Infosys Q4 Results: ఇన్ఫీ కూడా ముంచెన్, ఫలితాల్లో ప్లస్‌లు, మైనస్‌లు ఇవే..
మూడో త్రైమాసికంతో (QoQ) పోలిస్తే నాలుగో త్రైమాసికంలో లాభం 7 శాతం తగ్గింది.
Infosys Q4 Results: టీసీఎస్ (Tata Consultancy Services) తర్వాత ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ (Infosys) కూడా మార్కెట్‌ను నిరాశపరిచింది. దేశంలోని రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ, గురువారం (13 ఏప్రిల్ 2023) మార్కెట్ ముగిసిన తర్వాత, 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY23) ఫలితాలను ప్రకటించింది. ఈ నంబర్లు బలహీనంగా ఉన్నాయి.
1. లాభ వృద్ధి అంతంతమాత్రం
2022-23 నాలుగో త్రైమాసికంలో (2023 జనవరి-మార్చి కాలం) ఇన్ఫోసిస్‌కు రూ. 6,128 కోట్ల లాభం మిగిలింది. 2021-22 ఇదే త్రైమాసికంలోని లాభం రూ. 5,686 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 7.8 శాతం (YoY) వృద్ధి. 2022-23 మూడో త్రైమాసికంలో (2022 అక్టోబర్-డిసెంబర్ కాలం) కంపెనీ లాభం రూ. 6,586 కోట్లుగా ఉంది. మూడో త్రైమాసికంతో (QoQ) పోలిస్తే నాలుగో త్రైమాసికంలో లాభం 7 శాతం తగ్గింది.
2. ఆదాయ ఆర్జన గొప్పగా లేదు
2023 జనవరి-మార్చి కాలంలో ఇన్ఫోసిస్ ఆదాయం రూ. 37,441 కోట్లుగా లెక్క తేలింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని ఆదాయం రూ. 32,276 కోట్లతో పోలిస్తే, ప్రస్తుతం 16 శాతం వృద్ధితో కనిపించింది. 2022-23 మూడో త్రైమాసికంలో రూ. 38,318 కోట్ల ఆదాయాన్ని ఈ ఐటీ మేజర్ ఆర్జించింది.
2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ. 24,095 కోట్లకు చేరింది. 2021-22లో వచ్చిన రూ. 22,146 కోట్ల కంటే ఇది కేవలం 9 శాతం మాత్రమే ఎక్కువ. ఆదాయం విషయానికి వస్తే.. 2021-22లోని రూ. 1,21,641 కోట్ల నుంచి 20.7 శాతం పెరిగి 2022-23లో రూ. 1,46,767 కోట్లకు చేరుకుంది.
3. ఆర్డర్ విన్స్‌లో బలం
బలమైన ఆర్డర్ పైప్‌లైన్‌తో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ఇన్ఫోసిస్ ప్రవేశించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9.8 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను దక్కించుకుంది. FY22లోని 9.6 బిలియన్ల కంటే ఇది ఎక్కువ. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో, 2.1 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌లను ఈ కంపెనీ పొందగలిగింది.
4. భవిష్యత్‌పై పెద్దగా ఆశల్లేవు
ఫలితాల విడుదల సందర్భంగా, 2023-24 సంవత్సరానికి ఇన్ఫోసిస్ అంచనాలు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు స్థిర కరెన్సీ పరంగా 4 నుంచి 7 మాత్రమే జంప్‌ను చూస్తాయని కంపెనీ అంచనా వేసింది. ఆపరేటింగ్ మార్జిన్ 20 నుంచి 22 శాతం వరకు ఉండొచ్చని లెక్కగట్టింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా మార్గదర్శకాలను ఈ కంపెనీ తగ్గించింది.
5. డివిడెండ్
2022-23 సంవత్సరానికి, తన పెట్టుబడిదార్లకు ఒక్కో షేరుకు రూ. 17.50 తుది డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది. దీంతో కలిపి, మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై డివిడెండ్ రూ. 34కు చేరింది.
6. ఆట్రిషన్ తగ్గడం మరొక ప్లస్ పాయింట్
నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆట్రిషన్ రేట్ గణనీయంగా 20.9 శాతానికి తగ్గింది. మూడో త్రైమాసికంలో ఇది 24.3 శాతంగా ఉంది. అంతకుముందు, రెండో త్రైమాసికంలో 27.1 శాతంగా, మొదటి త్రైమాసికంలో 28.4 శాతంగా ఉండేది. అంటే, క్రమంగా కంపెనీ నుంచి ఉద్యోగుల వలసలు తగ్గుముఖం పడుతున్నాయి.
2023 మార్చి 31 ముగింపు నాటికి ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,43,234. మూడో త్రైమాసికంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 3,611 తగ్గింది. మొత్తం 2022-23 కాలంలో, కొత్తగా 51,000 మందిని తీసున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత 2023-24లో కొత్త నియామకాలపై మాత్రం స్పందించలేదు.
గురువారం నాడు, ఇన్ఫోసిస్ స్టాక్ 2.74 శాతం క్షీణించి రూ. 1,389 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.