Changing Journey Date: మీ ట్రైన్ జర్నీ డేట్ మారిందా?, - టిక్కెట్ క్యాన్సిల్ చేయకుండా ప్రయాణ తేదీని మార్చొచ్చు
Indian Railways Rules: మీరు రైలు ప్రయాణ తేదీని మార్చుకోవాల్సి వస్తే, ఆ పనిని చాలా సులభంగా చేయొచ్చు. మీరు వెళ్లకుండా వేరొక వ్యక్తిని కూడా ఆ టిక్కెట్‌పై పంపొచ్చు.
Rules For Change In Date Of Train Journey: భారతీయ రైల్వేలది ప్రపంచంలో నాలుగో అతి పెద్ద రైల్వే వ్యవస్థ. భారతీయ రైళ్ల ద్వారా ప్రతి రోజు కోట్లాది మంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నారు. చాలా ఎక్కువ దూరం (Long Journey) ప్రయాణం చేయాల్సివస్తే, చాలా మంది మొదటి ఎంపిక రైలు. ప్రయాణ సౌకర్యం కోసం ప్రజలు చాలా రోజులు ముందుగానే రైళ్లలో సీట్ రిజర్వ్ (Train Ticket Reservation) చేసుకుంటారు. అయితే, కొన్నిసార్లు ప్రయాణ ప్రణాళికలు మారుతుంటాయి. అటువంటి పరిస్థితిలో, ట్రైన్ టికెట్ రద్దు చేయడం (Cancelling a train ticket) చాలామంది అనుసరిస్తున్న సాధారణ పద్ధతి.
రైలు రిజర్వేషన్ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీ (Train ticket cancellation charge) చెల్లించాలి, టిక్కెట్ వాపసు డబ్బులో కొంత మొత్తాన్ని కొన్నిసార్లు పూర్తిగా వదులుకోవాలి. ఇలా డబ్బు నష్టపోకుండా ఉండడానికి ప్రయాణీకులకు ఒక ఉపాయం ఉంది. కావాలనుకుంటే, మీరు ముందుగా అనుకున్న రోజున కాకుండా, మీకు అవసరమైన రోజునే ప్రయాణం చేయవచ్చు. అంటే, మీ రైలు ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం భారతీయ రైల్వే కొన్ని రూల్స్ రూపొందించింది. ప్రయాణానికి మిగిలివున్న సమయాన్ని బట్టి మీ రైలు టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.
ప్రయాణ తేదీని 48 గంటల ముందు
భారతీయ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు 'రాంగ్ డే' కోసం టికెట్ బుక్ చేసుకుంటే, ఆ టిక్కెట్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అదే టిక్కెట్‌పై మీ ప్రయాణ తేదీని సులభంగా మార్చుకోవచ్చు. దీని కోసం, మీ మొదటి ప్రయాణ తేదీకి కనీసం 48 గంటల ముందు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి... మీరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం మీకు అందుతుంది. అంటే, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి (ఆఫ్‌లైన్‌లో) ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నవాళ్లు మాత్రమే రైలు ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అర్హులు. మీరు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసి ఉంటే మీకు ఈ సౌకర్యం లభించదు.
రైలు ప్రయాణ తేదీని ఎలా మార్చుకోవాలి?
ఈ పని చాలా సులభం. మీరు ఆఫ్‌లైన్‌లో టిక్కెట్‌ను బుక్ చేసి & ప్రయాణ తేదీని మార్చాలనుకుంటే, మీ టిక్కెట్‌పై ఉన్న రైలు ప్రయాణ సమయానికి కనీసం 48 గంటల ముందుగానే రైల్వే అధికారిక టికెట్ బుకింగ్ కౌంటర్‌కు వెళ్లాలి. అక్కడ, సంబంధిత ఫారం నింపాలి, దానిలో కొత్త తేదీని వేయాలి. ఆ ఫారాన్ని మీరు రైల్వే టిక్కెట్ రిజిర్వేషన్ కౌంటర్‌లో సమర్పిస్తే, అక్కడి అధికారి మీ ప్రయాణ తేదీ మారుస్తారు.
మీ రైలు టిక్కెట్‌ను మరొకరికి బదిలీ చేయొచ్చు
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, మీరు మీ రైలు టిక్కెట్‌ను మరొక ప్రయాణీకుడికి బదిలీ (Transfer a train ticket to another passenger) కూడా చేయవచ్చు. అయితే.. మీ తల్లిదండ్రులు, సోదరుడు/సోదరి, కుమారుడు/కుమార్తె, భర్త/భార్య వంటి మీ సన్నిహిత కుటుంబ సభ్యుడికి మాత్రమే టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. వీళ్లు తప్ప మిగిలిన ఎవరికీ మీ టిక్కెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయలేరు. రైల్వే టిక్కెట్ కౌంటర్‌కు వెళ్లి మీరు ఈ పనిని పూర్తి చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: విమానం లాగా, రైలు ఆలస్యమైనా 'ఉచితంగా ఆహారం' - చాలామందికి ఈ విషయం తెలీదు