Mobile Recharge: వాయిస్ కాల్స్ కోసం డబ్బులు - పాత విధానంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్
Mobile Recharge Plans: వాయిస్ కాల్స్, డేటా, SMS కోసం ప్రత్యేక రీఛార్జ్ ఓచర్‌లు తీసుకురావడం సహా ప్రస్తుతమున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను మార్చడానికి ట్రాయ్ ఒక కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసింది.
Mobile Recharge Plans: ఇకపై, మీ మొబైల్ నుంచి వాయిస్ కాల్స్ చేయడానికి, ఇంటర్నెట్ (డేటా) ఉపయోగించుకోవడానికి, SMSలు పంపడానికి విడివిడిగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. వాయిస్ కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు వేర్వేరు రీఛార్జ్ ఓచర్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను సమూలంగా మార్చడానికి, 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) శుక్రవారం (26 జులై 2024) ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది.
కన్సల్టేషన్ పేపర్
'కన్సల్టేషన్ పేపర్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ (TCPR) 2012' పేరిట విడుదల చేసిన డ్రాఫ్ట్‌లో, మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్‌తో పాటు మరికొన్ని మార్పులు కూడా తీసుకురావాలని ట్రాయ్ (TRAI) భావిస్తోంది. స్పెషల్ టారిఫ్ వోచర్‌లు (STVs), కాంబో ఓచర్‌ల (CVs) గరిష్ట చెల్లుబాటు గడువును (maximum validity) ప్రస్తుతమున్న 90 రోజుల నుంచి పెంచాలా, వద్దా అని సూచనలు, సలహాలు ఆహ్వానించింది.
కన్సల్టేషన్ పేపర్ అంటే.. ఒకటి లేదా కొన్ని ప్రాతిపాదనలతో కూడిన పత్రం. ఆ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించిన అంశాలపై సంబంధిత వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఆహ్వానిస్తారు. ఆయా వర్గాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి తుది నిర్ణయం తీసుకుంటారు.
కాంబో ప్లాన్స్‌తో ప్రజలకు టోపీ
ప్రస్తుతం, అన్ని టెలికాం సేవలు అందిస్తున్న అన్ని కంపెనీలు (రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్) వాయిస్ & SMS సేవలతో పాటు డేటాను కూడా ఒకే ప్లాన్‌లో అందిస్తున్నాయి. వాయిస్, SMS, డేటాకు కలిపి యూజర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ఈ తరహా ప్లాన్స్‌కు పాపులారిటీ కూడా ఉంది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదార్లు వాయిస్ & SMS సేవలను వినియోగించుకుంటున్నారు గానీ, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవడం లేదు. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. తమకు అక్కర్లేని డేటా కోసం కూడా టెలికాం కంపెనీలు తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని, ఇది అన్యాయమంటూ ట్రాయ్‌కి ఫిర్యాదులు వస్తున్నాయి.
యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా... వాయిస్ కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు వేర్వేరు రీఛార్జ్ ఓచర్‌లు అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ట్రాయ్ ఈ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది.
కన్సల్టేషన్ పేపర్‌లో సూచించిన మార్పులపై పరిశ్రమ వర్గాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే వాయిస్, SMS, డేటా కోసం విడివిడిగా & వీటి కాంబినేషన్లతో కొత్త ప్లాన్స్ మార్కెట్‌లోకి వస్తాయి. మనకు అక్కర్లేని సర్వీసుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది. రీఛార్జ్ రేట్లు కూడా తగ్గుతాయి.
ప్రత్యేక టారిఫ్ ఓచర్‌లు, కాంబో ఓచర్‌ల చెల్లుబాటు గడువును ప్రస్తుతమున్న 90 రోజుల పరిమితి నుంచి పొడిగించాలని వివిధ వర్గాలు బలంగా కోరుతున్నాయని కూడా ట్రాయ్ వెల్లడించింది. ఇది అమల్లోకి వస్తే, ఇకపై 90 రోజులను మించిన వ్యాలిడిటీ ప్లాన్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
ఈ కన్సల్టేషన్ పేపర్‌లో సూచించిన విషయాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా, సూచనలు/సలహాలు ఇవ్వాలన్నా 2024 ఆగస్టు 16 లోపు కామెంట్లు & ఆగస్టు 23లోగా కౌంటర్ కామెంట్‌లు పంపొచ్చని ట్రాయ్ ప్రకటించింది.
మరో ఆసక్తికర కథనం: గ్లోబల్‌గా చమురు ధరల పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవి