Made in India iPhone: ఇకపై "టాటా తయారీ ఐఫోన్లు", ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రికార్డ్‌కు రెడీ
ఈ డీల్ ఫినిష్ చేసిన తర్వాత, ఐఫోన్ల తయారీ కోసం విస్ట్రోన్‌తో టాటా గ్రూప్ చేతులు కలుపుతుంది,
Made in India iPhone: టాటా గ్రూప్ త్వరలో భారత్‌లో ఐఫోన్లను (iPhone) ఉత్పత్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలోని అతి పెద్ద & శతాబ్దాల అనుభవం ఉన్న పారిశ్రామిక సంస్థల సమ్మేళనం అయిన టాటా గ్రూప్, ఐఫోన్ తయారీదార్ల లీగ్‌లో అతి త్వరలో చేరవచ్చు. ఇదే జరిగితే, ఐఫోన్‌ను తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ నిలుస్తుంది. భారతదేశంలో ఇప్పటికే ఐఫోన్లను ఉత్పత్తి చేస్తున్నా, తైవాన్ కంపెనీలే ఆ పనిని చూసుకుంటున్నాయి. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn), విస్ట్రోన్, పెగాట్రాన్ (Pegatron) మన దేశంలో తయారీ కేంద్రాలను నెలకొల్పి యాపిల్ (Apple) ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
బెంగళూరుకు సమీపంలో ఉన్న, తైవాన్‌కు చెందిన విస్ట్రోన్ (Wistron) తయారీ కేంద్రంలో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయబోతోంది. త్వరలోనే ఈ డీల్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ డీల్ ఫినిష్ చేసిన తర్వాత, ఐఫోన్ల తయారీ కోసం విస్ట్రోన్‌తో టాటా గ్రూప్ చేతులు కలుపుతుంది, జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్‌లో టాటా గ్రూపు అతి పెద్ద వాటాదారుగా ఉంటుంది. దాదాపు 10,000 మంది కార్మికులు టాటా గ్రూప్ యాజమాన్యం కిందకు వస్తారు.
చైనా ఆధిపత్యానికి సవాల్
యాపిల్ ఐఫోన్ తయారీ లీగ్‌లోకి టాటా గ్రూప్ అడుగు పెట్టడం, చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడం వంటిది. ప్రస్తుతం, ఐఫోన్ల తయారీలో చైనాదే అగ్రస్థానం. మొత్తం ఐఫోన్‌లో 85 శాతం చైనాలోనే రూపుదిద్దుకుంటున్నాయి. ఐఫోన్ తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని Apple కంపెనీ భావిస్తోంది. కరోనాకు సంబంధించి చైనాలో విధించిన ఆంక్షల కారణంగా ఐఫోన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో, ఈ హై ఎండ్ ఫోన్ కోసం వెయిటింగ్ పీరియడ్ అతి భారీగా పెరిగింది.
కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి..
బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదిక ప్రకారం... విస్ట్రోన్‌తో టాటా గ్రూప్ డీల్ మార్చి 31, 2023 లోపు పూర్తవుతుంది. ఆ తర్వాత, విస్ట్రోన్ స్థానాన్ని టాటా గ్రూప్ భర్తీ చేస్తుంది. ఈ డీల్ పూర్తయ్యాక, ఐఫోన్ల తయారీని ‘టాటా ఎలక్ట్రానిక్స్’ చేపట్టే అవకాశం ఉంది. తద్వారా, తయారీ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా టాటా గ్రూప్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే... ఏప్రిల్ 1, 2023 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి, ప్రభుత్వ ప్రోత్సాహక ప్రయోజనాన్ని టాటా ఎలక్ట్రానిక్స్ కూడా పొందుతుంది. బెంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో విస్ట్రోన్ తయారీ కేంద్రం ఉంది.
ఆపిల్‌తో తన భాగస్వామ్యాన్ని పెంచుకోవడంలో టాటా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. బెంగళూరు సమీపంలోని హోసూర్‌లో టాటా ఐఫోన్‌కు సంబంధించిన విడిభాగాలను తయారు చేస్తోంది. దీంతో పాటు, టాటా దాదాపు 100 ఆపిల్ స్టోర్లను ప్రారంభించబోతోంది, వీటిలో మొదటి స్టోర్‌ను ముంబైలో తెరవబోతోంది.
ఐఫోన్‌ను అసెంబ్లింగ్ చేయడం ఒక సవాలుతో కూడుకున్న పని అని మీకు తెలియజేద్దాం, ఎందుకంటే అమెరికా యొక్క అనేక నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. కొత్త తయారీ కర్మాగారం ద్వారా, ఐఫోన్ అసెంబ్లింగ్‌ను 5 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా ఎలక్ట్రానిక్స్, హై-ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌పైనే తమ దృష్టి సారించనున్నట్టు గతంలో చెప్పారు. Wistron భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో 2017 నుండి iPhoneలను అసెంబ్లింగ్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది.