Infosys Narayana Murthy: భారతదేశానికి 'ఆర్థిక స్వాతంత్ర్యం' తెచ్చింది ఎవరు?, లిస్ట్ రిలీజ్ చేసిన నారాయణమూర్తి
1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై నారాయణ మూర్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Infosys Narayana Murthy: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకడు నారాయణ మూర్తిపేరు కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కార్పొరేట్, ఐటీ కంపెనీల్లో మార్మోగిపోతోంది. మన దేశం బాగుపడాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. వారానికి 70 గంటలు అంటే, వారంలో ప్రతి రోజూ (ఆదివారం సహా) 10 గంటల చొప్పున పని చేయాలి. ఆదివారం సెలవు తీసుకున్నా, మిగిలిన ఆరు రోజులు దాదాపు 12 గంటలు ఆఫీసులు/కంపెనీల్లోనే గడపాలి. వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి ఇలా ఆఫీసుకే అంకితమవడం సాధ్యమేనా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నిజంగానే రోజుకు 12 గంటలు పని చేస్తే, అతి త్వరగా ఆసుపత్రి పాలవుతారని, అప్పుడు అసలుకే ఎసరు వస్తుందని కూడా అంటున్నారు.
అదే సమయంలో, నారాయణ మూర్తి మాటల్ని సమర్థించినవాళ్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగులు అలానే కష్టపడుతున్నారని, అందుకే జపాన్, అమెరికా లాంటి దేశాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని, మన వాళ్లు కూడా విదేశీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని అంటున్నారు. ఇలా, కార్పొరేట్ వర్గాలు రెండుగా చీలిపోయి వాడివేడి చర్చలు చేస్తున్నాయి.
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో, భారతదేశానికి 'ఆర్థిక స్వాతంత్ర్యం' తెచ్చిన వ్యక్తులుగా నలుగురి పేర్లను నారాయణ మూర్తి చెప్పారు. మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ (పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక శాఖ మంత్రి), మాంటెక్ సింగ్ అహ్లువాలియా, పి.చిదంబరానికి క్రెడిట్ ఇచ్చారు. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా 1991లోనే 'ఆర్థిక స్వాతంత్య్రం' వచ్చిందని అన్నారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పేరును కూడా ఈ ఆర్థిక స్వేచ్ఛ ప్రదాతల లిస్ట్‌లో చేర్చారు.
1991 తర్వాత అతి పెద్ద ఆర్థిక సంస్కరణలు
1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై నారాయణ మూర్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల కోసం చాలా పెద్ద చర్యలు తీసుకున్నారని, అందుకు రాజకీయ స్వేచ్ఛ ఇవ్వడంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు చాలా కీలక పాత్ర పోషించారని అన్నారు. మన్మోహన్ సింగ్‌కి నరసింహారావు నుంచి ఆ మద్దతు అందకపోతే, ఇంత పెద్ద సంస్కరణలు అమలు చేయడం ఆయనకు కష్టమయ్యేదని చెప్పారు. మాంటెక్ సింగ్ అహ్లువాలియా, పి.చిదంబరం కూడా ఆర్థిక సంస్కరణలలో ముఖ్యమైన పాత్ర పోషించారంటూ వారి గురించి కూడా మాట్లాడారు.
1991 ఆర్థిక సంస్కరణల ఫలితాల గురించి నారాయణమూర్తి వివరించారు. ఆర్థిక సంస్కరణ వల్ల వచ్చిన అతి పెద్ద మార్పు... లైసెన్స్ రాజ్ నుంచి వ్యాపారాలకు విముక్తి కల్పించడమని చెప్పారు. కంపెనీలు తమ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కును పొందాయని అన్నారు.
స్టాక్ మార్కెట్ సంబంధిత నిర్ణయాల్లో, IPO & మార్కెట్ గురించి అవగాహన లేని సివిల్ సర్వెంట్ల పాత్ర రద్దు కావడం రెండో అతి పెద్ద సంస్కరణగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పారు. దీంతో, 1991 తర్వాత కరెంట్ అకౌంట్ కన్వర్టిబిలిటీ అవసరం లేకుండా పోయింది. ప్రజలు RBI కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత 10-12 రోజుల వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సంస్కరణ వల్ల దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగాయని, భారత్‌లో కంపెనీలు వ్యాపారం చేయడం సులభంగా మారిందని నారాయణ మూర్తి వివరించారు.
మరో ఆసక్తికర కథనం: దీపావళి స్పెషల్ స్టాక్స్, వీటితో పండుగ సంబరం పెరుగుతుందట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial