CPI Inflation Data: దేశంలో దిగొచ్చిన ద్రవ్యోల్బణం, EMIల భారం కూడా తగ్గే ఛాన్స్!
Inflation In India : ఆహార పదార్థాల ధరల్లో పతనం కారణంగా అక్టోబర్ నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (Retail Inflation) 4.87 శాతానికి తగ్గింది.
Retail Inflation Data For October 2023: ఈ ఏడాది జులై నెల తర్వాత.. వరుసగా మూడో నెలలోనూ దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం... ఆహార పదార్థాల ధరల్లో పతనం కారణంగా అక్టోబర్ నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (Retail Inflation) 4.87 శాతానికి తగ్గింది. సెప్టెంబర్‌లో ఇది 5.02 శాతంగా, ఆగస్టు నెలలో 6.83 శాతంగా ఉంది. అంతకుముందు, జులైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి చేరుకుంది.
సరిగ్గా ఏడాది క్రితం, 2022 అక్టోబర్ నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉంది.
ఆహార ద్రవ్యోల్బణం రేటు తగ్గుదల
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణం రేటు స్వల్పంగా తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 6.62 శాతం నుంచి అక్టోబర్‌లో 6.61 శాతానికి చేరింది. 2022 అక్టోబర్‌లో ఇది 7.01 శాతంగా ఉంది.
అక్టోబర్‌లో, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 5.12 శాతంగా, ఆహార ద్రవ్యోల్బణం 6.71 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 2023 అక్టోబర్‌లో 4.62 శాతానికి తగ్గగా, ఆహార ద్రవ్యోల్బణం 6.35 శాతంగా ఉంది. అంటే రిటైల్ ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం రెండూ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని బట్టి, పట్టణ/నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే రేట్లు మండిపోతున్నాయి.
పప్పు దినుసుల ద్రవ్యోల్బణం పెరుగుదల
అక్టోబర్ నెలలో, ప్రొటీన్లకు కీలక ఆధారమైన పప్పుల ద్రవ్యోల్బణం పెరిగింది. ఆ నెలలో పప్పు దినుసుల ద్రవ్యోల్బణం 18.79 శాతానికి చేరగా, సెప్టెంబర్‌లో 16.38 శాతంగా ఉంది. తృణధాన్యాలు (సెప్టెంబర్‌లో 11 శాతం నుంచి అక్టోబర్‌లో 10.65 శాతానికి), మాంసం & చేపలు (4.1 శాతం నుండి 3.3 శాతానికి), పాలు (6.9 శాతం నుండి 6.44 శాతానికి) ద్రవ్యోల్బణం రేట్లలో కొంత ఉపశమనం లభించింది. కోడిగుడ్ల ధరలు పెరగడంతో ఎగ్ ఇన్‌ఫ్లేషన్ 9.30 శాతంగా ఉంది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 22.8 శాతం వద్ద ఎలివేటెడ్‌గా ఉంది. పండ్లు & చక్కెర ద్రవ్యోల్బణం 9.34 శాతం & 5.5 శాతానికి చేరుకుంది. గత నెలలో 3.39 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం 2.70 శాతానికి తగ్గింది.
EMIల నుంచి ఉపశమనం కోసం ఆశలు
2023 అక్టోబర్ నెలలో, దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం దిగువకు చేరుకోవడం ఆర్‌బీఐకి ఉపశమనం కలిగించే అంశం. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే అంశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఒకటి. చిల్లర ద్రవ్యోల్బణాన్ని 2% నుంచి 6% మధ్యలో ఉంచేందుకు కేంద్ర బ్యాంక్ ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం, అక్టోబర్‌లో 4.87 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉంది. దీంతోపాటు, వరుసగా మూడో నెల కూడా ఇన్‌ఫ్లేషన్ తగ్గింది కాబట్టి, డిసెంబర్ సమావేశంలోనూ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచదని, వీలైతే తగ్గిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. తద్వారా, ఖరీదైన EMIల నుంచి ఉపశమనం దొరుకుతుందని ఆశిస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముడి చమురు ధరల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు, ప్రస్తుతం బ్యారెల్ రేటు 80 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5 శాతం దిగువకు జారడం RBIకి కలిసొచ్చే విషయం. ఆర్‌బీఐ ద్రవ్య విధాన (MPC) సమావేశం డిసెంబర్‌లో జరుగుతుంది. ద్రవ్యోల్బణంపై సెంట్రల్ బ్యాంక్ పూర్తిగా అప్రమత్తంగా ఉందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల చెప్పారు. ద్రవ్య విధానం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోందన్నారు.
మరో ఆసక్తికర కథనం: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial