Smartphones New Security Testing: మొబైల్ యూజర్ల కోసం కేంద్రం కొత్త రూల్స్ - ఇక ఆ యాప్స్ తొలగించేలా స్క్రీనింగ్!
Smartphones New Security Testing: భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబోతోంది.
Smartphones New Security Testing:
భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబోతోంది. ఇకపై మొబైల్ తయారీ కంపెనీలు స్మార్ట్‌ఫోన్లలో ముందుగానే ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌ను తొలగించేలా నిబంధనలు తీసుకురాబోతోంది.
అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌ను విడుదల చేసే ముందు స్క్రీనింగ్ చేయనుందని తెలిసింది. సరికొత్త భద్రతా నిబంధనల్లో భాగంగా కేంద్రం వీటిని ప్రతిపాదించింది. ఇద్దరు వ్యక్తులు, ప్రభుత్వ పత్రాల ద్వారా తమకీ విషయం తెలిసిందని రాయిటర్స్ పేర్కొంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారత్. సామ్‌సంగ్, షియామి, వివో, యాపిల్ మొబైల్ కంపెనీలకు ఇక్కడ గణనీయమైన వాటా ఉంది. వీరు స్మార్ట్‌ఫోన్లు రూపొందించే ముందే కొన్ని అప్లికేషన్లు మొబైల్ డివైజుల్లో ఇన్‌స్టాల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
స్మార్ట్ ఫోన్ యూజర్లపై నిఘా, సమాచార గోప్యత ఉల్లంఘన, సమాచారం బయటి దేశాలకు చేరే ప్రమాదం ఉండటంతో కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త నిబంధనలు తీసుకురాబోతోందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.
'మొబైల్ ఫోన్లలో ముందుగానే కొన్ని యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం భద్రతా పరంగా ఒక బలహీనమైన లొసుగు. దీని ఆధారంగా చైనా సహా విదేశాలు సమాచారం కొల్లగొట్టకుండా చూడటం మా బాధ్యత. ఇది జాతీయ భద్రతా అంశం' అని ఆ అధికారి వెల్లడించారు.
రెండేళ్ల క్రితం గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగారు. బాహాబాహీ తలపడ్డారు. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత ప్రభుత్వం చైనా వ్యాపారాలు, అప్లికేషన్లపై నిఘా పెట్టింది. టిక్‌టాక్ సహా 300కు పైగా చైనీస్ యాప్‌లను నిషేధించింది. డ్రాగన్ కంపెనీల పెట్టుబడులపై స్క్రీనింగ్‌ను ముమ్మరం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలూ చైనా కంపెనీలు, అప్లికేషన్లపై ఆంక్షలు పెడుతున్నాయి. హువావే, హిక్‌విజన్ వంటి సాంకేతిక సంస్థలు తమ పౌరులపై నిఘా పెడుతున్నాయని, వారి కదలికల సమాచారం బీజింగ్‌కు చేరవేస్తున్నాయని భావిస్తున్నాయి.
ప్రస్తుతం చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ ఉంటున్నాయి. వీటిని డివైజుల్లోంచి తొలగించేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు షియామిలో గెట్ యాప్స్, సామ్‌సంగ్‌లో సామ్‌సంగ్ పే మినీ, ఐఫోన్‌లో యాపిల్ సఫారీ బ్రౌజర్లను తొలగించేందుకు వీల్లేదు. కొన్ని గూగుల్ యాప్స్ సైతం ఇలాగే ఉంటున్నాయి. అందుకే వీటిని తొలగించే ఆప్షన్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోంది.
ఈ నిబంధనలు పాటించేలా బీఐఎస్ నేతృత్వంలో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే కస్టమర్లకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ విడుదల చేసే ముందు కచ్చితంగా స్క్రీనింగ్ చేయనుంది. 'భారత్‌లో వినియోగిస్తున్న చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ లేదా బ్లోట్‌వేర్ ఉన్నాయి. ఇది గోప్యత, సమాచార భద్రతకు అడ్డంకిగా మారాయి' అని ఫిబ్రవరి 8న ఐటీ మంత్రిత్వ శాఖ సమావేశంలో చర్చించారని తెలిసింది. ఇందులో షియామి, సామ్‌సంగ్, యాపిల్, వివో కంపెనీల ప్రతినిధులూ పాల్గొన్నారని సమాచారం.
సరికొత్త భద్రత నిబంధనలు అమలు చేసేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు ప్రభుత్వం ఏడాది గడువు ఇవ్వనుందని తెలిసింది. ప్రస్తుతం దేశంలో షియామి, వివో, ఒప్పొ కంపెనీలకు 50 శాతం వాటా ఉంది. సామ్‌సంగ్‌కు 20 శాతం, యాపిల్‌కు 3 శాతం వాటా ఉంది. స్మార్ట్ ఫోన్లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ తొలగించేలా ఐరోపాలో ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి. అయితే భారత్ అనుకుంటున్నట్టుగా స్క్రీనింగ్ మెకానిజం వారికి లేదు.