Sugar Export: ఇంక వాళ్లకు చేదే గతి! త్వరలో చక్కెర ఎగుమతులపై నిషేధం!
Sugar Export: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఏడేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులను నిషేధించేందుకు సిద్ధమవుతోంది.
Sugar Export:
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఏడేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులను నిషేధించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సరైన వర్షపాతం లేకపోవడంతో చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మోదీ సర్కార్‌కు మరో దారిలేదని రాయిటర్స్ రిపోర్టు చేసింది.
మహారాష్ట్ర, కర్ణాటకలో చెరకు పంటను ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది ఆయా రాష్ట్రాల్లో 50 శాతం సగటు కన్నా తక్కువగానే వర్షాలు కురిశాయి. దాంతో చెరకు పంటపై తీవ్ర ప్రభావం పడింది. అక్టోబర్లో కేంద్రం పంచదార ఎగుమతులపై నిషేధం విధిస్తుందని సమాచారం. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా చక్కెర ధరలు కొండెక్కుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
జులైలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠమైన 7.4 శాతానికి చేరుకుంది. ఇప్పుడు ఆహార పదార్థాల ధరలు పెరిగితే మూడేళ్లలోనే గరిష్ఠమైన 11.5 శాతానికి ఇన్‌ప్లేషన్ చేరుకోవచ్చు. సామాన్యులు ఇబ్బంది పడొద్దనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంటోందని తెలిసింది. రాబోయే 2023/24 సీజన్లో పంచదార ఉత్పత్తి 3.3 శాతం మేర తగ్గి 31.7 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. ప్రస్తుత సీజన్లో 6.1 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతించింది. అంతకు ముందు సీజన్లోని 11.1 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది సగమే.
చక్కెర ఎగుమతుల నిషేధాన్ని పక్కన పెడితే ఇథనాల్ ఉత్పత్తికి మిగులు చెరకును ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. 'స్థానిక చక్కెర అవసరాలు తీర్చడం, మిగులు చెరకుతో ఇథనాల్ ఉత్పత్తి చేయడం పైనే మేం దృష్టి సారిస్తున్నాం. రాబోయే సీజన్లో ఎగుమతి కోటాకు అవసరమైనంత పంచదార అందుబాటులో ఉండదు' అని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
ఆహార పదార్థాల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటోంది. స్థానిక అవసరాలకే పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే బాస్మతీ యేతర తెల్ల బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. ఉల్లిగడ్డల ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. 'ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యే పెరిగిన ధరలు చక్కెర ఎగుమతులపై నిషేధానికి కారణం కావొచ్చు' అని ఆ అధికారి వెల్లడించారు.
India Rice Ban: గత నెలలో, భారత ప్రభుత్వం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధింది. దీంతో, ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఆసియన్ కంట్రీస్ ఉలిక్కిపడ్డాయి. చాలా దేశాల్లో రైస్ సప్లైలో గందరగోళం ఏర్పడింది. USలో, ఐఫోన్ల కోసం క్యూ కట్టినట్లు బియ్యం కోసం డిపార్ట్‌మెంటల్ స్టోర్ల ముందు బారులు తీరారు.
అయితే.. జనం భయపడాల్సిన పని లేదని, యూఎస్‌లో రైస్‌కు కొదవలేదని USA రైస్ ఫెడరేషన్ ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్‌లో వినియోగిస్తున్న బియ్యంలో చాలా భాగం దేశంలోనే పండుతోందని, ఈ సంవత్సరం బ్రహ్మాండమైన దిగుబడి కూడా వచ్చిందని నచ్చజెప్పింది.
USA రైస్ ఫెడరేషన్ ఎన్ని విధాలా సర్దిచెప్పినా, అగ్రరాజ్యంలో ఆందోళన కనిపిస్తూనే ఉంది. భారత్ విధించిన నిషేధంతో యునైటెడ్ స్టేట్స్ సహా, భారతీయ బియ్యంపై ఆధారపడే దేశాలపై మీద బాగానే ఎఫెక్ట్ పడింది.
Also Read: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ రూల్స్ మారాయి, మీరు కచ్చితంగా తెలుసుకోవాలి