Financial Rules: ఈ రోజు నుంచి మన జీవితాల్లో మార్పులు, అన్నీ డబ్బుతో ముడిపడినవే!
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI, వివిధ డెబిట్ కార్డుల (ATM Cards) వార్షిక నిర్వహణ ఛార్జీని ఏకంగా 75 రూపాయలు పెంచింది.
Financial Rules Changing from 01 April 2024: ఈ రోజు (ఏప్రిల్ 01) నుంచి నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభమైంది. కొత్త ఆర్థిక సంవత్సరం రాకతో డబ్బుకు సంబంధించిన అనేక విషయాలు మారాయి. అవి మన జేబులపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఫాస్ట్‌ట్యాగ్ KYC నుంచి NPSలో లాగిన్ రూల్ వరకు, ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో చాలా విషయాలు అప్‌డేట్ అయ్యాయి.
ఈ రోజు నుంచి మారిన ఫైనాన్షియల్ రూల్స్
రూ.75 పెరిగిన SBI ATM కార్డ్ ఛార్జీలు
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI, వివిధ డెబిట్ కార్డుల (ATM Cards) వార్షిక నిర్వహణ ఛార్జీని ఏకంగా 75 రూపాయలు పెంచింది. ఇది ఈ రోజు (01 ఏప్రిల్ 2024) నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో పాటు, క్రెడిట్ కార్డ్ వినియోగదార్లకు కూడా ఝలక్ ఇచ్చింది. SBI క్రెడిట్ కార్డ్‌తో చేసే అద్దె చెల్లింపుపై లభించే రివార్డ్ పాయింట్లను ఈ రోజు నుంచి నిలిపివేసింది. AURUM, SBI కార్డ్ ఎలైట్, SBI కార్డ్ పల్స్, SBI కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, SimplyClICK SBI కార్డ్ యూజర్ల మీద ఈ ప్రభావం పడుతుంది.
యెస్ బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్
యెస్ బ్యాంక్ కూడా తన క్రెడిట్ కార్డ్ నిబంధనలు మార్చింది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారు ఒక త్రైమాసికంలో కనీసం రూ. 10,000 ఖర్చు చేస్తే దేశీయ విమానాశ్రయ లాంజ్ (Domestic airport lounge) యాక్సెస్ పొందుతాడు. ఏప్రిల్ 01 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ICICI బ్యాంక్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. తన కస్టమర్లు ఒక త్రైమాసికంలో రూ. 35,000 వరకు ఖర్చు చేస్తే, కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తోంది.
బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు
2023-24 ఆర్థిక సంవత్సరం ఖాతాల క్లోజింగ్ కారణంగా ఈ రోజు బ్యాంకుల్లో సాధారణ కార్యకలాపాలకు అనుమతి లేదు. ఈ నెలలో ఆదివారాలు, రెండు & నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఏప్రిల్ 05న జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు హాలిడే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్‌లు పని చేస్తాయి. 09న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామ నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవులు.
ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ పాలసీల డిజిటలైజేషన్‌ను ఇర్డాయ్ (IRDAI) తప్పనిసరి చేసింది. ఈ రోజు నుంచి, అన్ని బీమా కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్దతిలో పాలసీలు అందించాలి. జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమా సహా అన్ని పాలసీలకు ఈ రూల్ వర్తిస్తుంది.
ఫాస్టాగ్ KYC అవసరం
ఫాస్టాగ్ యూజర్లు మార్చి 31 లోగా KYC అప్‌డేట్ చేయాలని NHAI గతంలోనే సూచించింది. ఈ గడువులోగా KYC అప్‌డేట్ చేయడంలో విఫలమైతే, ఆ ఫాస్టాగ్ ఖాతా ఈ రోజు నుంచి డీయాక్టివేట్ అవుతుంది. ఇదే జరిగితే, ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర చెల్లింపులు చేయలేరు.
NPS లాగిన్ కోసం ఆధార్ అథెంటికేషన్ అవసరం
పెన్షన్ రెగ్యులేటర్ PFRDA, నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) ఖాతాలోకి లాగిన్ అయ్యే నిబంధన మార్చింది. 01 ఏప్రిల్ నుంచి, NPS ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ID & పాస్‌వర్డ్ మాత్రమే సరిపోదు. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా అవసరం. NPS ఖాతా లాగిన్ కోసం యూజర్ ID, పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని కూడా నమోదు చేసిన తర్వాత మాత్రమే NPS ఖాతాలోకి వెళ్లగలరు.
EPFO నియమాలలో మార్పులు
'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (ఈపీఎఫ్‌ఓ) నిబంధనల్లో ఈ రోజు నుంచి అతి పెద్ద మార్పు వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి, ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని EPF ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. ఇప్పటి వరకు ఖాతాదారు అభ్యర్థనపై మాత్రమే ఖాతాను బదిలీ చేసేవాళ్లు.
డిఫాల్ట్ ఆప్షన్‌గా కొత్త పన్ను విధానం (New tax regime)
ఏప్రిల్ 01 నుంచి, కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారింది. మీరు పాత లేదా కొత్త పన్ను విధానంలో ఏదో ఒకటి ఎంచుకోకపోతే, మీ ITR కొత్త పన్ను విధానంలోనే ఫైల్ అవుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, అదే పద్ధతిలో ITR పైల్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఔషధాల ధరలు పెంపు
'నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్' (NLEM) కింద కొన్ని అత్యవసర ఔషధాల ధరలను 0.0055 శాతం పెంచుతున్నట్లు భారత ఔషధ ధరల నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకారం, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్షన్ మెడిసిన్స్ సహా చాలా ముఖ్యమైన మందుల ధరలు ఈ రోజు నుంచి పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: టెలికాం అధికారి మీకు ఫోన్ చేశారా?, అది ఫేక్ కాల్ కావచ్చు