Mukesh Ambani: అంబానీకి ఆగని బెదిరింపులు, ఈసారి సీరియస్ వార్నింగ్‌తో రెండు ఈ-మెయిల్స్
మునుపటి ఈ-మెయిల్స్‌ను పట్టింకోనందుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మెయిల్ పంపిన వ్యక్తి హెచ్చరించాడు
Threat Emails To Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. గతంలో 400 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తి నుంచే మరో రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మునుపటి ఈ-మెయిళ్ల విస్మరించినందుకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా దుండగులు హెచ్చరించారు.
గతంలో మెయిల్స్ పంపిన షాదాబ్ ఖాన్ అనే మెయిల్ ఐడీ నుంచి ఈసారి కూడా మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
"పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అక్టోబర్ 31న, నవంబర్ 1న మరోసారి రెండు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. రూ. 400 కోట్లు డిమాండ్ చేసిన మునుపటి ఈ-మెయిల్స్‌ను పట్టింకోనందుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మెయిల్ పంపిన వ్యక్తి హెచ్చరించాడు" అని ముంబై పోలీసులు చెప్పినట్లు ANI రిపోర్ట్ చేసింది.
కొత్తగా వచ్చిన రెండు ఈ-మెయిళ్లతో కలిపి, ముకేష్ అంబానీకి మొత్తం ఐదు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
గత సోమవారం (30 అక్టోబర్ 2023) నాడు మూడో ఈ-మెయిల్, దీనికి ముందు మరో రెండు మెయిల్స్ వచ్చాయి. ముకేష్ అంబానీని చంపకుండా వదిలి పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు చెల్లించాలని మూడో మెయిల్‌లో ఆగంతుకుడు డిమాండ్ చేశాడు. తొలిసారి రూ.20 కోట్లు డిమాండ్ చేయగా, రెండోసారి రూ.200 కోట్లు డిమాండ్ చేశాడు.
అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ దేవేంద్ర మున్సీరామ్ ఫిర్యాదు ఆధారంగా, ముంబైలోని గామ్‌దేవి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ, క్రిమినల్ బెదిరింపుల ఆరోపణలు చేసినందుకు, ఈ-మెయిల్ పంపిన అగంతకుడిపై ఐపీసీ 387, 506 (2) సెక్షన్‌ల కింద FIR రిజిస్టర్ చేశారు. బెదిరింపుల కోసమే ఈమెయిల్ ఐడీని రూపొందించినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. బెల్జియన్ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) నుంచి ఆ ఈ-మెయిల్స్ వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. పంపిన వ్యక్తి గురించి సమాచారం పొందడానికి ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటున్నారు. ఈ-మెయిల్ జెనరేట్ అయిన కంప్యూటర్ IP అడ్రస్ బెల్జియంలో ఉందని, ఈ మెయిల్ shadabkhan@mailfence.com ఐడీ నుంచి వచ్చిందని సమాచారం. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిది బెల్జియం కాకుండా వేరే దేశం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌ను తప్పుదారి పట్టించడానికి బెల్జియన్ VPNని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులకు సవాల్
'మీ భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉన్నా పర్వాలేదు. ముకేష్‌ను మట్టుబెట్టడానికి ఒక్క షూటర్ సరిపోతాడు. ఇండియాలో అత్యుత్తమ షూటర్లు మా దగ్గర ఉన్నారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయాలంటే, నేను ఎక్కడున్నానో కనిపెట్టాలి కదా' అని మూడో ఈ-మెయిల్‌లో అగంతకుడు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ బెదిరింపు తర్వాత, సౌత్ ముంబైలోని అంబానీ నివాసానికి ముంబై పోలీసులు భద్రతను పెంచారు.
గతంలోనూ అంబానీకి బెదిరింపులు
ముకేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా గతంలో బెదిరింపులు వచ్చాయి. అంబానీ నివాసం ఆంటిలియాను పేల్చేస్తామని, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చేస్తానని దుండగులు బెదిరించగా, పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు.
2021లో, అంబానీ నివాసానికి అతి సమీపంలో ఓ కారులో పేలుడు పదార్థాలు దొరికాయి. జెలిటిన్ స్టిక్స్‌తో పాటు, ఇది ట్రైలర్ మాత్రమే అంటూ ఓ లెటర్ కూడా దొరికింది. ఆ కేసులో, ఒక ముంబై పోలీసు అధికారి అరెస్టు కావడంలో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అంబానీ భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరో ఆసక్తికర కథనం: భారతదేశానికి 'ఆర్థిక స్వాతంత్ర్యం' తెచ్చింది ఎవరు?, లిస్ట్ రిలీజ్ చేసిన నారాయణమూర్తి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial