Income Tax Returns: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్.. నేడు ఈ పనులు పూర్తి చేయకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు
ITR Refund | ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు నేటితో ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సమీక్షించుకోవాలని లేదా ఏవైనా తప్పులను సరిదిద్దుకోవాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది.

ITR Deadline | 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన లేదా ఆలస్యమైన రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు నేటితో ముగియనుంది. జనవరి 1 నుంచి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఎలాంటి మార్పులు చేయలేరు. ఆర్థిక సంవత్సరం 2024-25లో సంపాదించిన మొత్తానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఏదైనా తప్పు జరిగితే, దాన్ని సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31తో చివరి అవకాశం ముగుస్తుంది.
గత కొన్ని వారాలుగా ఆదాయపు పన్ను శాఖ (income Tax) పన్ను చెల్లింపుదారులకు ఈమెయిల్‌లు లేదా సందేశాలు పంపి, వారు దాఖలు చేసిన రిటర్న్‌లను సమీక్షించమని లేదా ఏవైనా తప్పులను సరిదిద్దుకోవాలని కోరుతోంది. తప్పులు సరిదిద్దకపోతే రీఫండ్‌లు నిలిచిపోయే అవకాశం ఉన్నందున నేడు ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవడం ఇది చాలా ముఖ్యం.
నేటితో తుది గడువు ముగిసిన తర్వాత, పన్ను చెల్లింపుదారులకు స్వచ్ఛంద సవరణ (వారి సొంత నిర్ణయాల ప్రకారం) ఎంపిక ఉండదు. ఈరోజు తర్వాత మీరు మీ ఇష్టానుసారం ఎలాంటి తగ్గింపులు లేదా మినహాయింపులను ఐటీఆర్ లో క్లెయిమ్ చేయలేరు. మీరు దాఖలు చేసిన రిటర్న్‌లో శాఖ ఏదైనా లోపాన్ని కనుగొంటే, మీకు ఐటీ శాఖ నుంచి నోటీసు వస్తుంది.
సవరించిన రిటర్న్ అంటే ఏమిటి?
ITR దాఖలు చేసేటప్పుడు మనం పొరపాటున కొన్ని తప్పులు చేస్తాం. కొన్నిసార్లు తప్పు తగ్గింపులను క్లెయిమ్ చేస్తాం, లేదా కొన్ని ఆదాయాలను వదిలివేస్తాం. అలాంటి సందర్భాలలో గడువు ముగిసిన తర్వాత రిటర్న్‌ను దాఖలు చేయడానికి సవరించిన రిటర్న్ ఒక మంచి అవకాశం. సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్, పన్ను చెల్లింపుదారులకు అసలు రిటర్న్‌లో చేసిన తప్పులు లేదా లోపాలను సరిదిద్దడానికి ట్యాక్స్ పేయర్లను అనుమతిస్తుంది.
CA (డా.) సురేష్ సురానా మాట్లాడుతూ.. ఐటీఆర్ సబ్మిట్ తర్వాత ఏదైనా తప్పు లేదా లోపం కనుగొంటే, పన్ను చెల్లింపుదారుడు తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను సవరించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(5) కింద దీనికి అనుమతి ఉందని తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, సవరించిన రిటర్న్ అసలు రిటర్న్‌ను భర్తీ చేస్తుంది. ఆ అసెస్‌మెంట్ సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే రిటర్న్‌గా మారుతుంది. సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి మీకు ఎలాంటి పెనాల్టీ ఉండదు, అయితే అది నిర్ణీత గడువులోపు దాఖలు చేయబడాలి. అయితే సవరణ వల్ల పన్ను బాధ్యత పెరిగితే, పన్ను చెల్లింపుదారుడు వర్తించే వడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సవరించిన రిటర్న్‌ను సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం 31 డిసెంబర్ లోపు లేదా అసెస్‌మెంట్ పూర్తయ్యేలోపు, ఏది ముందు అయితే అది దాఖలు చేయాలి. సురానా మాట్లాడుతూ, అసెస్‌మెంట్ సంవత్సరం 2025-26 కోసం, సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ తో ముగియనుంది. ఈ గడువు ముగిసిపోతే, రీఫండ్‌ను క్లెయిమ్ చేయడానికి పన్ను చెల్లింపుదారులు 'కండోనేషన్ ఆఫ్ డిలే' మార్గాన్ని ఎంచుకోవాలి.
సవరించిన రిటర్న్ గడువు పెరుగుతుందా?
31 డిసెంబర్ గడువు ముగుస్తున్నందున చాలా మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఆదాయపు పన్ను శాఖను సవరించిన రిటర్న్‌లను దాఖలు చేయడానికి మరికొంత సమయం కోరుతున్నారు. ఒక వినియోగదారుడు X లో ఇలా రాశారు, "అసలు ITR, సవరించిన ITR మధ్య 60 రోజుల గ్యాప్ ఉండాలి. అసలు ITR - 10 నవంబర్ అయితే, సవరించిన ITR 10 ఫిబ్రవరి వరకు ఉండాలి. మీరు అందరి CA లను, పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్నారు. పన్ను చెల్లింపుదారుల హక్కులను విస్మరిస్తున్నారు. తగిన చర్యలు తీసుకోండి" అన్నారు.
సవరించిన రిటర్న్‌ను ఎలా దాఖలు చేయాలి?
- ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ కు వెళ్లండి.
- PAN, పాస్‌వర్డ్, క్యాప్చాను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
- తరువాత 'e-File' విభాగంలోకి వెళ్లి Income Tax Return ఆప్షన్ క్లిక్ చేయండి.
- File Income Tax Return ను ఎంచుకున్న తర్వాత, సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
- రిటర్న్ ఫైలింగ్ విభాగంలో, సెక్షన్ 139(5) కింద సవరించిన రిటర్న్ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ తప్పును సరిదిద్దాలి. మీ అసలు రిటర్న్ యొక్క అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్, దాఖలు చేసిన తేదీని నమోదు చేయాలి.
- సవరించిన రిటర్న్‌ను సబ్మిట్ చేయండి. తప్పనిసరిగా e-verify చేయండి.






















