Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి
ఈ లోన్‌ను మీరు రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, సాధారణ గోల్డ్ లోన్. రెండోది గోల్డ్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ.
Gold Overdraft Loan: భారతీయులకు బంగారం ఒక అలంకరణ లోహమే కాదు, పెట్టుబడి సాధనం కూడా. ఏదైనా సందర్భం కోసం హఠాత్తుగా డబ్బు అవసరం పడితే, భారతీయులకు మొదట గుర్తుకొచ్చేది గోల్డ్ లోనే. ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి, అవసరానికి డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు అమరగానే, దానిని బ్యాంకులో చెల్లించి తిరిగి బంగారం విడిపించుకుంటారు. ఇదొక చక్రం. బ్యాంకులకు, మనకు మధ్య ఈ బంగారం షటిల్ చేస్తూనే ఉంటుంది. కొంతమంది కొత్త బంగారం కొనడానికి కూడా పాత బంగారాన్ని బ్యాంకులో తనఖా పెడుతుంటారు.
బ్యాంకులు గోల్డ్ లోన్‌ను చాలా త్వరగా అప్రూవ్ చేస్తాయి. రుణగ్రహీత డబ్బు చెల్లించలేకపోయినా, తాకట్టు పెట్టిన బంగారం వాటి దగ్గర ఉంటుంది కాబట్టి, గోల్డ్ లోన్‌కు వెంటనే ఓకే చెబుతాయి.
ఈ లోన్‌ను మీరు రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, సాధారణ గోల్డ్ లోన్. రెండోది గోల్డ్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఈ రెండు ఎంపికలను ఉపయోగించుకోవచ్చు. గోల్డ్ లోన్ గురించి మనందరికీ తెలుసు. మరి ఈ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఫెసిలిటీ అంటే ఏంటి?.
మామూలుగా గోల్డ్ లోన్ కోసం వెళ్తే, బంగారానికి సమానమైన రుణాన్ని బ్యాంకులు ఇవ్వవు. తగ్గించి ఇస్తాయి. ఈ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్‌లో మాత్రం బంగారానికి సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో మీరు పొందుతారు. ఈ పద్ధతిలో, మొదట మీరు మీ బంగారాన్ని బ్యాంకు లేదా అప్పు ఇచ్చే ఆర్థిక సేవల సంస్థలో డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్‌ను హామీగా పెట్టుకుని, సదరు బ్యాంక్ లేదా ఆర్థిక సేవల సంస్థ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో మీకు గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఫెలిసిటీ ఇస్తుంది.
మీరు ఈ ఓవర్ డ్రాఫ్ట్‌ని క్రెడిట్ కార్డ్ లాగా ఉపయోగించుకోవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా, కావల్సినప్పుడు డబ్బులు డ్రా చేసుకోవడం మొదలు పెట్టవచ్చు. దీని కోసం, గోల్డ్ ఖాతా మీద మీకు అందించిన చెక్ బుక్ ద్వారా మీ అవసరానికి తగట్లుగా డబ్బు తీసుకోవచ్చు.
ఓవర్ డ్రాఫ్ట్ లోన్‌లో మీరు EMI చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత డబ్బు ఉపసంహరించుకున్నారో, ఆ డబ్బు మీద మాత్రమే వడ్డీని లెక్క కడతారు. సాధారణ బంగారం రుణం కంటే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా వచ్చే రుణం ఎక్కువగా ఉంటుంది.
గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ రుణం వల్ల లాభాలు
మీ బ్యాంక్ నుంచి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఓకే అయిన తర్వాత, మీరు దానిని క్రెడిట్ కార్డ్ లాగా ఉపయోగించవచ్చని ఇంతకు ముందే చెప్పాం కదా. ఇప్పుడు, అలా తీసుకునే మొత్తానికి మీరు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. తీసుకునే డబ్బుతో మీ షాపింగ్, క్రెడిట్ కార్డ్ బిల్లు, నగదు బదిలీ సహా చాలా బిల్లులు చెల్లించవచ్చు. ఈ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్‌కు బ్యాంకు నుంచి ఆమోదం చాలా సులభంగా లభిస్తుంది, పేపర్ వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం కూడా ఈజీగా తీసుకోవచ్చు.
గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ రుణం వల్ల నష్టాలు
బంగారం అనేది మార్కెట్ ఒడిదొడుకులకు సంబంధించింది. మార్కెట్‌లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం ధర పెరుగుతూ, పడిపోతూ ఉంటుంది. ఈ మార్పులు మీరు తీసుకున్న లోన్ మొత్తం మీద ప్రభావం చూపుతాయి. దీంతో పాటు, గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ డబ్బును సకాలంలో చెల్లించకపోతే, మీ బంగారం మీ చేతికి రాకుండాపోయే ప్రమాదం ఉంది.