Jio Financial: రిలయన్స్ షేర్‌హోల్డర్లకు గుడ్‌న్యూస్, త్వరలో జియో పైనాన్షియల్ లిస్టింగ్!
ఒక వ్యక్తి దగ్గర 100 రిలయన్స్ షేర్లు ఉంటే, అతను 100 జియో ఫైనాన్షియల్ షేర్లను ఉచితంగా పొందుతాడు.
Jio Financial Services: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, తన డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ను త్వరగా విడదీసి (Demerge), స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలని చూస్తోందని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో కచ్చితంగా లిస్ట్ చేయడానికి యోచిస్తోందని తెలుస్తోంది.
రిలయన్స్ చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారాన్ని రిలయన్స్ స్ట్రాటెజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌లో (RSIL) కలిపి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌గా (Jio Financial Services Ltd - JFSL) దాని పేరు మార్చనున్నారు. కొత్త పేరుతో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయనున్నారు.
ఒకటికి ఒకటి, వందకు వంద
లిస్టింగ్ తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదార్లు తమ వద్ద ఉన్న ప్రతి రిలయన్స్ షేర్‌కు ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు చొప్పున (1:1) పొందుతారు. అంటే, ఒక వ్యక్తి దగ్గర 100 రిలయన్స్ షేర్లు ఉంటే, అతను 100 జియో ఫైనాన్షియల్ షేర్లను ఉచితంగా పొందుతాడు.
బిలియనీర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నియంత్రణలో ఉన్న రిలయన్స్ వ్యాపార సమ్మేళనం, ముంబై కేంద్రంగా పని చేస్తున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ అరంగేట్రం కోసం తొందరపడుతోంది, అవసరమైన అనుమతుల కోసం భారతీయ నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతోందని సమాచారం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చిలో దాఖలు చేసిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం... ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ను డీమెర్జ్ చేసి, లిస్ట్ చేసే ప్లాన్‌పై ఓటు వేయడానికి మే 2వ తేదీన వాటాదార్లు & రుణదాతల సమావేశాన్ని నిర్వహించనుంది.
చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి, లిస్టింగ్ తేదీ అటు, ఇటు అయ్యే అవకాశం కూడా ఉంది.
అక్కరకు రానున్న అతి పెద్ద కస్టమర్ బేస్
రిలయన్స్, భారతదేశంలో అతి పెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ & అతి పెద్ద రిటైలర్. ఈ వ్యాపారాల ద్వారా రిలయన్స్ కస్టమర్ల బేస్ కోట్లలో ఉంది. నూతన ఆర్థిక సేవల వ్యాపారం ఉనికిని పెంచుకోవడానికి ఈ కస్టమర్ బేస్ చాలా ఉపయోగపడుతుంది.
రిటైల్, టెలీ కమ్యూనికేషన్స్ విభాగాలను విడదీసి ఐదేళ్లలో లిస్ట్ 2019లో ముకేష్ అంబానీ ప్రకటించారు. ఎందుకంటే, ఆ వ్యాపారాలు వాటి పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. దీనికి అనుగుణంగా డీమెర్జర్ అడుగులు వేస్తోంది RIL.
రిలయన్స్, గత ఏడాది నవంబర్‌లో జియో ఫైనాన్షియల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కె.వి.కామత్‌ను (KV Kamath) నియమించింది. యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మెక్‌లారెన్ స్ట్రాటజిక్ వెంచర్స్ టాప్ ఎగ్జిక్యూటివ్ హితేష్ సేథియాను (Hitesh Sethia) తీసుకుంది.
రిలయన్స్ నుంచి ఫైనాన్స్ వ్యాపారాన్ని విడదీయడం పూర్తయిన తర్వాత, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్‌గా కామత్ బాధ్యతలు స్వీకరిస్తారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.