్ సైడ్ మాన్షన్ కు నార్త్ సైడ్ లో ఉన్న 10 బెడ్రూముల ఫ్లాట్ అది. అందులో ఒక ప్రైవేట్ స్పా కూడా ఉంది. ఇండోర్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ అత్యంత ఖరీదైన ప్రాపర్టీని కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అనంత్ అంబానీ పక్కింట్లో షారూక్
దుబాయ్ అత్యంత ధనవంతులకు స్వర్గధామంలా నిలుస్తోంది. విదేశీయులు దుబాయ్ లో ఆస్తులు కొనేందుకు అక్కడి పరిమితులను సడలించింది దుబాయ్ ప్రభుత్వం. వారు దీర్ఘకాలం పాటు అక్కడే నివసించేలా గోల్డెన్ వీసాలు కూడా ఇస్తోంది ఎమిరేట్స్ సర్కారు. బ్రిటీష్ ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెక్ హామ్ తన భార్య విక్టోరియా, అలాగే బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్, అనంత్ అంబానీకి ఇరుగు పొరుగున నివాసం ఉండనున్నారు.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ 93.3 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచంలోనే 11వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ముఖేష్ అంబానీ ముగ్గురు సంతానంలో అనంత్ అంబానీ ఒకరు. ముఖేష్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్ వైపు విస్తరిస్తూ పోతున్నారు. ఆయా బాధ్యతలను వారి వారసులకు అప్పగిస్తున్నారు ముఖేష్ అంబానీ.
వారసులకు బాధ్యతల అప్పగింత..
ముఖేష్ కుటుంబం విదేశాల్లో తన రియల్ ఎస్టేట్ ఆస్తులను నెమ్మదిగా పెంచుకుంటోంది. ముఖేష్ ముగ్గురు పిల్లలు తమ రెండో ఇంటి కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రిలయన్స్ సంస్థ.. యూకేలో స్టాక్ పార్క్ లిమిటెడ్ ను కొనుగోలు చేయడానికి 79 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఇందులో పెద్ద కుమారుడు ఆకాష్ కోసం జార్జియన్ కాలం నాటి భవంతి ఉంది. కాగా, ఆకాష్ ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. అనంత్ సోదరి ఇషా.. న్యూయార్క్ లో ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాలలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
దుబాయ్ ప్రాపర్టీని రిలయన్స్ ఆఫ్‌షోర్ ఎంటిటీ నిర్వహిస్తుంది. ఆ ప్రాపర్టీని కస్టమైజ్ చేయడానికి, దాని సెక్యూరిటీ కోసం మిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నారు. గ్రూపులో కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్, పార్లమెంట్ సభ్యుడు, దీర్ఘకాల అంబానీ సహచరుడు పరిమల్ నత్వానీ విల్లాను నిర్వహిస్తారు. ప్రస్తుతం అంబానీలు ఉంటున్న ఇంటి పేరు అంటిలియా. ఇది ముంబయిలో ఉంది. 27 అంతస్తుల ఈ ఆకాశహర్మ్యంలో మూడు హెలిప్యాడ్ లు ఉన్నాయి. 168 కార్లు పార్క్ చేసే స్థలం ఉంటుంది. 50 సీట్ల సినిమా థియేటర్, గ్రాండ్ బాల్ రూమ్, అలాగే తొమ్మిది ఎలివేటర్లు కూడా ఉంటాయి.
నిబంధనల సడలింపులో ఆర్థిక వ్యవస్థ పరుగులు
కరోనా మహమ్మారి తెచ్చిన ఆర్థిక కష్టాల కారణంగా దుబాయ్ కొత్త పాలసీలను తీసుకువచ్చింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు వివిధ చర్యలు చేపడుతోంది. ఆస్తి కొనుగోళ్లలో నిబంధనలను సడలించింది. దీని ద్వారా చాలా మంది విదేశీయులు దుబాయ్ లో ప్రాపర్టీలు కొంటున్నారు. 2 మిలియన్ దిర్హామ్ విలువైన ఆస్తిని దుబాయ్ లో కొనుగోలు చేస్తే 10 సంవత్సరాల వీసాను ఇస్తోంది దుబాయ్ ప్రభుత్వం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 80 శాతం కంటే ఎక్కువ మంది విదేశీయులే ఉంటారు.